ఎన్నాళ్లీ కర్ర పెత్తనం.. మనం మారలేమా?

మే-17 తర్వాత లాక్ డౌన్ నిబంధనలు మరింతగా సడలించేందుకే కేంద్రం మొగ్గు చూపుతోంది. ఆల్రెడీ రైళ్లు కూడా నడుస్తున్నాయి. అయితే ఇదే సమయలో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టాలపై కూడా ప్రధాని ఆందోళన…

మే-17 తర్వాత లాక్ డౌన్ నిబంధనలు మరింతగా సడలించేందుకే కేంద్రం మొగ్గు చూపుతోంది. ఆల్రెడీ రైళ్లు కూడా నడుస్తున్నాయి. అయితే ఇదే సమయలో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టాలపై కూడా ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. భౌతిక దూరం పాటించని చోట, ప్రజలు అలసత్వంగా ఉన్న చోట కేసులు ఎలా పెరిగాయో తనకు తెలుసన్న మోడీ, ఆంక్షలు సడలించినా లాక్ డౌన్ కొనసాగుతుందని, రాత్రి పూట కర్ఫ్యూ వాతావరణం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ ఉండగానే.. ఎంతమంది ఆడంబరంగా పెళ్లి వేడుకలు, పుట్టినరోజు వేడుకలు చేసుకోడానికి తహతహలాడారో, ఇంకెంతమంది రోడ్లపైకి రావడానికి అబద్ధాలు చెప్పారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోటా ప్రభుత్వాలు కర్ర పట్టుకుని నిలబడాలంటే కుదరదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి, భౌతిక దూరం వారికి వారుగా అలవాటు చేసుకోవాలి, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అలా చేస్తేనే కరోనాని కట్టడి చేయగలం.

లాక్ డౌన్ తీసేశారు కదా అని, గుంపులు గుంపులుగా పోగై కరోనాకి స్వాగతం పలికితే మాత్రం ఒక్కరు చేసిన పాపానికి వందలమంది బలైపోతారు. వైన్ షాపుల ప్రారంభంతోనే ప్రజల్లో ఏపాటి క్రమశిక్షణ ఉందో అర్థమైంది. జీవితంలో మందు ఎప్పుడూ తాగనట్టు, అదేదో అమృతం అయినట్టు, క్వార్టర్ పడితే 100 ఏళ్లు బతికే బలం వస్తున్నట్టు.. మందు షాపుల ముందు ఎగబడ్డారు.

మరికొన్ని రోజుల్లో మిగతా కార్యకలాపాలు మొదలైనా ఇలాంటి రద్దీయే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా హాళ్లు తెరిచినా, గతంలో ఎప్పుడూ థియేటర్ మొహమే చూడనట్టు పరిగెడతారు. షాపింగ్ మాల్స్ తెరిచినా కూడా ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తారనుకోలేం.  కూరగాయల షాపు ముందు, పాల బూత్ దగ్గర క్యూలైన్లో దూరం దూరంగా నిలబడే ఓపిక జనం దగ్గర ఏమాత్రం లేదు.

అతివేగం ప్రమాదమనీ, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ప్రాణం పోతుందని తెలుసు. అయినా ఎంతమంది రూల్స్ ప్రకారం వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకుంటున్నారు? అదేమంటే మా ప్రాణం గురించి మాకు తెలుసు, ముందు మీరు రోడ్లు సరిగ్గా వేయండి అని ఎదురు ప్రశ్నించే లోకం ఇది. ఇలాంటి సమాజం కరోనాకి భయపడి, నిబంధనలు పాటిస్తుందంటే నమ్మలేం.

కరోనా భయం పోయే వరకు వీరందర్నీ కర్రపట్టుకుని బెదిరించాలంటే ఉన్న పోలీసు బలగం సరిపోదు. భౌతిక దూరం పాటించే విషయంలో ప్రజలందరిలో అవగాహన వస్తేనే లాక్ డౌన్ నిబంధనలు తొలగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే పోలీసులు, ప్రభుత్వాల హెచ్చరికలతో ఫలితం శూన్యం. పోలీసుల చేతిలో కర్ర ఉండక్కర్లేదు, మనలో కమిట్ మెంట్ ఉంటే చాలు. 

ఆగలేక స్వయంగా మాట్లాడిన చిరంజీవి