లోక్ సభ స్పీకర్ గా ఎవరు ఎన్నిక కానున్నారనే అంశంపై చర్చ కొనసాగుతూ ఉంది. ఒకవైపు ప్రొటెం స్పీకర్ ఎంపీల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తొలిరోజు దాదాపు సగంమంది ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగగా, రెండో రోజున మిగతా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. మంగళవారంతో ఆ కార్యక్రమం దాదాపుగా పూర్తి కానుంది.
బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉండవచ్చు. ఈ విషయంలో ఇప్పటి వరకూ బీజేపీ వర్గాలు అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. ఫలానా ఎంపీని లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకోనున్నట్టుగా అధికార పక్షం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వివిధ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి.
ముందుగా మేనకాగాంధీని లోక్ సభకు స్పీకర్ గా చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుందని సమాచారం. ఆమెకు కేంద్రమంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు మోడీ. దీంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. లోక్ సభ స్పీకర్ పదవిని చేపట్టాలని ఆమెను కోరగా.. ఆమె అందుకు గట్టిగా నో చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారట మోడీ, అమిత్ షా.
అందులో భాగంగా ప్రొటెం స్పీకర్ గా చేసిన వీరేంద్రకుమార్ నే స్పీకర్ గా చేయబోతున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో కమలనాథులు మళ్లీ పునరాలోచన చేస్తున్నారట. తాజాగా రాజస్తాన్ కు చెందిన ఎంపీ ఓం బిర్లాను లోక్ సభ స్పీకర్ గా నియమించవచ్చు అనే ప్రచారం సాగుతూ ఉంది. ఈయన అదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సారికి ఆయననే స్పీకర్ గా చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట.