జగన్ సర్కార్ను మోడీ సర్కార్ అనుమానిస్తోందా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ అనుమానించే పరిస్థితి. దీనికి ఏపీ ప్రభుత్వ విధానాలు కూడా ఊతమిస్తున్నాయని చెప్పక తప్పదు.
మొత్తానికి ఏపీ, కేంద్ర ప్రభుత్వం మీద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనుమాన కాపురం సాగుతోంది. దీనికి తాజా ఉదాహరణ…కరోనా వైరస్ నివారణపై ఖర్చు పెట్టిన లెక్కల వివరాలను అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం అడగడమే.
ఇప్పటికే ఇతరేతర ఆర్థిక లావాదేవీల వివరాలపై అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ కిందామీదా పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కరోనా ఖర్చు లెక్కల్ని కూడా అడుగుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చకు దారి తీసింది.
ఇందులో భాగంగా సమగ్ర సమాచారం రాబట్టేందుకు కీలక ప్రశ్నల్ని సంధించినట్టు తెలుస్తోంది. వైరస్ నివారణ, నియంత్రణ కోసం ఖర్చు చేసిన నిధులెన్ని? అందులో రాష్ట్ర, కేంద్ర నిధులు ఎంతెంత? ఆ నిధులు ఖజానాలో ఉంచి ఖర్చు చేశారా? బ్యాంకుల్లో ఉంచి ఖర్చు చేశారా? బ్యాంకులైతే రిజర్వు బ్యాంకు అనుమతిచ్చిన బ్యాంకులా.. ఇతర బ్యాంకులా? తదితర ప్రశ్నలకు సమాధానాలు కావాలని ఏజీ కార్యాలయం కోరింది.
ఇంతటితో విడిచి పెట్టలేదు. నిధులను ప్రభుత్వ ఖాతాల్లో ఉంచి ఖర్చు చేశారా? బయటి ఖాతాల్లో ఉంచి ఖర్చు చేశారా? బయటి ఖాతాల్లోనైతే అలా ఎందుకు చేశారు? తదితర ప్రశ్నలతో ఏజీ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కరోనా కాలంలో సగటున నెలకు 350 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.
కరోనా లెక్కలకు సంబంధించి తమపై ఏవో అనుమానాలు ఉండడం వల్లే… ఏజీ కార్యాలయం ఇప్పుడీ లేఖ రాసిందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఏది ఏమైనా నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తోందనే ప్రచారం …ప్రతిదీ అనుమానించే పరిస్థితి తెచ్చి పెడుతోందనే వాదన లేకపోలేదు.