టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ మారగానే, ఆయనకు మంత్రి పదవి వచ్చింది. చిత్రంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేతో మంత్రిగా గవర్నర్ నరసింహన్ ఎలా పదవీ ప్రమాణం చేయించారు.?
దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రికీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కీ మధ్య రచ్చ రచ్చ జరిగింది. ఈ రచ్చ భరించలేక, లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనికి కారణమెవరు.?
తమిళనాడులో రాజకీయం తగలబడిపోతోంది.. సరిదిద్దాల్సిన గవర్నర్ కీలకమైన సమయంలో మొహం చాటేశారు.. తీరిగ్గా, వివాదం ముదిరాక చెన్నయ్‌లో వాలిపోయారు.. ఆయన్ని నడిపిస్తున్నదెవరు.?
రాజకీయమంటేనే ఓ రొచ్చు.. అని యువతరం రాజకీయాల పట్ల అసహ్య భావనలతో వున్న ప్రస్తుత పరిస్థితుల్లో, దేశ రాజకీయాలు మరింతగా భ్రష్టుపట్టిపోతున్నాయి. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న తేడాల్లేవు. ఎక్కడ చూసినా, నిస్సిగ్గు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. నైతిక విలువలు.. అన్న మాటకు చోటు లేకుండా పోయింది. అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది.. అని గొప్పగా చెప్పుకోవడం తప్ప, ఆ మాటల్లోని గొప్ప దేశంలో మాత్రం కన్పించడంలేదు. రాజ్యంగమొకటుంది.. విలువలు అంటూ కొన్ని వున్నాయి.. అవన్నీ చెప్పుకోడానికే, ఆచరణలో మాత్రం కాదు. ఎందుకంటే, ఇప్పుడు దేశంలో నడుస్తోన్నది రాజకీయం. ఆ రాజకీయం కూడా ఓ వ్యక్తి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ వ్యక్తి కనుసన్నల్లోనే అన్ని రాష్ట్రాలూ నడవాల్సిన దుస్థితి. ఆయన ఎవరో కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల పైత్యం
తెలుగు రాష్ట్రాల్లో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. ఓ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. చిత్రంగా గవర్నర్ కూడా ఈ ఫిరాయింపులకు వంతపాడుతున్నారు. తెలంగాణలో అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి కట్టబెట్టేశారు. రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేతో మంత్రిగా పదవీ ప్రమాణం చేయించేయనున్నారు గవర్నర్. కానీ, కేంద్రం మాత్రం పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని చెబుతుంటుంది. పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెబుతూనే వుంది. పెద్ద పాత నోట్ల రద్దుతో దేశానికి ఏం ఒరిగింది.? అన్న విషయం పక్కన పెట్టి, పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెడితే, దేశ రాజకీయాలు భ్రష్టుపట్టిపోకుండా వుంటాయి. తద్వారా రాజకీయ అవినీతి కొంతమేర తగ్గే అవకాశముంది. ఎందుకంటే, ఈ ఫిరాయింపు రాజకీయాల పుణ్యమా అని కోట్లాది రూపాయల నల్లధనం చేతులు మారుతోంది మరి.! సాక్ష్యం కావాలంటే, తెలంగాణలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుని పరిశీలించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు స్పీకర్ వ్యవస్థ, ఇంకోవైపు గవర్నర్ వ్యవస్థ రెండూ అపహాస్యం పాలైపోయాయి. ఇంకా, మనం ప్రజాస్వామ్యంలోనే వున్నామా.? రాజ్యాంగం చూపిన దారిలోనే నడుస్తున్నామా.? అన్న అనుమానాలకు నివృత్తి ఎలా.?
ఢిల్లీలో రాజకీయ హింస
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెనుకున్న ప్రభుత్వాన్ని కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్‌ని అడ్డంపెట్టుకుని హింసించిందన్నది నిర్వివాదాంశం. ఇటు ఢిల్లీ ప్రభుత్వానికీ, అటు కేంద్ర ప్రభుత్వానికీ మధ్య నలిగిపోయారు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని పదే పదే సమీక్షించాలనుకోవడం, కొన్ని నిర్ణయాల్ని తుంగలో తొక్కేయడం వంటి చర్యల ద్వారా నజీబ్ జంగ్ వివాదాల్లోకెక్కారు. నిజానికి నజీబ్ జంగ్ వెనకాల వుండి, ఆ అకృత్యాలు చేయించింది కేంద్రమేనని ఆయన తన గవర్నర్ పదవికి రాజీనామా చేయడం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఢిల్లీ అనేది సాధారణ రాష్ట్రం కాదు, కేంద్ర పాలిత రాష్ట్రం. ఆ కారణంగా ముఖ్యమంత్రి అధికారాలకు కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితుల్ని ముఖ్యమంత్రి దాటిన సందర్భాల్లోనూ, దాటని సందర్భాల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్‌ని రంగంలోకి దించి, కేంద్రమే లేనిపోని రభసను సృష్టించిందన్నది నిర్వివాదాంశం. ఎలాగైతేనేం, నజీబ్ జంగ్ రాజీనామా తర్వాత కేంద్రానికీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య వివాదాలు తగ్గాయనుకోండి.. అది వేరే విషయం. అన్నట్టు, ఓ దశలో కేంద్రం, సీబీఐని కూడా ఢిల్లీ ప్రభుత్వంపైకి ఉసిగొల్పింది. అదే సమయంలో, ఢిల్లీలోని అధికార పార్టీ నేతలు, పలు వివాదాల్లో చిక్కుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన విషయాల్ని ఎలా విస్మరించగలం.? ముఖ్యమంత్రికీ గవర్నర్‌కీ లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌కీ మధ్య వివాదాలేమైనా వుంటే పరిష్కరించాల్సిన కేంద్రమే, వివాదాలు సృష్టిస్తోంటే.. అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంది.?
తమిళ ప్రజలతో ఆట.!
జల్లికట్టు అనే ఓ ఆట.. సంప్రదాయ క్రీడ.. తమిళనాడు పేరుని దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది. అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కటయ్యాయి. ఆ దెబ్బకి కేంద్రం దిగొచ్చింది. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు, తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో కేంద్రం, తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరించింది. నిజానికి, అధికార పక్షం శాసనసభా పక్ష నేతను మార్చినప్పుడు, గవర్నర్‌కి సమాచారం అందించగానే, గవర్నర్ కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి ఆమోదం తెలపాలి. కానీ, ఇక్కడలా జరగలేదు. సరే, శాసనసభాపక్ష నేత ఎంపిక అక్రమమా.? సక్రమమా.? అన్నది వేరే విషయం. ముఖ్యమంత్రి రాజీనామాకి ఆమోదం లభించాక, కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అడ్డు పుల్ల వేయడం అనేది చాలా చాలా అరుదు. ఇది గవర్నర్ ఆలోచన అయి వుండదు. ఖచ్చితంగా, కేంద్రమే తమిళ రాజకీయాల్ని నాశనం చేయాలనే కుట్రతో ఈ పని చేసిందని భావించకుండా వుండలేం. కానీ, కేంద్రం, అది తమ పరిధిలోని అంశం కాదనీ, గవర్నర్ అన్నీ చూసుకుంటారనీ చేతులు దులిపేసుకుంది. జల్లికట్టు విషయంలో చూపిన శ్రద్ధ, తమిళనాడు రాజకీయ సంక్షోభంపై కేంద్రం చూపకపోవడం ఖచ్చితంగా దుర్మార్గమే.
విచక్షణ ఎవరికి వుంది.?
గవర్నర్‌కీ, స్పీకర్లకీ విచక్షణాధికారాలు వుంటాయి. ఎప్పటినుంచో వింటున్న మాటే ఇది. కానీ, ఆ విచక్షణ పేరుతో, నైతిక విలువల్ని తుంగలో తొక్కితే ఎలా.? పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ అదే జరిగింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కీ, ముఖ్యమంత్రికీ మధ్య కూడా ఈ విచక్షణాధికారాలే చిచ్చు రాజేశాయి. ఇదిగో, ఇఫ్పుడు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యాన్ని అదే విచక్షణ వెక్కిరిస్తోంది. ఢిల్లీ, తమిళనాడు వ్యవహారాల్లో కేంద్రం జోక్యం సుస్పష్టం. తెరవెనుక చక్రం తిప్పిందీ, తప్పుతోన్నది నరేంద్రమోడీ సర్కారే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలతో ఓ ఆట ఆడుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాల్ని చూసి వికారపు నవ్వు నవ్వుతోంది. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంటే వికటాట్టహాసం చేస్తోంది. 'వాళ్ళు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే, నువ్వూ ప్రోత్సహించవోయ్..' అంటూ తమ మిత్రుడ్ని ఎంకరేజ్ చేస్తూనే, 'మా పార్టీ జోలికొస్తే ఖబడ్దార్..' అంటూ హెచ్చరిస్తోంది. స్పీకర్‌కి చెప్పుకుందామంటే ఉపయోగం లేదాయె. గవర్నర్‌కి విన్నవించుకుందామంటే కుదరడంలేదాయె. న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే, 'అది మా పరిధిలోని అంశం కాదు..' అనే సమాధానం వెక్కిరిస్తోందాయె. ఇలాగైతే ఎలా.? అసలీ విచక్షణాధికారాలు ఎందుకు.?
నరేంద్రమోడీ హయాంలోనే కొత్తగా జరుగుతున్నాయా.?
ఫిరాయింపు రాజకీయాలు.. రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు.. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తెరపైకొస్తున్నవేమీ కావు. గతంలోనూ వున్నాయి. అయితే, ఈసారి ఎక్కువగా.. చాలా చాలా ఎక్కువగా.. ఆ మాటకొస్తే, దేశంలోని చాలా రాష్ట్రాలు ఏదో ఒకరకమైన సంక్షోభంలో కూరుకుపోవడమే ఆలోచించాల్సిన విషయమిక్కడ. ఆలోచించడం కాదు, ఆందోళన చెందాల్సిన సమయమిది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశం వెలిగిపోతుందని అంతా నమ్మారు. కానీ, దేశం ఇప్పుడు తగలబడిపోతోంది. 'సత్యం' అన్న మాటకు అవకాశమే వుండటంలేదు. 'ధర్మం' గురించి మాట్లాడుకోవడమే దండగయిపోతోందిప్పుడు. ఇదంతా మారుతున్న రాజకీయాల పరంపరలో భాగమని సరిపెట్టుకోవాలో, లేదంటే దేశంలో ప్రజాస్వామ్యానికీ, రాజ్యాంగ విలువలకీ ప్రమాదం ఏర్పడిందో అర్థం కాని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది సగటు భారతావని. రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాం.. మేం తీసుకొచ్చే మార్పుతో దేశ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగతాయ్.. అని వేదికలెక్కి ప్రసంగాలు దంచేస్తోన్న ప్రధాని నరేంద్రమోడీ, తన కారణంగా దేశంలో పెరిగిపోతున్న విపరీత పోకడలకు ఏం సమాధానం చెబుతారు.? సత్యం వధ.. ధర్మం చెర.. ఇంతకన్నా గొప్పగా, దేశంలోని చాలా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి చెప్పలేం.
– సింధు