ఆధారం చూపే నాధుడెవ్వడు?

రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేసేప్పుడు, సవాళ్లు విసురుకునేప్పుడు ఎడాపెడా మాటలు రువ్వుతారే తప్ప.. వాటికి తగిన ఆధారాలను ఎన్నడూ చూపించరు. సవాళ్లు విసురుకోవడం మాత్రం తమ హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు…

రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేసేప్పుడు, సవాళ్లు విసురుకునేప్పుడు ఎడాపెడా మాటలు రువ్వుతారే తప్ప.. వాటికి తగిన ఆధారాలను ఎన్నడూ చూపించరు. సవాళ్లు విసురుకోవడం మాత్రం తమ హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో.. బాలకృష్ణ వియ్యంకుడు (గీతం విద్యాసంస్థలు)కు ఎకరా లక్షవంతున భూకేటాయింపులు జరిగాయనే వ్యవహారం పెనుదుమారంగా మారుతోంది. ఇరుపక్షాలూ పరస్పర భిన్నవాదనలు వినిపిస్తుండగా.. ఎవ్వరూ ఆధారాలతో ముందుకురావడం లేదు.

రాజధాని ప్రాంతంలో 493 ఎకరాలను ఎకరా లక్ష రూపాయల వంతున బాలకృష్ణ చిన్నల్లుడి తండ్రికి (వియ్యంకుడికి) ఏపీఐఐసీ ద్వారా కట్టబెట్టారని, ఆ తర్వాత ఆ భూములను మొత్తం సీఆర్డీయే పరిధిలోకి తీసుకువచ్చారని.. బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సుజనా బినామీలుగా ఎవరెవరికి రాజధానిలో భూములున్నాయో వెల్లడించే క్రమంలో ఆయన ఈ మాటలన్నారు.

దీనికి గీతంసంస్థల ఛైర్మన్, ఇటీవలి ఎన్నికల్లో తెదేపా తరఫున విశాఖ ఎంపీగా పోటీచేసిన శ్రీభరత్ కౌంటర్ ఇచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా, బొత్స సత్యనారాయణ కూడా మంత్రిగా ఉన్నప్పుడే తమకు భూ కేటాయింపు జరిగిందని.. మంత్రి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. ఆ భూములను ఇప్పటిదాకా తమకు స్వాధీనం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు.

తాజాగా సీఆర్డీయే మీద సమీక్ష జరిగిన తర్వాత.. బొత్స సత్యానారాయణ కూడా మరో కౌంటర్ ఇవ్వడం విశేషం. ‘కుర్రాడు తెలియక మాట్లాడుతున్నాడు’ అంటూ… కిరణ్ కుమార్ రెడ్డి భూములు కేటాయిస్తే.. ఆ జీవో 2015లో ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు. భరత్ చెప్పింది నిజమైతే.. 2012లో భూములు ఇచ్చినట్లు జీవో చూపించాలన్నారు.

ఇరుపక్షాలూ వాదనలు బాగానే చేస్తున్నాయి. కానీ ఏ ఒక్కరూ జీవో కాపీలు బయటపెట్డంలేదు. కనీసం బొత్స అయినా.. 2015లో జీవో వచ్చినట్లుగా కాపీ బయటపెడితే.. శ్రీభరత్ మాటలను మరింతగా ఎండగట్టవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. పిల్లిమెడలో గంట కట్టేదెవ్వరు అన్న సామెత చందంగా.. ఆధారాలు చూపేదెవ్వడు అని వేచిచూడాల్సి వస్తోంది.

శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే!