సినిమా రివ్యూ: ఫలక్‌నుమా దాస్‌

రివ్యూ: ఫలక్‌నుమా దాస్‌ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: వన్మయి క్రియేషన్స్‌ తారాగణం: విశ్వక్‌ సేన్‌, సలోని మిశ్రా, హర్షితా గౌర్‌, ప్రశాంతి, ఉత్తేజ్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు కూర్పు: రవితేజసంగీతం: వివేక్‌ సాగర్‌ ఛాయాగ్రహణం:…

రివ్యూ: ఫలక్‌నుమా దాస్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: వన్మయి క్రియేషన్స్‌
తారాగణం: విశ్వక్‌ సేన్‌, సలోని మిశ్రా, హర్షితా గౌర్‌, ప్రశాంతి, ఉత్తేజ్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు
కూర్పు: రవితేజసంగీతం: వివేక్‌ సాగర్‌
ఛాయాగ్రహణం: విద్యాసాగర్‌ చింతా
నిర్మాత: కరాటే రాజు
దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌
విడుదల తేదీ: మే 31, 2019

రీమేక్‌ అనేది చాలా మంది ఈజీ అనేసుకుంటారు. పాట, ఫైట్‌, కామెడీ లాంటి కమర్షియల్‌ టెంప్లేట్‌ వున్న సినిమాలు రీమేక్‌ చేయడం ఈజీనే కానీ నేటివిటీ, బ్యాక్‌డ్రాప్‌, రియలిస్టిక్‌ ఎమోషన్స్‌ వున్న సినిమాల్ని యథాతథంగా తీసుకురావడం చాలా కష్టం. మొదటిది డయాగ్రామ్స్‌ అవసరం లేని లాంగ్వేజ్‌ పేపర్‌ నుంచి కాపీ కొట్టడం లాంటిది అయితే, రెండవది బొమ్మలేస్తే తప్ప మార్కులు పడని సైన్స్‌ పేపర్‌ లాంటిది. అంటే వాక్యాలు పక్కవాడి నుంచి మక్కీకి మక్కీ దించేసినా, బొమ్మలేయడం రాకపోతే మాత్రం వాడితో సమానంగా మార్కులు పడవు.

అంగమాలి డెయిరీస్‌ అనే మలయాళ చిత్రానికి రీమేక్‌ అయిన ఫలక్‌నుమా దాస్‌ షాట్‌ టు షాట్‌, ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ ఫాలో అయింది. కానీ ఆ చిత్రంలోని ఆత్మని క్యాచ్‌ చేయలేకపోయింది. అందులోని వాస్తవికతకి తగ్గట్టుగా ఇక్కడి పరిస్థితులని తెర మీదకి తీసుకుని రాలేకపోయింది. ఒరిజినల్‌లోని పోర్క్‌ బిజినెస్‌కి బదులుగా మటన్‌ బిజినెస్‌ పెట్టేసి, హైదరాబాద్‌ పాత నగరంలోని ఫలక్‌నుమా బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేస్తే రీమేక్‌కి సకల ముస్తాబులు రెడీ అనుకున్నారు. కానీ సదరు మటన్‌ బిజినెస్‌ కోసం గ్యాంగ్‌ వార్స్‌లాంటివి ఇక్కడ ఎపుడైనా విన్నామా, కన్నామా? లేదు కదూ!

అచ్చమైన హైదరాబాదీ మాస్‌కి 'ఫలక్‌నుమా దాస్‌' అద్దం పట్టింది. వేష భాషలు, మనుషుల మనస్తత్వాలు వగైరా బాగానే చూపెట్టింది. అయితే కథలోని ముఖ్య పాత్రల జీవనశైలిని తెలుసుకోవాలనే కుతూహలం కానీ, ఆ పాత్రలు ఏమవుతాయనే ఆందోళన, భయం కానీ కలిగించలేకపోయింది. ఈ తరహా చిత్రాలు క్లిక్‌ అవ్వాలంటే ముందుగా ఆ పాత్రలతో వీక్షకులకి కనక్ట్‌ ఏర్పడాలి. అది ఏర్పరచడంలో ఫలక్‌నుమా దాస్‌ విఫలమయింది. దాస్‌కి స్నేహితులతో వున్న 'మందు-విందు' రిలేషన్‌ కంటే మరి దేనినీ దర్శకుడు ఎస్టాబ్లిష్‌ చేయకపోవడం ఈ చిత్రానికి మరో మైనస్‌ అయింది.

