సినిమా రివ్యూ: 7

సమీక్ష: 7 (సెవెన్‌) రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: కిరణ్‌ స్టూడియోస్‌ తారాగణం: హవీష్‌ కోనేరు, రెజీనా కసాండ్రా, నందిత శ్వేత, రహమాన్‌, త్రిధ చౌదరి, అనీషా ఆంబ్రోస్‌, సత్య, పూజిత పొన్నాడ తదితరులు మాటలు:…

సమీక్ష: 7 (సెవెన్‌)
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: కిరణ్‌ స్టూడియోస్‌
తారాగణం: హవీష్‌ కోనేరు, రెజీనా కసాండ్రా, నందిత శ్వేత, రహమాన్‌, త్రిధ చౌదరి, అనీషా ఆంబ్రోస్‌, సత్య, పూజిత పొన్నాడ తదితరులు
మాటలు: మహర్షి
కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌.
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
నిర్మాత, కథ, కథనం: రమేష్‌ వర్మ పెన్మెత్స
ఛాయాగ్రహణం, దర్శకత్వం: నిజర్‌ షఫి
విడుదల తేదీ: జూన్‌ 6, 2019

''సినిమా చూసినందుకు డబ్బులిస్తారా నీకు? వాహ్‌… ఏమి జాబ్‌ రా'' అనే మాట పలు సందర్భాల్లో నాకు వినిపిస్తూ వుంటుంది. అయితే ఈ జాబ్‌ ఎంత కఠినమైన పరీక్షలకి గురి చేస్తుందనే దానికి '7' ఉత్తమ ఉదాహరణల్లో ముందు వరుసలో నిలుస్తుంది. ఇలాంటిది పూర్తిగా చూడడమే ఒక పరీక్ష అంటే, దానికి సమీక్ష రాయడం అంత కంటే పెద్ద శిక్ష మరి! సమీక్ష ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా ముందుకి తీసుకెళ్లాలో, అన్‌పార్లమెంటరీ పదాలేవీ దొర్లకుండా ఎంత జాగ్రత్త పడాలో… తదితర సెవెన్‌ డౌట్స్‌ మదిని తొలిచేస్తూ వుండగా… 7 గురించి చెప్పుకోవాలంటే…

సడన్‌గా మైండ్‌లోకి వచ్చిన ఒక ఐడియా 'అబ్బ భలేగుంది' అని ఎక్సయిట్‌ చేసినపుడు, ఆలస్యం చేస్తే ఆ ఐడియా వేరొకరికి వచ్చేస్తుందేమో అనే తొందరలోనో, లేదా ఆ ఐడియా వేరే ఎవరితోనో షేర్‌ చేసేసుకోవడం వల్ల అది ఎవరైనా కాపీ కొట్టేస్తారనే కంగారులోనో… ఆ ఐడియా చుట్టూ రాత్రికి రాత్రి ఒక కథ అల్లేస్తే ఇదిగో ఇలా '7'లా అస్తవ్యస్తంగా… అష్ట వంకర్లతో (సప్త వంకర్లు అనాలేమో!) ఉంటుంది. కొన్ని అతి సాధారణమయిన, ఎలాంటి సలక్షణాలు లేని సినిమాలు ఆడేస్తుంటాయంటే… బహుశా ఇలాంటి సెవెన్‌లే కారణమేమో. ఈ తరహా 'చిత్ర' హింసకి గురయిన వారికి 'మామూలు' సినిమాలు కూడా 'పండగ'లా అనిపించడం వింత కాదేమో. ఇలాంటి సినిమాలు ఇంకా ఆలోచనల స్థాయి దాటి పేపర్‌ మీది నుంచి వెండితెర వరకు కోట్లు వేసుకుని వెళుతున్నాయంటే సోకాల్డ్‌ కమర్షియల్‌ సినిమాలు ఇప్పటికీ చలామణీలో వుండడం తప్పనడం కూడా తప్పేనేమో.

ఇక అసలు కథ మొదలు పెడితే… భర్త మిస్సింగ్‌ అంటూ ఒకామె పోలీసులకి కంప్లయింట్‌ ఇవ్వడానికి వస్తుంది. ఏం జరిగిందని పోలీస్‌ అడగగానే… అసలయితే భర్త ఎప్పట్నుంచి కనిపించడం లేదు, కనిపించకపోవడానికి ముందు గల కారణాలు మాత్రం చెప్పాలి. కానీ ఆ పోలీస్‌ని చూడగానే పనీ పాటా లేనట్టు అనిపించాడేమో… కొన్ని నెలల క్రితం అతను పరిచయం అయిన నాటినుంచీ కథ మొదలు పెడుతుంది. ఆ లవ్‌స్టోరీలోని డీటెయిల్స్‌ అన్నీ '7'లో కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి తీసారు కానీ… మనం ఫ్రీగా కూడా చెప్పుకోనక్కర్లేదు.

