లాక్ డౌన్ -4 అని చెప్పి భారీ ఎత్తున ఇచ్చిన మినహాయింపులు ఇప్పుడు కరోనా వ్యాప్తికి మరింత సహకరిస్తున్నాయేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా నాలుగో దశ లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపుల తర్వాత కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికిమొన్న 5600 కేసులు వస్తే అదే అత్యథికం అనుకున్నాం. కానీ 24 గంటల్లోనే ఆ లెక్క మారిపోయింది. ఈసారి ఏకంగా 6వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అవును.. గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏకంగా 6088 కొత్త కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్-4 కింద ఇచ్చిన సడలింపుల వల్లనే ఈ కేసుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అటు నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 148 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 3583కు చేరుకుంది. ఈరోజు ఉదయం 8 గంటల నాటికి 48వేల మందికి పైగా డిశ్చార్జ్ అవ్వగా.. 66వేల మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసుల సంఖ్య 118,447కు చేరుకుంది.
రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. ఎప్పట్లానే మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పాతుకుపోయింది. నిన్న ఏకంగా 2345 కేసులు నమోదయ్యాయి. అటు తమిళనాడులో కొత్తగా 776, ఢిల్లీలో 571 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 41,642, తమిళనాడులో 13,967, గుజరాత్ లో 12,905 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1454 మంది, గుజరాత్ లో 773 మంది మరణించారు.
అటు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. 24 గంటల్లో ఒకేసారి లక్ష కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇటు భారత్ లో, అటు ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిసారి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 51,94,879 మంది కరోనా బాధితులున్నారు.