కీలక సమావేశంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు?

పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి సమావేశాలు నిర్వహించినా రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తుంటాయి. ఏం నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది.…

పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి సమావేశాలు నిర్వహించినా రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తుంటాయి. ఏం నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ రేపు అంటే మంగళవారం చాలా కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. 

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాక నిర్వహిస్తున్న కీలక సమావేశం కావడంతో ఆసక్తి రేపుతోంది. అప్పుడే రకరకాల ఊగాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ పాలనలో కీలక మార్పులు జరగవచ్చనే ప్రచారం కొన్ని వర్గాల నుంచి వస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో పాలనా పగ్గాల నుంచి తప్పుకుంటారనే వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం దిశగా జాతీయ స్థాయిలో అడుగులు వేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ ఓపెన్‌గానే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్‌కు పట్టాభిషేకం దిశగా కేసీఆర్ చర్యలు ఉండబోతున్నాయని.. మంగళవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే టాక్ వస్తోంది. 

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేటీఆర్ నాయకత్వంలోనే సాగుతాయని కొందరు గులాబీ నేతలు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలపై పార్టీ నేతల అభిప్రాయాలను సీఎం తీసుకుంటారని  తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మంతనాలు జరుపుతారని తెలుస్తోంది.  

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. 2018లోనూ కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ఈసారి కూడా ముందస్తుకు వెళ్లవచ్చనే చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుందంటారు. అసలు ఆయన పార్టీ సమావేశాలు చాలా తక్కువగా నిర్వహిస్తుంటారు. అలాంటిది లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్‌ కార్యవర్గం సమావేశం సంయుక్తంగా నిర్వహిస్తుండటంతో ఏదో కీలక నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది. 

మునుగోడులో పార్టీ నేతలంతా సమిష్ఠిగా పని చేసి పార్టీ అభ్యర్దిని గెలిపించారు. అయితే టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ఈడీ – ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీనిని టీఆర్ఎస్ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటోంది. రాజకీయ లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారని భావిస్తోంది. దీంతో..తెలంగాణలో 2018 తరహాలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

2023 చివరి త్రైమాసికంలో సరిగ్గా.. సంవత్సరంలోగా తెలంగాణకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదే సమయంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలంటే ముందుగా సొంత రాష్ట్రంలో బలం నిరూపించుకోవటం అవసరమని గులాబీ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మంగళవారం జరిగే పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి దిశా నిర్దేశం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. గతంలోనే పార్టీ ముఖ్య నేతలు ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసారు. కానీ, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అటు ప్రధానితో సహా బీజేపీ నేతలంతా తెలంగాణలో అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో.. ముందు గానే ఎన్నికలకు వెళ్లటం ద్వారా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.