పశ్చిమ బెంగాల్ మీద భారతీయ జనతా పార్టీ ఏ రేంజ్ ఆశలు పెట్టుకుందంటే.. ఆ పార్టీ ఎంపీలు పలువురు అసెంబ్లీకి పోటీ చేశారు! సాధారణంగా జాతీయ పార్టీల్లో ఈ తరహా రాజకీయాలుండవు. అయితే బెంగాల్ లో స్వప్నాల్లో విహరిస్తున్న తరుణంలో.. పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. అయితే ఆల్రెడీ ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగడం వల్ల.. అంతిమంగా వృథా అయ్యేది ప్రజాధనమే.
వాళ్లు ఎమ్మెల్యేలుగా నెగ్గితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారు… దీంతో ఉప ఎన్నికలు తప్పవు. ఇలాంటి పనులు ఏ కాంగ్రెస్ వాళ్లో, మరో ప్రాంతీయ పార్టీల వాళ్లో చేస్తే దేశభక్త వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే ఈ పని బీజేపీ వాళ్లు చేస్తే.. అది కూడా దేశభక్తే!
ఈ క్రమంలో ఎమ్మెల్యేలుగా నెగ్గిన ఇద్దరు బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీరు రాజీనామా చేసింది ఎంపీ పదవులకు కాదులెండి. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలోకి ఎంటర్ కావడానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, గెలిచిన వీళ్లు లెక్క ప్రకారం.. ఇప్పుడు ఎంపీ పదవులకు రాజీనామా చేయాలి!
ఎందుకంటే వీళ్లు ఎంపీ హోదాల్లో ఉంటూ..ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలి. అయితే లోక్ సభ సీట్లకు ఉప ఎన్నికలు వస్తే.. ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన చెందారో ఏమో, కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు బీజేపీ ఎంపీలు.
ఎలాగూ అధికారం దక్కలేదు, ఇలాంటప్పుడు లోక్ సభ సీట్లకు బై పోల్ తెచ్చి పార్టీ మీద కొత్త భారం పెట్టే కన్నా, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే.. చప్పుడు ఉండదని కమలం నేతలు భావించినట్టున్నారు. కోరి మరీ పోటీ చేసి అప్పుడే ఉప ఎన్నికలకు కారణం అవుతున్నారు. ఈ పని చేసింది బీజేపీ నేతలు కాబట్టి.. ప్రజాధనం వ్యయాలను ఎవ్వరూ లెక్క వేయకూడదు. అలా వేస్తే వారు దేశద్రోహులే సుమా!