ఆమె కథ సగంలో వుండగా, పోలీస్‌ అందుకుంటాడు 'ఇక్కడ్నుంచి నేను చెప్తా' అని. 'అరేయ్‌… ఏంట్రా ఇదీ' అనే మీమ్‌కి ఇకపై నందితా శ్వేత ఎక్స్‌ప్రెషన్‌ వాడుకోవచ్చు అన్నట్టుగా ఎక్స్‌ప్రెషనిచ్చి… 'నా కథ మీరెలా చెప్పేస్తారు?' అనగానే… అతను బ్యాలెన్స్‌ లవ్‌ సోది కాస్తా చెప్పేసి, సేమ్‌ స్టోరీతో ఆల్రెడీ భర్త మిస్సింగ్‌ అని కేస్‌ పెట్టిన అమ్మాయి గురించి చెప్తాడు. మరో చోట కూడా సేమ్‌ కంప్లయింట్‌ రిజిష్టర్‌ అయిందనగానే… పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అలర్ట్‌ అయిపోతుంది. అంతలో ఆ కుర్రాడు నాకు తెలుసంటూ ఒక ముసలాడు వచ్చి పోలీసులకి హింట్‌ ఇస్తాడు. అతను కార్తీక్‌ కాదు… కృష్ణమూర్తి అని, ఎప్పుడో చచ్చిపోయాడనీ అంటాడు. దాంతో పక్కనున్న పోలీస్‌ 'దెయ్యమేమో' అనగానే ఆ 'డౌట్‌'ని ఇంకాస్త పెంచాలన్నట్టుగా, లేదా పెంచేస్తాం అనే అచంచలమయిన అతి విశ్వాసంతో దాని మీదే ఇంటర్వెల్‌ వేస్తారు.

ఇంతకీ ఈ కృష్ణమూర్తి కౌన్‌ హై? కట్‌ చేస్తే… ఈ ఆలోచన సినిమా అవ్వడానికి కారణమయిన అసలు స్టోరీ మొదలవుతుంది. కృష్ణమూర్తి (హవీష్‌) వీధి నాటకాలు ఆడుతుంటాడు. అతడిపై ఆ ఊరి దొరసాని.. పేరు సరస్వతి (రెజీనా) మనసు పడుతుంది. కానీ అతనికి వేరే అమ్మాయితో అనుబంధం వుందని తెలుసుకుని తనకీ, అతనికీ మధ్య ఏదో వుందనేది ఊరంతా నమ్మేటట్టు పుకారు పుట్టిస్తుంది. తన 'పిచ్చి' ప్రేమకి మధ్య ఎవరు అడ్డు వచ్చినా వారిని చంపేసేంత పిచ్చిగా అతడిని ఆరాధించేస్తుంది. మరి ఆమెకి కృష్ణమూర్తితో పెళ్లవుతుందా? నలభయ్యేళ్ల క్రితం నాటి కృష్ణమూర్తికీ, కార్తీక్‌కి ఏమిటి లింకు? అసలు ఇప్పుడు కార్తీక్‌ వరుస పెళ్లిళ్లు చేసుకుని ఎందుకు పరారవుతున్నాడు?

ఈ లింకులన్నీ కలిపే స్క్రీన్‌ప్లే ఎంత కామెడీగా వుంటుందంటే… ప్రేక్షకుల మేథస్సుపై కనీస మర్యాద వుండదు దానికి. ఎలాంటి కాకమ్మ కథ చెప్పినా ట్విస్ట్‌ ఇచ్చాం కాబట్టి వెర్రి జనాలు చప్పట్లు కొట్టి, విజిల్స్‌ వేసేస్తారనే మాచెడ్డ నమ్మకం దానిది. ఆ దొరసాని కథని, ఇక్కడి 'భార్యల' కథకి కలిపే లింక్‌ అయితే ఆస్కార్‌ యోగ్యమని చెప్పాలి. ఇక కథలోని ట్విస్టులని రివీల్‌ చేసే సిట్యువేషన్స్‌ చూస్తే, అలాంటి సీన్లు 'ఫస్ట్‌ డ్రాఫ్ట్‌'లో రాయడానికి కూడా ఎవరైనా ఏడు సార్లు ఆలోచించుకోవాలి కదా అని మనం అనుకోవాలి. అలాంటి పరమ నాసిరకమైన సన్నివేశాలని కూడా అవే బాగున్నాయనే భావన కలిగించిందంటే ఆ క్లయిమాక్స్‌ ఇంకెలా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోవాలి.

