ఇన్నాళ్లూ చీకటి ఒప్పందాలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ జట్టుకట్టాల్సిన టైమ్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ఈ ఇద్దర్నీ ఒకే దగ్గరకు చేర్చుతున్నాయి. ఇప్పటివరకూ తమ ఓటమికి రెండు వేర్వేరు కారణాలు చెప్పుకుంటున్నారు పవన్, బాబు. చంద్రబాబు ఈవీఎంలపై పడి ఏడుస్తుంటే.. పవన్ ఓటుకు నోటు ఇవ్వకపోవడం వల్లే తమకు ఓట్లు పడలేదనే ఫీలింగ్ లో ఉన్నారు.
ఇప్పుడు వీరిద్దరూ ఓ కామన్ పాయింట్ వద్దకు వచ్చి ఆగారు. వీవీప్యాట్ల విషయంలో చంద్రబాబుకి కాస్త మద్దతుగా మాట్లాడిన పవన్.. బహిరంగంగానే ఆయనకు వంత పాడే ఛాన్స్ వచ్చింది. అధికార పక్షానికి ఇద్దరూ శత్రువులే కాబట్టి ఎంచక్కా వీరిద్దరూ జట్టు కట్టొచ్చన్న మాట. ఇద్దరూ కలసి ఈవీఎంలపై నిందలేసి తమ పబ్బం గడుపుకోవచ్చన్న మాట.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏపీలో టీడీపీకి పరాభవం తప్పదని తేల్చేశాయి. అదే సమయంలో ఏపీలో జనసేన లాంటి మూడో ప్రత్యామ్నాయానికి అవకాశమే లేదని కూడా స్పష్టంచేశాయి. సో.. ఫలితాల తర్వాత పవన్ తన రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీతో కలవాల్సిందే.
అధికార పక్షాన్ని ఒంటరిగా ఎదుర్కునే సత్తాలేదు, అదే సమయంలో టీడీపీ అండలేకుండా మరో ఐదేళ్లపాటు పార్టీని నడిపే స్థోమత కూడా డౌటే. ఇలాంటి టైమ్ లో ఇక జనసేన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం ఇదే. ఇన్నాళ్లూ తెరచాటున నడిపిన వ్యవహారాల్ని, ఇకపై భేషరతుగా ఓపెన్ గానే చేసుకోవచ్చన్నమాట.
మొత్తమ్మీద ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబుని, పవన్ ని దగ్గరకు చేర్చుతున్నాయనేది వాస్తవం. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి భూమిక పోషిస్తాయో చూడాలి.