రాజకీయాలకు, బండ్ల గణేశ్‌కు అసలు సఖ్యత కుదరనట్టుంది. గతంలో రాజకీయాలపై మోజుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బండ్ల గణేశ్ ప్రధాన కమెడియన్ పాత్ర పోషించారనే సరదా కామెంట్స్ లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఒకవేళ రాని పక్షంలో బ్లేడ్‌తో గొంతుకోసుకుంటానని సంచలన ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
దీంతో బండ్ల గణేశ్ ఎక్కడున్నారంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెట్టారు. చివరికి ఆయన తిరుమలలో శ్రీవారి చెంత ప్రత్యక్షమయ్యారు. బ్లేడ్‌తో గొంతు కోసుకుంటాననే మాటపై మీడియా గట్టిగా నిలదీసింది. ఎన్నికలన్న తర్వాత సవాలక్ష అంటుంటామని, వాటన్నింటిపై ఎలా నిలబడతామని ఆయన ఎదురు ప్రశ్నించి మీడియాని కంగుతినిపించారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై అని ప్రకటించారు.
ఇటీవల సోషల్ మీడియాకి గుడ్‌బై చెబుతూ ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇదేమని ప్రశ్నించడంతో… కనీసం ఒక రోజు కూడా గడవకనే నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నారు. ఇలా ఏది చేసినా ప్రచారం మాత్రం మస్తు. తన ప్యానల్‌కు అధికార ప్రతినిధిగా బండ్ల గణేశ్‌ను ప్రకాశ్ రాజ్ ప్రకటించి కనీసం 24 గంటలు కూడా గడవకనే…ఆయన ఆ ప్యానల్‌కి దూరమై షాక్ ఇచ్చారు.
జీవితా రాజశేఖర్ ఆగమనాన్ని వ్యతిరేకిస్తూ “మా” ఎన్నికల్లో బండ్ల గణేశ్ సంచలనానికి తెరలేపారు. సినిమాలకు సంబంధించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ గురించి అందరికీ తెలిసిందే. కానీ రాజకీయ పరంగా ఓ సినిమా వ్యక్తి వివాదాస్పదం కావడానికి ఇటీవల బండ్ల గణేశ్‌ను ఉదహరించుకోవాల్సిన పరిస్థితి. అవి సాధారణ లేదా సినిమా రాజకీయాలైనా… ఏవైనా కావచ్చు.
బండ్ల గణేశ్ నేరుగా జీవితా రాజశేఖర్‌ను అటాక్ చేయడాన్ని చూస్తే… అతని వెనుక ఏవో బలమైన అదృశ్య శక్తులున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జీవితా రాజశేఖర్ ఆచితూచి మాట్లాడ్డాన్ని చూస్తే …నష్టపోతానేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈ మాటల వెనుక మర్మమేంటో అర్థం చేసుకోవడం ఈజీ.