రావణుడికి పది తలలే ఉంటాయి. కానీ ఈ రావణుడికి మాత్రం వంద తలలు. సుల్తాన్ సినిమాలో కార్తి డైలాగ్ ఇది. దీని వెనక ఓ లాజిక్ కూడా ఉంది. ఓ కారణం వల్ల తమ ఊరికి వచ్చిన వంద మంది రౌడీలను లీడ్ చేసే సుల్తాన్‌గా కార్తి కనిపిస్తున్నాడు. వాళ్లను తన అన్నలుగా చెబుతాడు. అందుకే కార్తికి వంద తలలన్నమాట. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.
అది ఒక ఏనుగు గుంపు అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో సుల్తాన్ ట్రయిలర్ ప్రారంభమైంది. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు రొమాంటిక్ అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ట్రయిలర్ లో కార్తి, క్లాస్-మాస్ గెటప్స్ లో కనిపించి ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక హీరోయిన్ రష్మిక, అందమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది.
ట్రయిలర్ ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమా కథ కాస్త కొత్తగా ఉండేలా ఉంది. 2 నిమిషాల 16 సెకెన్ల రన్ టైమ్ ఉన్న ఈ ట్రయిలర్ లో స్టోరీలైన్ చెప్పడం కంటే, పాత్రల్ని పరిచయం చేయడంపై మేకర్స్ ఎక్కువగా దృష్టిపెట్టినట్టు అనిపిస్తోంది.
వివేక్ మెర్విన్ నేపథ్య సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ట్రయిలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను వరంగల్ శ్రీను దక్కించుకున్నారు. ఏప్రిల్ 2న థియేటర్లలోకి రాబోతోంది సుల్తాన్.