సమంత..పెర్ ఫెక్ట్ ఫిట్

ప్రతి జనరేషన్ కు ఓ మాంచి నటి వుంటూ వస్తుంది టాలీవుడ్ లో. ఒక్కో సీజన్ లో ఒకరి కన్నా ఎక్కువ మందే వుంటూ వచ్చారు. రాను రాను అందాల బొమ్మలే తప్ప ఫిట్…

ప్రతి జనరేషన్ కు ఓ మాంచి నటి వుంటూ వస్తుంది టాలీవుడ్ లో. ఒక్కో సీజన్ లో ఒకరి కన్నా ఎక్కువ మందే వుంటూ వచ్చారు. రాను రాను అందాల బొమ్మలే తప్ప ఫిట్ టు ది క్యారక్టర్ అంటూ ప్రశంసలు అందుకునే వారు తగ్గిపోతున్నారు. ఈ సీజన్ కు చూసుకుంటే సమంత అలాంటి నటి అనిపించుకుంటోంది. 

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి హీరోయిన్ గా ఎదగడంతో పాటు నటిగా ఎదుగుతూ వస్తోంది. రంగస్థలం సినిమాలో డ్లీగామర్ పాత్ర పోషించిన తరువాత ఓ బేబీ, మజిలీ సినిమాలతో మళ్లీ తనలోని నటన వైవిధ్యాన్ని మరింతగా ప్రదర్శించింది. 

గుణశేఖర్ శకుంతల కోసం వెదికితే సమంతనే ఆప్షన్ అయింది. లేటెస్ట్ గా క్రేజీ వెబ్ సిరీస్ ఫ్యామిలీమన్ సీజన్ 2 లో కీలక పాత్ర కూడా సమంతదే అయింది. సీజన్ వన్ చూసిన వారికి సీజన్ 2 కొత్తగా ఏముంది అంటే అది సమంతనే. సీజన్ వన్ లో చూసిన పాత్రలు అన్నీ ప్రేక్షకులకు పరిచయమే. అందువల్ల కొత్తగా అనిపించింది ఏదయినా వుందీ అంటే అది సమంతనే. 

యుద్ద విద్యల్లో శిక్షణ పొందిన పక్కా వార్ టెర్రరిస్ట్ పాత్రలో సమంత ఒదిగిపోయింది. కరుడు కట్టిన సైనికురాలు లేదా టెర్రరిస్ట్ రెండూ కాదు. జీవితంలో దెబ్బతిని, కసితో టెర్రరిస్ట్ గా మారిన అమ్మాయిగా, జీవితంలో అన్ని రకాల దారుణాలు చూసేసిన అమ్మాయిగా సమంత ఆ పాత్రలో బ్రహ్మాండంగా ఒదిగిపోయింది.

మేకప్ అన్నది కేవలం నటికి గెటప్ మాత్రమే తీసుకువస్తుంది. కానీ సమంత తన నటనతో ఆ మేకప్ కు తగినట్లు పూర్తిగా మారిపోయింది. చూపులు, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్లు అన్నింటా సమంత ప్రశంసలు పొందేలా నటించింది. 

ఫ్యామిలీమన్ 2 చూసేది వన్ మీద వున్న క్రేజ్ తో. కానీ చూసిన తరువాత దాని గురించి మాట్లాడాలి అంటే కేవలం సమంత గురించి మాత్రమే మాట్లాడుకోవాల్సి వుంటుంది.