పెళ్లి అనేది లాటరీ లాంటిదని ఓ పెద్దాయన అన్నారు. లాటరీ టికెట్ కొన్న వాళ్లలో ఒక్కర్నే అదృష్టం వరిస్తుంటుంది. జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని దంపతులిద్దరూ ప్రమాణాలు చేసుకుని ఏడడుగులతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయితే కొందరి వైవాహిక జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది.
ఒకట్రెండు పెళ్లిళ్లతో తగిన జీవిత భాగస్వామి దొరకని పరిస్థితి. అలాంటి జీవితం నరకాన్ని తలపిస్తుంది. ఒక వైపు ఇంటిపోరు, మరోవైపు సమాజ వేధింపులు …వెరసి జీవితం అంధకారమవుతుంది.
ఈ ఉపోద్ఘాతమంతా ప్రముఖ నటి వనితా విజయ్‌కుమార్ వైవాహిక జీవితం గురించి చెప్పుకోడానికే. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ వారసురాలిగా ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తన ప్రతిభతో చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ సంతృప్తి స్థాయిలో సాగుతోంది. కానీ వివాహ బంధం మాత్రం ఆమెకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.
ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మూడో పెళ్లి కూడా కలిసి రాలేదు. దీంతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నాలుగో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన నాలుగో పెళ్లి గురించి లోకానికి పనేంటని ప్రశ్నిస్తున్నారు. కోలీవుడ్‌లో తన నాలుగో పెళ్లి ప్రచారంపై ఆమె మాటల్లోనే ….
‘ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇకపై ఇలాగే ఉంటాను. దయచేసి, నా జీవితం గురించి అసత్య వార్తలు వ్యాప్తి చేయకండి. ఆ వార్తలు కూడా నమ్మకండి. నా జీవితం ఎవ్వరికీ సమస్య కాదు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన సమస్యలుం టాయి. వాటి గురించి చూడండి. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వాళ్లు.. నా గురించి కాకుండా మీ జీవితం గురించి బాధపడండి. ఎందుకంటే నా గురించి ఆలోచించడం అనవసరం’ అని వనితా విజయ్‌కుమార్ గట్టిగా బదులిచ్చారు.