కామెడీ.. పరువు హత్యపై తెలుగు హీరోల నీతులు!

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై కొంతమంది టాలీవుడ్ హీరోలు కనబరుస్తున్న వీరావేశం ప్రహసనం అవుతోంది. హత్యకు గురైన యువకుడి పట్ల వీళ్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు ఈ సమాజం ఏమైపోతోంది?’ అంటూ వీళ్లు…

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై కొంతమంది టాలీవుడ్ హీరోలు కనబరుస్తున్న వీరావేశం ప్రహసనం అవుతోంది. హత్యకు గురైన యువకుడి పట్ల వీళ్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు ఈ సమాజం ఏమైపోతోంది?’ అంటూ వీళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమకు సరిహద్దులు లేవని హ్యాష్ ట్యాగులు పెడుతున్నారు. ప్రణయ్ కి న్యాయం జరగాలని కూడా మరో హ్యాష్ ట్యాగ్ జత చేస్తున్నారు.

ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు పరువు హత్య విషయంలో వీళ్లు రియాక్ట్ కావడం అభినందనీయమే అనుకుందాం. ఈ హీరోలు కూడా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లే. అయితే.. వీళ్ల కుటుంబ వ్యవహారాలు ఏమిటి? అనేవి మాత్రం ఇప్పుడు గుర్తుకు రాకమానవు.

ఈ హీరోల చెల్లెళ్లు, అక్కలు కులాంతర వివాహాలు చేసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు, వీళ్లను ఎదురించి వేరే కులపోళ్లను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? అనేది ఇక్కడ గుర్తుకు రాకమానదు. అసలు ఈ సమాజం ఏమైపోతోంది? అని ఆందోళన వ్యక్తం చేస్తున్న వీళ్లు.. గతంలో తమ ఇంటి ఆడపిల్లలు తెగించి బయటకు వెళ్లి, అదే ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేశారు?

తుపాకీలు పట్టుకుని రోడ్డు ఎక్కారు. మా బాబాయ్ మమ్మల్ని చంపేస్తాడు.. అని వీళ్ల ఇంటి పిల్లలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా! సదరు కులాంతర వివాహం చివరకు ఏమైంది? అంతకన్నా మునుపు ఒక కులాంతర నిశ్చితార్థం ఎక్కడకు వెళ్లింది? ఇక మరో ఈ హానర్ కిల్లింగ్ పై తీవ్రంగా ధ్వజమెత్తిన మరో పెదరాయుడి కుటుంబీకుడు కూడా కులాంతర వివాహమే చేసుకున్నాడు. అభినందిద్దాం. అయితే వారి సోదరి అలాంటి వివాహమే చేసుకోబోతే.. అప్పుడేం జరిగింది!

ఇవన్నీ ఎవరికి తెలియనవి? ఆర్థికంగా బాగా సెటిలైన కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. బాగా ఆర్థికంగా సెటిలైన కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చి వీరి అబ్బాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. అదే వీరింటి అమ్మాయిల విషయానికి వస్తే వాళ్లు ప్రేమించినా, కులాంతర వివాహాల జోలికి వెళ్లినా, రచ్చరచ్చలు అయ్యాయి.

ఇప్పుడు అలాంటి అమ్మాయిల సోదరులే.. పరువు హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ల ఇళ్లల్లో ఆ వ్యవహారాలు జరిగినప్పుడు వీళ్లు ఇంతే విశాల హృద‌యంతో రియాక్ట్ అయ్యారా? తమ ‘బావ’లపై ఇంత సానుభూతిని చూపించారా?