సినిమా క్రిటిక్స్ మమ్మల్ని చంపేస్తున్నారు

నేనొక దర్శకుడిని.  Advertisement ఇలా చెప్పుకోవడం కోసం ఊహ తెలిసినప్పటి నుంచీ కలలు కన్నాను.   మొత్తానికి కొన్నేళ్ల క్రితం మొదటి సినిమా అవకాశం వచ్చింది. కథ నచ్చి ఒక నిర్మాత ముందుకొచ్చారు. కొత్త నటీనటులతో…

నేనొక దర్శకుడిని. 

ఇలా చెప్పుకోవడం కోసం ఊహ తెలిసినప్పటి నుంచీ కలలు కన్నాను.  

మొత్తానికి కొన్నేళ్ల క్రితం మొదటి సినిమా అవకాశం వచ్చింది. కథ నచ్చి ఒక నిర్మాత ముందుకొచ్చారు. కొత్త నటీనటులతో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో సినిమా తీయగలిగాను. నిర్మాత తొలి కాపీ చూసి కౌగిలించుకున్నారు. ఆ క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కన్నా నిర్మాత మెచ్చుకున్నప్పుడే నిజమైన గెలుపు అనిపించింది. సినిమా రిలీజయ్యింది. కానీ ఆడలేదు. “గెలుపోటములు దైవాధీనాలు, మళ్లీ ప్రయత్నిద్దాం, నాకు కోలుకోవడానికి రెండేళ్లు పడుతుంది.. ఈ లోగా మరొక కథ రెడీ చేసుకో” అన్నారు. అన్నట్టు ఆ సినిమాని క్రిటిక్స్ పొడుచుకు తిన్నారు. 

రెండో కథ రెడీ అయ్యింది. ఆర్నెల్లకే ఒకాయనికి కథ చెప్పాను. ఆయన నిర్మాతవుతానన్నారు. తొలి అవకాశం ఇచ్చినాయనకి చెప్తే కచ్చితంగా చేయమన్నారు. మళ్లీ అంతే శ్రద్ధతో సినిమా తీయడం, రిలీజవ్వడం జరిగాయి. మళ్లీ ఫ్లాప్ అయ్యింది. ఈ సారి క్రిటిక్స్ ఒక ఆట ఆడుకున్నారు. 

గత ఐదారేళ్లుగా మూడో కథ రాసుకునే ధైర్యం రావట్లేదు. కారణం ఫ్లాపులు కాదు. క్రిటిక్స్ రాసే రివ్యూలు. కింద పడిన దానికంటే ఎవరో నవ్వినప్పుడు ఎక్కువ ఏడుపొస్తుంది. 

తర్వాత చాలా నాళ్లు అయోమయంలో ఉన్నాను. నేను తీసిన సినిమాల్ని తిట్టారని కాదు, అసలెలాంటి సినిమాల్ని పొగుడుతారో తెలియక. పొగడ్తలెందుకు? మంచి సినిమా తీసి హిట్ కొట్టి ఏడవక…అనొచ్చు. కానీ, మనిషికి పొగడ్త తనపై తనకి నమ్మకాన్నిస్తుంది. ఆ నమ్మకంతో తప్పులు దిద్దుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కానీ దారుణమైన విమర్శలు చేస్తుంటే అడుగు ముందుకు వెయ్యలేక ఉన్నచోటే చతికిలబడిపోతాడు. 

జీవితంలో కొన్ని హిట్లు, చప్పట్లు చూసిన దర్శకులకి మధ్యలో ఇలాంటి రివ్యూలొచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ తొలి అడుగులు వేసే వాడిని కూడా కుళ్లబొడిస్తే వాడిలో వచ్చే మార్పుని కూడా చంపేసినట్టే. 

నేను నిజంగా ఆడియన్స్ కి నచ్చేలాగ, క్రిటిక్స్ మెచ్చుకునేలాగ ఎటువంటి సినిమా తీయొచ్చో తెలుసుకుందామని చాలా రివ్యూలు చదివాను. 

ఒక రిమేక్ సినిమాని కాస్త మారిస్తే, “ఒరిజినల్ సినిమాని కంగాళీ చేసి మొత్తం ఫ్లావర్ మార్చేసాడు దర్శకుడు. ఇంతోటి దానికి రైట్స్ కొనిపించడమెందుకు..నిర్మాతకి బొక్క” అని డైరక్టర్ని ఆడుకున్నారు. 

మరొక దర్శకుడు ఇంకొక పరభాషా సినిమాని ఫ్రేము కూడా మార్చకుండా యథా తథంగా రిమేక్ చేస్తే, “కాపీ పేస్ట్ చేసాడు తప్ప ఒరిజినాలిటీ ఏం లేదు. ఈ మాత్రం దానికి డైరెక్టర్ ట్యాగ్ అవసరమా” అని ఎద్దేవా చేసారు. 

మరొక సినిమా రివ్యూలో “ఈ సినిమా చూడ్డం కన్నా సూదులుతో గుచ్చుకుంటే సమ్మగా ఉంటుంది” అని రాసారు.

“హాల్లోంచి పారిపోవాలనిపించింది”, “అనేక నిరాశాజనక చిత్రాల సరసన ఈ సినిమా కూడా చేరిపోతుంది, “ఇదో వింత బాధ”, “దీనిని డి -గ్రేడ్ సినిమా అంటే “డి” అనే అక్షరం ఏడుస్తుంది.”..ఇలా చాలా రకాలుగా అప్పుడే విడుదలైన సినిమాని శపించి దర్శకుడి మానసిక స్థైర్యాన్ని చంపేస్తున్నారు క్రిటిక్స్. 

ఇవన్నీ చదివాక సినిమాలు తీయాలన్న ఆసక్తి చచ్చిపోయింది. ఒక్కోసారి అనిపిస్తుంది. సినిమాలు తీయడం కంటే రివ్యూలు రాసుకోవడం బెటరేమో అని. ప్రతివారం చేతినిండా పని ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఆ పని చేసి ఇంకెంతమంది దర్శకులని మానసికంగా చంపాలో..ఆ పాపం నాకెందుకులే, అనిపించి వద్దనిపిస్తుంది. 

ప్రతి దర్శకుడికి తను తీసిన సినిమాని సొంత బిడ్డగా భావిస్తాడు. పుట్టిన తన బిడ్డని “ఇంత అనాకారిగా ఉందేంటి..ఛీ” అని మొహమ్మీదే అంటే ఒక తల్లి ఎంత బాధపడుతుందో దర్శకుడు కూడా తన సినిమాని విడుదలైన రోజే ఛీగొడితే అంతే బాధపడతాడు. ఈ మానసిక హింస చేసి సంపాదించిన దాంతో ఎలా తింటారు? 

దయచేసి క్రిటిక్స్ ని తిడుతున్నానని అనుకోకండి. నేను చాలా చిన్నవాడిని. పదితలల పాములాంటి మీడియా వ్యవస్థ ముందు నేనొక చిన్న చీమని. కేవలం నా బాధని, నాతోటి వాళ్ల బాధని పంచుకుంటున్నానంతే. కుదిరితే క్రిటిక్స్ ని ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నాను. 

ఈ ఆర్టికల్ ఈ వెబ్సైట్లో రాసే వాళ్ల మీద వ్యతిరేకంగా రాస్తున్నది కాదు. మీడియా అంటే అందరికీ చెందినదై ఉండాలి. నేను కూడా సమాజంలో ఒకడిని. నా గోడుని వినిపించుకుంటున్నాను. సభ్యమైన పదజాలంతోనే రాసాననుకుంటున్నాను.  నేను రాసింది తప్పంటే ఎందుకు తప్పో తెలియజేయండి. సరిదిద్దుకుంటాను. 

– ఒక సినీ దర్శకుడు