మళ్లీ ఆఫీస్ బాట పట్టబోతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

ఏడాదిన్నరగా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ ఇప్పుడు వారిని తిరిగి ఆఫీస్ లకు పిలుస్తున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడం, థర్డ్ వేవ్ జాడ కనిపించే…

ఏడాదిన్నరగా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ ఇప్పుడు వారిని తిరిగి ఆఫీస్ లకు పిలుస్తున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడం, థర్డ్ వేవ్ జాడ కనిపించే అవకాశాలు లేవని తెలుస్తుండటంతో వ్యాక్సినేషన్ పూర్తయిన వారిని ఆఫీస్ లకు రావాలంటూ ఆదేశాలిచ్చాయి. విప్రో కంపెనీ ఉద్యోగులు ఈ రోజు నుంచి ఆఫీస్ లకు బయలుదేరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా అలవాటైన ఉద్యోగులంతా మళ్లీ ఇన్నాళ్లకు ఆఫీస్ కి వెళ్లేందుకు కాలు బయటపెడుతున్నారు, కార్లు బయటకు తీస్తున్నారు.

ప్రస్తుతానికి రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న ఉద్యోగుల్ని మాత్రమే ఆఫీస్ లకు అనుమతిస్తారట. ఆఫీస్ లలో కూడా కొవిడ్ ప్రొటొకాల్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇందు కోసం ఉద్యోగులకు ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఇస్తారు. రోజూ టెంపరేచర్ చెక్ చేస్తారు, శానిటైజర్ల వాడకం, సామాజిక దూరం తప్పనిసరి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకుంటా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎలాగూ ఉంటుంది.

మెల్లమెల్లగా ఉద్యోగుల్ని ఆఫీస్ లకు అలవాటు చేసి వచ్చే ఏడాదికల్లా పూర్తి స్థాయిలో ఉద్యోగులందర్నీ ఆఫీస్ లకు రప్పించాలనే ఉద్దేశంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. విప్రో ఆ దిశగా తొలి అడుగు వేస్తోంది, టీసీఎస్ కూడా ఉద్యోగుల్ని త్వరలోనే ఆఫీసులకు పిలవబోతోంది. టాటా సహా పలు ఇతర కంపెనీలు కూడా ఇదే విషయంపై తుది నిర్ణయం ప్రకటించబోతున్నాయి.

హైబ్రిడ్ మోడల్ వర్క్..

వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే అందరూ హడలిపోతున్నారు. అందుకే ఇప్పుడు మధ్యే మార్గంగా హైబ్రిడ్ మోడల్ వర్క్ అనే పద్ధతిని తెరపైకి తెస్తున్నారు.

అంటే గతంలో వారానికి రెండు రోజులు సెలవు తీసుకుని ఇంటి దగ్గరనుంచే అందుబాటులో ఉండే ఉద్యోగులు, ఇప్పుడు వారానికి రెండు రోజులు ఆఫీస్ కి వస్తారు, మిగతా ఐదు రోజులు ఇంటి వద్ద ల్యాప్ టాప్ పెట్టుకుని అందుబాటులో ఉంటారు. అంటే అవసరమైనప్పుడు ఆఫీస్ నుంచి, లేకపోతే ఇంటినుంచి ఎలాగైనా పనిచేసేందుకు ఉద్యోగుల్ని సిద్ధం చేస్తున్నారు.

ఉద్యోగులకు షాక్..

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పర్మినెంట్ కాకపోయినా ఇప్పుడప్పుడే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటారని ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలో కరోనా భయాలు తగ్గిపోవడంతో కంపెనీలు ధైర్యం చేస్తున్నాయి.

యాజమాన్యాలు ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకుంటాయని ఉద్యోగులు కూడా ఊహించలేదు. అయితే పిలుపు రావడంతో వెంటనే ల్యాప్ టాప్  సర్దుకుని ఆఫీస్ బాట పడుతున్నారు.

ఆర్థికంగా భారమే అయినా..

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మొదట్లో ఉద్యోగులకు లాభదాయకం అనుకున్నా.. ఆ తర్వాత అది కంపెనీలకే మేలు చేసే అంశమని తేలిపోయింది. ఆఫీస్ మెయింటెనెన్స్ పూర్తిగా జీరో. కరెంటు బిల్లు నుంచి వాటర్ బిల్లు వరకు, క్యాంటీన్ ఖర్చులు కూడా జీరో. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నా 24 గంటలు అందుబాటులో ఉంటారు. దీంతో సహజంగానే కంపెనీలకు శ్రమ తగ్గి, ఉద్యోగుల నుంచి వచ్చే ఔట్ పుట్ పెరిగింది. 

అయితే ఇటీల వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఈ దశలో కంపెనీలు కూడా ఉద్యోగుల్ని మెల్లమెల్లగా ఆఫీస్ లకు అలవాటు చేస్తున్నాయి. కరోనా కేసులు పెరగకపోతే.. ఈ ఏడాది చివరిలోగా సాఫ్ట్ వేర్ రంగంలో మళ్లీ సాధారణ స్థితి నెలకొంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.