ఈ సినిమా అంతటిలో కన్సిస్టెంట్‌గా ఏదైనా వుందీ అంటే… అది హవీష్‌ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌ ఒక్కటే. కళ్లముందు ప్రపంచం తల్లకిందులు అవుతున్నా, తన జీవితం మొత్తం సర్వ నాశనం అవుతున్నా, తాగి వున్నా, నార్మల్‌గా వున్నా, ఎవరో అమ్మాయి వచ్చి నువ్వే నా భర్త అంటున్నా, అరవయ్యేళ్ల బామ్మ పెళ్లికూతురులా వచ్చి ఎదుట నిలబడినా… హవీష్‌ ఒకటే ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తాడు. ఈ కథకి, ఈ సిట్యువేషన్స్‌కీ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్‌ చేసాడంటే గొప్ప విషయమే. ఎందుకంటే రెజీనా తప్ప మిగతా హీరోయిన్లు, అనుభవం దండిగా వున్న రెహమాను కూడా… ఒక్కో సందర్భంలో 'యాక్షన్‌' అనగానే ఎలా రియాక్ట్‌ అవ్వాలో తెలియని అయోమయంలో పడిపోయారు. ఇంత గందరగోళంలోను తన ఉనికిని చాటుకుని, నటన గురించి మాట్లాడేలా చేసిందంటే రెజీనాది నిజమయిన టాలెంటు. ఏదో అక్కర్లేదు… ఈ పాత్ర చుట్టూనే పూర్తి కథ నడిపించినా సెవెన్‌ కంటే సెవెంటీ టైమ్స్‌ మెరుగ్గా వుండేది. అంతెందుకు… ఆ ఐడియాని లారెన్స్‌కి ఇచ్చేస్తే 'కాంచన' సిరీస్‌లో మరో డెబ్బయ్‌ కోట్లు కురిపించే మెటీరియల్‌ రెడీ అయ్యేది.

కథనం, సన్నివేశాల వరకు ఎందుకు… కొన్ని స్టాక్‌ పాత్రలని తీర్చిదిద్దే తీరులోనే 'అవుట్‌డేటెడ్‌నెస్‌' కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. కమెడియన్‌ సత్య చేసిన జర్నలిస్ట్‌ పాత్ర… జుబ్బా వేసుకుని, భుజానికి సంచి తగిలించుకుని, పలక కళ్లద్దాలతో సరాసరి ఎనభైవ దశకం నుంచి ఈ సినిమాలో ఊడి పడ్డట్టుంటుంది. ఇక రెహమాన్‌ అదే పనిగా మందు తాగడానికంటూ ఒక కారణముండదు. అలర్ట్‌గా వుండడానికో, అలవాటైపోయో లేదా స్టయిల్‌ కోసమో అనేసుకోవాలి. మొదటి ప్రేమకథ సినిమాలో పలు మార్లు రిపీట్‌ అవుతుందన్నపుడు అది ఎంత ఆలోచనతో రాసుకోవాలి. అది ఎంత ప్లెజెంట్‌గా అనిపించాలి? మన కథ ఇది కాదు కదా… సో ఇక్కడెందుకు ఎక్కువ ఆలోచన అన్నట్టు ఆ బ్లాక్‌ని ఫిల్‌ చేసిన తీరు భావదారిద్య్రానికి ఆనవాలుగా నిలుస్తుంది. పోనీ… అసలు కథ అనుకున్న ఆ సరస్వతి ప్రేమకథలో అయినా ఆకట్టుకునే లక్షణముందా అంటే అదీ లేదు. అక్కడా రెజీనా కాబట్టి ఆ పార్టు అంతో ఇంతో నిలబడింది.

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ… ఒక్క ఎక్సయిటింగ్‌ ఐడియా ఒక మంచి సినిమా మాత్రం ఖచ్చితంగా కాలేదు. ఆ ఐడియా పండడానికి ఎంతో మేథోమధనం జరగాలి. ఒక్కసారి కథ చెప్పడం మొదలు పెడితే కళ్ళూ, చెవులూ అప్పగించేసి అందులో లీనమయ్యేట్టు చేయగలగాలి. వాస్తవాతీతంగా, లాజిక్‌ అనే దానికి ఆచూకీ కూడా దొరకకుండా, నటీనటులు, సాంకేతిక వర్గం కూడా బేల ముఖాలేసుకుని బిత్తర చూపులు చూసేలా… ఇలా సప్త వంకర్లతో సిద్ధం చేస్తే చివరకు ఆ ఐడియా కూడా నవ్వుల పాలవుతుంది.

బాటమ్‌ లైన్‌: 'ఏడు'పే!
– గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: ఎన్‌ జికె   సినిమా రివ్యూ: ఫలక్‌నుమా దాస్‌