ఈ నెలాఖరుతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త ఎస్ఈసీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు నీలం సాహ్ని, ప్రేమ్‌చంద్రారెడ్డి , శామ్యూల్ పేర్లను గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలిసింది.
ఈ ముగ్గురిలో శామ్యూల్, నీలం సాహ్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరొందారు. శామ్యూల్ రిటైర్డ్ అయిన తర్వాత జగన్ కీలక పదవి ఇచ్చారు. నవరత్నాల అమలుకు ప్రత్యేక అధికారిగా ఆయన్ను నియమించారు. అలాగే సీఎం జగన్‌కు సలహాదారుగా శామ్యూల్ నియమితులయ్యారు. నవరత్నాల కార్యక్రమానికి వైస్ చైర్మన్‌గా వ్యవహస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని గత ఏడాది డిసెంబర్ చివర్లో పదవీ విరమణ చేశారు. గతంలో ఆమె పదవీ కాలం ముగిసినా రెండు సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసి పొడిగించేలా చేసిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ అనంతరం సీఎం సలహాదారుగా నియమిస్తూ ఆమెకు కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, విభజన అంశాలు వంటి కీలక బాధ్యతలను నీలం సాహ్నికి జగన్ ప్రభుత్వం అప్పగించింది. వైద్య ఆరోగ్యం , కోవిడ్ మేనేజ్మెంట్, గ్రామ సచివాలయాల బలోపేతం వంటి కీలక బాధ్యతలు కూడా నీలం సాహ్నికే జగన్ ప్రభుత్వం అప్పగించింది.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ఏర్పడిన విభేదాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం నమ్మకస్తులైన వారిని కీలక పదవిలో నియమించుకునేందుకు తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పైన పేర్కొన్న ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లను గవర్నర్‌కు పంపినట్టు సమాచారం. వీరిలో నీలం సాహ్ని, శామ్యూల్‌లో ఎవరికో ఒకరికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.