త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ సినిమా ఇదిగో, అదిగో అంటూ ఊరించి ఊరించి పట్టాలు ఎక్కింది. ఇలా షూటింగ్ చేసి అలా ఆపేసారు. దాంతో బోలెడు గ్యాసిప్ లు. గీతా సంస్థ అన్నా, బన్నీ అన్నా సర్రున లేచిపోవడానికి రెడీగా వున్న జనాలు గ్యాసిప్ లకు పదునుపెట్టేసారు. గీతాకు హారిక హాసినికి నప్పడం లేదంటూ వార్తలు వండేసారు.
కానీ వీళ్లకు తెలియంది ఏమిటంటే, ఫ్రొడక్షన్ లో గీతాకు ఏమీ సంబంధం లేదని. మహర్షి సినిమాకు దిల్ రాజు ఎలా అయితే ప్రొడక్షన్, పెట్టుబడి చూసుకున్నారో, ఈ సినిమాకు హారిక హాసిని అలా. గీతా సంస్థ భాగస్వామి. ఏం జరుగుతూందో చూస్తుంటుంది తప్ప, షెడ్యూళ్లు, వ్యవహారాలు అన్నీ హారిక హాసిని వ్యవహారాలే.
అయితే ఇక్కడ బయటకు రాని అసలు విషయం ఏమిటంటే, బన్నీదో, గీతాదో సమస్యకాదు. దర్శకుడు త్రివిక్రమ్ ది. సెకండాఫ్ కాకుండానే సినిమాకు ముహుర్తం చేసేసారు. బన్నీ ఖాళీగా వున్నాడు, ఖాళీగా వున్నాడు అంటూ వార్తలు రావడంతో, ఎన్నాళ్లిలా అని సెట్ మీదకు వెళ్లారు. సెకండాఫ్ ను వీలయినంత త్వరగా చేసి ఇస్తానని త్రివిక్రమ్ మాట ఇచ్చినట్లు బోగట్టా.
సినిమాను స్టార్ట్ చేసి, జస్ట్ రెండు ఫైటింగ్ సీన్లు మాత్రం తీసి, ఆపారు. బన్నీ సమ్మర్ వెకేషన్ కు వెళ్లిపోయారు. ఇక్కడ ఇంకో సంగతి ఏమిటంటే ఈ సినిమా సంక్రాంతి విడుదల. అందువల్ల కావాల్సినంత టైమ్ వుంది. ఈలోగా తివిక్రమ్ సెకండాఫ్ రెడీచేయాలి. బన్నీ సెట్ మీదకు రావాలి.
అదీ వ్యవహారం. సో త్రివిక్రమ్ స్క్రిప్ట్ వ్యవహారం, గీతా-హాసిని భాగస్వామ్యాన్ని విడగొట్టే గ్యాసిప్ లకు దారితీస్తోంది. త్రివిక్రమ్ త్వరగా స్క్రిప్ట్ రెడీ చేసి సెట్ మీదకు వెళ్తే సమస్య వుండదేమో?