బాబూ మీవాళ్లు మారరా.. ఇంకా ఆత్మవంచనా?

నిజానికి చంద్రబాబునాయుడును ఒకందుకు అభినందించాలి. ఆయన ప్రజల్లో తనపాలన పట్ల వ్యతిరేకత ఉన్నదనే వాస్తవాన్ని అంగీకరించారు. అయితే ఆయన అనుచరగణాలు మాత్రం ఇంకా పాతపద్ధతిలోనే కొనసాగుతున్నాయి. ఆత్మవంచన మాటలతో అధినేతను భ్రమల్లో పెట్టి మరింతగా…

నిజానికి చంద్రబాబునాయుడును ఒకందుకు అభినందించాలి. ఆయన ప్రజల్లో తనపాలన పట్ల వ్యతిరేకత ఉన్నదనే వాస్తవాన్ని అంగీకరించారు. అయితే ఆయన అనుచరగణాలు మాత్రం ఇంకా పాతపద్ధతిలోనే కొనసాగుతున్నాయి. ఆత్మవంచన మాటలతో అధినేతను భ్రమల్లో పెట్టి మరింతగా ముంచే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ తమవంతుగా అధినేతను బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రజల తీర్పు… తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానిని అంగీకరించడం అందరికీ సాధ్యమైన పనికాదు. నిజానికి ఇలాంటి అలవాటు చంద్రబాబుకు కూడా లేదు. ఓడిపోయిన ప్రతిసారీ ఆయన తన ఓటమికి ఇతరుల మీద నిందలు వేయడంతోనే గడిపారు. కానీ ఈసారి నిందలు వేయడం మొత్తం ఫలితాలకు ముందే ముగించారు. ఫలితాల తర్వాత తన మీద ప్రజల్లో సానుభూతిని ఆయన కోరుకున్నారో ఏమోగానీ… పోలింగ్ జరిగిన నాటినుంచి.. ఈవీఎంలను వీవీప్యాట్ లను నిందించడం ద్వారా భయాన్ని, ఏదో జరిగిపోతోందన్న అనుమానాల్ని రేకెత్తించారు.

కానీ ఫలితాల తర్వాత అత్యంత స్పష్టమైన ప్రజాతీర్పు రావడంతో చంద్రబాబు ఒక్కసారిగా మౌనం పాటించారు. శుక్రవారం నాడు హైదరాబాదులో తెలంగాణలో పార్టీ కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెదేపా నాయకులు చంద్రబాబుకు ఓదార్పు వచనాలు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ‘ఇంత వ్యతిరేకత ఉందనుకోలేదని, ఇలా ఓడిపోతామని ఊహించలేదని’ అనడం విశేషం.

ప్రజావ్యతిరేకతను చంద్రబాబు గుర్తించినా… ఆయన తైనాతీలు అనుచరులు పచ్చగణాలు ఇంకా ఆమోదించడం లేదనిపిస్తోంది. ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయంటూ ఇంకా వారు చంద్రబాబును మభ్యపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. నిజానికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆత్మవంచన వచనాలతో పొద్దుపుచ్చడం వారికే చేటు చేస్తుంది. అయినా పర్లేదు అనుకుని, ఈవీఎంల మీద నిందలు మోపుతూ.. ఇలాంటి ఆత్మవంచననే కొనసాగిస్తే… ముందుముందు తరాలకు కూడా ప్రజలను అర్థం చేసుకోవడం వారికి దుర్లభం అవుతుంది.

పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం