జగన్ కు హోదాపై ఎందుకంత తొందర..?

ఏపీ ప్రత్యేకహోదాపై సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు చూస్తుంటే కొంతమంది వైసీపీ నేతలకే ఆశ్చర్యమేస్తోంది. ప్రత్యేక హోదాకి తమ పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలుసు కానీ, కనీసం పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు…

ఏపీ ప్రత్యేకహోదాపై సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు చూస్తుంటే కొంతమంది వైసీపీ నేతలకే ఆశ్చర్యమేస్తోంది. ప్రత్యేక హోదాకి తమ పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలుసు కానీ, కనీసం పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు కాకముందే జగన్ ఇంత స్పీడ్ అవుతారని ఎవరూ ఊహించలేదు. నీతిఆయోగ్ వేదికగా కేంద్రం మెడపై కత్తి పెడతారని అంచనా వేయలేదు.

అయితే జగన్ వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఖజానా ఖాళీ చేసి మహా బాగా తప్పించుకున్నారు చంద్రబాబు. జగన్ వచ్చీరాగానే పింఛన్లు పెంచారు, కొన్నివర్గాల జీతాలను రెట్టింపుకి మించిపెంచారు. అమ్మఒడి, వైఎస్సార్ రైతు భరోసా వంటి కార్యక్రమాలతో ఖజనాపై భారీగానే భారం పడుతోంది.

వీటన్నిటినీ సమన్వయం చేసుకోవడం జగన్ కి తలకుమించిన భారమే. అందుకే ఆయన ప్రత్యేకహోదాపై అంత గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఏపీకి హోదా వస్తే ఇంతకంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఈ విషయం బాబుకి తెలియకకాదు, హోదా వస్తే రాష్ట్ర ప్రజలకు లాభం, ప్యాకేజీతో సరిపెట్టుకుంటే తనకు, తన బ్యాచ్ కి మరింత లాభం. అందుకే కేంద్రానికి అమ్ముడుపోయి, తెలుగువారి భవిష్యత్తుని తాకట్టు పెట్టారు బాబు.

జగన్ మాత్రం హోదా కావాల్సిందే, రావాల్సిందే, ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రత్యేకహోదా వస్తే.. అభివృద్ధిలో రాష్ట్ర రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వీలైనంత త్వరగా అందుకోగలిగితే.. ఐదేళ్ల తర్వాత, అంటే వచ్చే ఎన్నికలకు వెళ్లే నాటికి ఏపీని అన్నిట్లో అగ్రపథాన నిలపొచ్చు. అందుకే జగన్ తొందరపడుతున్నారు.

హోదా విషయంలో క్షణం కూడా ఆలస్యం కాకుండా, నిమిషం కూడా వృధాపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. హోదా విషయంలో జగన్ ఆలోచన వ్యూహాత్మక ఎత్తుగడే కానీ, తొందరపాటు ఎంతమాత్రం కాదంటున్నారు సీనియర్ నేతలు, విశ్లేషకులు.

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!