మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీకి 'గుడ్ బై' చెప్పేయడం దాదాపు ఖాయమైపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే, గంటా చేరిక విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంత సానుకూల వాతావరణం కన్పించడంలేదు.
నిజానికి, ఎన్నికలకంటే ముందే గంటా శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీలో చేరిపోవాలనుకున్నారు. ఆయన రాకను వైసీపీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో, గంటా వెనక్కి వుండిపోవాల్సింది.. అనూహ్యంగా అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు, ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి కూడా వచ్చింది. అవంతిని తొలుత ముందుకు నెట్టి, ఆ తర్వాత గంటా తనదైన రాజకీయాలు చేయడం అప్పట్లోనే వైసీపీకి నచ్చలేదు. అలాంటిది, ఇప్పుడు గంటా శ్రీనివాసరావుని వైసీపీ ఎలా తమ పంచన చేర్చుకుంటుంది.?
అయితే, గంటా శ్రీనివాసరావు రూటే సెపరేటు. ఎలాంటి పరిస్థితుల్ని అయినా తనకు అనుకూలంగా మార్చేసుకోగలరాయన. మంత్రి అవంతి శ్రీనివాస్ ద్వారానే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మంతనాలు షురూ చేశారట వైసీపీలో చేరేందుకు. మరోపక్క, రెండో ఆప్షన్‌గా భారతీయ జనతా పార్టీని కూడా గంటా శ్రీనివాసరావు ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 'ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఓకే.. టీడీపీలో మాత్రం వుండడం మాకిష్టం లేదు..' అని గంటా అనుచర వర్గం చెబుతుండడం గమనార్హం.
సరిగ్గా ఎన్నికలకు కొద్దినెలల ముందు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో గంటా శ్రీనివాసరావు 'పంచాయితీ' పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో విశాఖ పర్యటనకు చంద్రబాబు వెళితే, అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుని ఆ టూర్‌కి రప్పించడానికి టీడీపీ నేతలు పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. మరోపక్క, టిక్కెట్ ఎంపిక విషయంలోనూ గంటా వర్సెస్ చంద్రబాబు.. చాలా పెద్ద రచ్చే జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న గంటా, రాష్ట్రంలో ఎటూ టీడీపీకి భవిష్యత్తు లేదు గనుక, తన భవిష్యత్తుని వెతుక్కుంటున్నారు.
టీడీపీని వీడటమైతే ఖాయమైపోయింది.. వైఎస్సార్సీపీ దయతలుస్తుందా.? లేదంటే బీజేపీ వైపుకు గంటా వెళ్ళాల్సిందేనా.? వేచి చూడాల్సిందే.