సామెత మోటుగా ఉంటుంది గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా నాయకుల పరిస్థితి అంతకంటె భిన్నంగా ఏమీలేదు. 25 మంది ఎంపీలకు చోటు ఇస్తున్న రాష్ట్రం అయినప్పటికీ.. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయితే ఆ పార్టీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అయిన, కేరళ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న మురళీధరన్ కు మాత్రం కేంద్రమంత్రి పదవి లభించింది. ఏపీ భాజపా నేతలు… మురళీధరన్ నే కలిసి తమ హర్షం తెలియజేసేస్తున్నారు. ఆయన కూడా ఈ మోటు సామెతను గుర్తు చేస్తున్నట్లుగానే… నేను మీ రాష్ట్రం కోటాలోనే మంత్రి అయినట్లుగా భావించండి… అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా సర్వనాశనం అయిపోయింది. ప్రజల్లో తమకంటూ సొంత బలం ఉన్న అనేకమంది నాయకులు కూడా కమలం గుర్తుపై పోటీచేసిన పాపానికి మూడోస్థానంలో కూడా నిలవకుండా దెబ్బతిన్నారు. ఈ రాష్ట్రంలో ఒకనాటికి అధికారంలోకి వస్తాం అని బీరాలు పలుకుతూ ఉండే ఆ పార్టీ నేతలకు ఇది ఒక హెచ్చరిక వంటి సంకేతం. ప్రత్యేకహోదా విషయంలో మోదీ సర్కారు చేసిన ద్రోహానికి, వంచనకు తెలుగు ప్రజలు చెప్పిన గుణపాఠం ఇది.
నిజంగానే మోదీ అండ్ కోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తమకు అవసరమే అనే భావన ఉంటే గనుక… ఈ రాష్ట్రంనుంచి తమ పార్టీకోసం కష్టపడిపనిచేసే ఏదో ఒక నాయకుడికి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించి ఉండాల్సింది. ఏ పదవిలోనూ లేని వారికి కూడా (అయినవారు అయితే) ముందు మంత్రిపదవి ఇచ్చేసి, ఆ తర్వాత అందుకు అనుగుణ అర్హతలను చేకూర్చడం మోదీకి కొత్త కాదు. కానీ ఆయన ఏపీనుంచి ఆ రకంగా ఏ ఒక్క నాయకుడినీ కూడా ఎంచుకోలేదు.
కేంద్రంలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాత.. ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకున్న జగన్ మోహన్ రెడ్డి… ఆయన కేబినెట్ లో చేరే అవకాశమూ లేదు. ఇలాంటి నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడానికి ఒకరికి పదవి ఇచ్చి, రాష్ట్రంలో తెలుగుదేశం అత్యంత ఘోరంగా పతనమైపోయిన నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా తమ పార్టీని బలోపేతం చేసుకోవడంపై మోదీ దృష్టి సారించి ఉండాలి.
అలాంటిదేమీ చేయలేదు. మన వారికి కేంద్రంలో పదవుల్లేవు. ఇలా… పొరుగు రాష్ట్రాల నుంచి పదవులు తెచ్చుకున్న వారిని అభినందించుకుంటూ.. పైన చెప్పుకున్న మోటు సామెత చందంగా… మన కమల నాయకులు మురిసిపోతూ ఉండాల్సిందే మరి!
పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం