మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. సొంత పార్టీకి వ్యతిరేకంగా పని చేసే ప్రజాప్రతినిధుల్ని కూడా విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన సోదరిగా అభివర్ణించే సీతక్క విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి, తన సోదరుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వెంకటరెడ్డి మద్దతు ఇవ్వడంపై ఆమె మండిపడ్డారు. వెంకటరెడ్డి ఓ దుర్మార్గుడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వెంకటరెడ్డిని కాంగ్రెస్ పక్కన పెట్టాలని ఆమె డిమాండ్ చేయడం విశేషం. కాంగ్రెస్ ఎంపీగా వుంటూ, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని వెంకటరెడ్డి ఎలా ప్రచారం చేస్తారని ఆమె నిలదీశారు.
రాజకీయాలంటే బంధాలకు అతీతమన్నారు. తమ్ముడే గెలవాలని అనుకుంటుంటే కాంగ్రెస్ కండువాకు బదులుగా బీజేపీ కండువా వేసుకోవాలని సీతక్క హితవు చెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలవకుండా ఆస్ట్రేలియాకు వెళ్లడం ఏంటని సీతక్క నిలదీశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్‌రెడ్డి, సీతక్క టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి వర్గంగా సీతక్క గుర్తింపు పొందారు. రేవంత్‌రెడ్డే సీతక్కతో మాట్లాడిస్తున్నారని కోమటిరెడ్డి అనుచరులు అనుమానిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.
తనను కాదని రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీర్ణించుకోలేకున్నారు. మునుగోడులో అందుకే కాంగ్రెస్‌కు ఆయన మద్దతు ఇవ్వకుండా, లోలోప తమ్ముడికి ప్రచారం చేస్తుండడం విమర్శలపాలవుతోంది.