“నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. జలుబుతో చాన్నాళ్లుగా బాధపడుతున్నాను. అదే జలుబుతో సిరిసిల్ల వెళ్లాను. అప్పటికప్పుడు పర్యటన రద్దు చేసుకుంటే చాలామంది ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకే జలుబుతోనే సిరిసిల్ల వెళ్లాను.”
ఇలా తన ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఉన్నఫలంగా కేటీఆర్ ఇలా తన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో ఆరాలు తీయడం మరింత ఎక్కువైంది. ఇంతకీ దీని వెనకున్న అసలు కారణం ఏంటి?
ఎన్నో పర్యటనల్లా సిరిసిల్ల పర్యటనలో కూడా పాల్గొన్నారు కేటీఆర్. కాకపోతే విపరీతమైన జలుబుతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలే కరోనా కాలం ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానించే పరిస్థితులున్నాయి. ఇలాంటి టైమ్ లో కేటీఆర్ చాలాసార్లు తుమ్మారు. కొన్ని సార్లు దగ్గారు. ముక్కు తుడుచుకున్నారు. ఆ వీడియోలు నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కరోనా టైమ్ లో ఇలా జబులుతో నలుగురి మధ్యలోకి వచ్చే బదులు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో చాలామంది కేటీఆర్ కు ఉచిత సలహాలిచ్చారు. మరికొంతమంది అసలు కేటీఆర్ ఎందుకు వైద్యపరీక్షలు చేయించుకోరంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో తనపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ట్వీట్ చేశారు కేటీఆర్.
చాన్నాళ్లుగా తను జబులుతో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఎవరికైనా అసౌకర్యం కల్గించి ఉంటే క్షమించాలని కోరారు. కేటీఆర్ ట్వీట్ తో ఈ గొడవ ఇక్కడితో సద్దుమణిగింది.