బిసిలను మరింత దగ్గర చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా తెలిసి చేస్తున్నాయో, తెలియక చేస్తున్నాయో కానీ బిసి వర్గాలను వైకాపాకు పూర్తిగా దగ్గర చేస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు అమలాపురంలో కాపులకు రిజర్వేషన్ మీద జగన్ కుండబద్దలు…

తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా తెలిసి చేస్తున్నాయో, తెలియక చేస్తున్నాయో కానీ బిసి వర్గాలను వైకాపాకు పూర్తిగా దగ్గర చేస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు అమలాపురంలో కాపులకు రిజర్వేషన్ మీద జగన్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. అప్పట్లో అంతా జగన్ రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమైన ప్రకటన చేసారు అనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చిన తరువాత తెలిసింది ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పో.. కాపుల ఓట్లను జగన్, పవన్, బాబు ముగ్గురు రకరకాలుగా పంచుకున్నారు. బిసిల ఓట్లను జగన్ స్వంతం చేసుకున్నారు. 

మళ్లీ ఇప్పుడు అదే చేస్తున్నారు. కాపులకు జగన్ అన్యాయం చేస్తున్నారు. కాపులను అణిచేస్తున్నారు అనే ప్రచారానికి తెర తీసారు. నిజానికి కాపులకు మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇచ్చారు. కాపులకు వివిధ పథకాల కింద సాయం అందిస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ అందుకున్న రాగం ఏమిటి? ఆర్థికంగా వెనుకబఢిన తరగతుల కోసం ఇచ్చిన దాంట్లో అయిదు శాతం కాపులకు ఇచ్చేయమంటారు. ఇది కాపులకు ఆనందం కలిగించవచ్చు. కానీ మిగిలిన వారికి? అన్ని కులాల్లో వున్న ఆర్థికంగా వెనుకబడిన వారు ఇప్పుడు ఎలా స్పందిస్తారు? మాకు ఇచ్చిన రిజర్వేషన్లు కాపులకే ఇచ్చేయమని ఎలా డిమాండ్ చేస్తారు? అనేగా?

ఆ విధంగా తెలుగుదేశం, జనసేన రెండూ కాపు యేతర వర్గాలకు దూరం అవుతున్నాయి. పోనీ అలా అని కాపుల ఓట్లు గంప గుత్తగా ఈ రెండు పార్టీలకే పడిపోతాయా అంటే అనుమానమే. కాపు నాయకులు వైకాపాలోనూ వున్నారు. కాపు అభిమానులు ఆ పార్టీకి వున్నారు. ఎటొచ్చీ ఓట్ల శాతం ఎక్కువా తక్కువా కావచ్చు.  కానీ కాపులనే భుజాన వేసుకోవడం ద్వారా దేశం, జనసేన మరోసారి బిసి లకు దూరం చేసుకుంటున్నాయి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని దూరం చేసుకుంటున్నాయి. 

ఈ స్టాండ్ ఆ పార్టీలకు కాస్త మైనస్ నే అవుతుందని మరోసారి ఎన్నికలు వచ్చాక అర్థం అవుతుంది.

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు