గత కొన్నాళ్లుగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తిదాయకంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితికి తాము ప్రత్యామ్నాయం అంటూ భారతీయ జనతా పార్టీ వాళ్లు ప్రకటించుకుంటూ ఉన్నారు. వివిధ అంశాల్లో కేసీఆర్ తీరును వారు విమర్శిస్తూ వస్తున్నారు. ఇక మోడీ విజయంపై కూడా ఇదివరకూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండోసారి ప్రధానిగా మోడీ ఎన్నికయ్యాకా..ఇప్పటి వరకూ కేసీఆర్ మీట్ కాని అంశం కూడా తెలిసిందే.
ఈ పరిణామాల మధ్యన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు కేసీఆర్. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా వివిధ అంశాల గురించి చర్చించనున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మోడీతో గట్టిగా రాజకీయంగా విబేధించిన మమతా బెనర్జీ కూడా ఇటీవలే ఆయనతో సమావేశం అయ్యారు. ప్రధానితో రాజకీయ విబేధాలు ఉన్నా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ సమావేశాలు అయితే తప్పవు.
ఆ సందర్భంలో రాజకీయాలను పక్కనపెట్టి వారు భేటీ అవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చినట్టుగా ఉంది. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీని అభినందించడంతో పాటు వివిధ అంశాల గురించి కేసీఆర్ మాట్లాడతారట. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశం సందర్భంగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ మేరకు కొన్నిమీడియా వర్గాలు వార్తలు రాయగా.. ఆ తర్వాత ప్రభుత్వాలు ఆ వార్తలను ఖండించాయి.