దాస్‌కి వివిధ దశలలో వివిధ గాళ్‌ఫ్రెండ్స్‌ వుంటారు. వారితో పలు రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా వచ్చి పోతుంటాయి కానీ అతని లవ్‌స్టోరీ సక్సెస్‌ కావాలనుకోలేం. లేదా ఏదయినా బ్రేకప్‌ టైమ్‌లో సింపతీ అయినా చూపించలేం. అతనికో చిన్న ఫ్యామిలీ… తల్లి, చెల్లి. వారి గురించి దాస్‌ ఆలోచిస్తుంటాడు కానీ వారి బాండింగ్‌ తెలియజేసే సన్నివేశం ఒక్కటీ వుండదు. దాస్‌ అనుకోకుండా ఒకరి చావుకి కారణమయితే అది తన వాళ్లని ఎవరినీ ఎఫెక్ట్‌ చేయదు. గ్యాంగ్‌ల మధ్య కోప తాపాలు, ఒకరిపై ఒకరి ప్రతాపాలు లాంటివే ఎక్కువగా హైలైట్‌ అవుతూ వాటిని దాటి ఏ పాత్రలకీ సంబంధించిన ఎలాంటి ఎమోషన్‌ మనసుని తాకదు. యాక్షన్‌ దృశ్యాలు జరుగుతోన్నంత సేపు ఉత్కంఠ పుడుతుంది (నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం చాలా బాగున్నాయి). ఒకసారి యాక్షన్‌ వదిలి దాస్‌ లవ్‌ మూడ్‌లోనో, జాలీ మోడ్‌లోనో వున్నపుడు బోర్‌ కొట్టేస్తుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌లో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ వున్నా కానీ పాత్రల పరిచయాలు, గొడవలు, అన్నిటికీ మించి ఇంటర్వెల్‌ సీన్‌ రక్తి కట్టించడంతో ఫస్ట్‌ హాఫ్‌ వరకు దాస్‌తో పెద్ద సమస్య వుండదు కానీ సెకండ్‌ హాఫ్‌ మాత్రం పూర్తిగా ట్రాక్‌ తప్పిన భావన కలుగుతుంది.

సెకండ్‌ హాఫ్‌ అంతా మనీ సెటిల్‌మెంట్‌కి సంబంధించిన డిస్కషన్లు, లాయర్లతో బేరసారాల మీదే సాగుతుంది. ప్రథమార్ధంలో ఆపోజిట్‌ గ్యాంగ్స్‌ ఎదురు పడినపుడు ఉన్న ఉత్కంఠ ఇక్కడ కొరవడుతుంది. దాస్‌పై ఎటాక్‌కి ప్లాన్‌ చేస్తోన్న గ్యాంగ్‌ కూడా ఎక్కడా థ్రెటెనింగ్‌గా అనిపించకపోగా, పిల్లతనంగా కనిపించడం వల్ల ఆ దృశ్యాల్లోను టెన్షన్‌ మిస్‌ అయింది. అసలే నత్త నడకన నడుస్తోన్న ద్వితియార్ధంలో దాస్‌ థర్డ్‌ లవ్‌స్టోరీ మొదలయి మరింత విసుగెత్తిస్తుంది. అంగమాలి డెయిరీస్‌లోని సింగిల్‌ షాట్‌ క్లయిమాక్స్‌ని యాజిటీజ్‌గా కాపీ కొట్టాలని చూసారు కానీ అంత ఎఫెక్టివ్‌గా దానిని రీక్రియేట్‌ చేయడంలో ఈ చిత్ర బృందం విఫలమయింది. లొకేషన్‌ దగ్గర్నుంచి, క్రౌడ్‌, అట్మాస్ఫియర్‌ వరకు అన్నిట్లోను ఆ సీన్‌ దారుణంగా తేలిపోయింది.

ఫలక్‌నుమా దాస్‌లో మెచ్చుకోతగినవి ఏమిటంటే… హైదరాబాదీ యాస, భాషలను, ఓల్డ్‌ సిటీ కల్చర్‌ని బాగా క్యాప్చర్‌ చేసారు. ఆరంభ సన్నివేశాల్లో వినోదం కూడా బాగా పండించారు. విశ్వక్‌ సేన్‌ సగటు హైదరాబాదీ మాస్‌ పోరడుగా బాగా సూటయ్యాడు. ఉత్తేజ్‌కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కగా ఆ పాత్రలో అతను జీవించాడు. అలాగే దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తనలోని నటుడిని చాలా సీరియస్‌గా తీసుకునేంత నేచురల్‌గా నటించాడు. హీరోయిన్ల (?) గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంగమాలి డెయిరీస్‌కి చాలా ప్లస్‌ అయిన సౌండ్‌ ట్రాక్‌ దీనికి కొరవడింది. పాటలు చాలా సాదాసీదాగా వున్నాయి. ఫైట్స్‌ సహజసిద్ధంగా వున్నాయి. ఛాయాగ్రహణం బాగుంది.

ప్రథమార్ధంలో కొంత భాగం వరకు యూత్‌ ఎంజాయ్‌ చేసేలానే వున్న ఈ చిత్రం ద్వితియార్ధంలో అటెన్షన్‌ నిలబెట్టుకోలేక, అవసరానికి మించిన నిడివితో, అసంపూర్ణమయిన సబ్‌ ప్లాట్స్‌తో బాగా ఇబ్బంది పడడమే కాక ఇబ్బంది పెట్టింది కూడా. ట్రెయిలర్‌లో వున్నంత జోష్‌ సినిమాలో మిస్‌ అయింది. ఎందుకంటే అది రెండున్నర నిమిషాలుంటే, ఇది రెండున్నర గంటల పాటు నడుస్తుంది. అందులోను సెన్సార్‌ కత్తెర పడిన తర్వాత చాలా డైలాగులలో పస పోయింది. తెలంగాణ కల్చర్‌ బేస్‌ చేసుకుని అనేక సినిమాలు వస్తోన్న ట్రెండ్‌లో ఇదీ ఒకటి అనిపించిందే తప్ప ఇది తప్పక చూడాలి అనిపించుకునే లక్షణాలు లేక, డిస్టింక్షన్‌ వచ్చిన సినిమాని అనుకరించడంలో అవస్థలు పడి పాస్‌ మార్కుల కోసం తంటాలు పడింది.

బాటమ్‌ లైన్‌: గలత్‌ షాట్‌!
– గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: ఎన్‌ జి కె  సినిమా రివ్యూ: ఏబిసిడి  సినిమా రివ్యూ: సీత