‘కబాలి’ రజనీ స్టైల్ తప్ప కథలో విషయం లేదని విమర్శలు ఎదుర్కొన్న సినిమా. భారీ హైప్ ను క్రియేట్ చేసుకుని, ఫస్ట్ వీక్ లో కలెక్షన్లను సంపాదించుకోవడమే తప్ప చిరకాలం నిలబడేంత సీన్ లేని సినిమా. ఆఖరికి నిన్నలా మొన్న టీవీలో వేసినా ఓపిక చేసుకుని చూసే జనాలు లేకపోయారు! విడుదలైన కొంత కాలంలోనే టీవీలో వేస్తే ఈ స్థాయి స్పందన వ్యక్తం అయ్యిందంటే.. రజనీ ‘కబాలి’ కలెక్షన్ల బుక్స్ లో తప్ప ప్రేక్షకుల మదిలో నిలిచేపోయే సినిమాగా మిగిలిపోదు.
అయితేనేం.. రజనీ తదుపరి సినిమా ‘కబాలి-2’ అనే మాటనే వినిపిస్తోంది. రోబో-2 షూటింగ్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో రజనీ తదుపరి సినిమా ఏది? అనే చర్చలో కబాలి-2 నే ప్రధానంగా వినిపిస్తోంది. ఎలాగూ కబాలి క్లైమాక్స్ లో రజనీ పాత్ర చనిపోతుందా? లేదా? అనే మిస్టరీని ఉంచారు కాబట్టి, రెండో పార్టుకు ఇంట్రడక్షన్ పాయింట్ లభించేసినట్టే!
అయితే కథ, కథనాల విషయంలో తొలి పార్టులో ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించలేకపోయిన పా రంజిత్ ను రజినీ మరోసారి నమ్ముకోవడాన్ని చూస్తే.. రజనీకి కావాల్సింది కూడా కేవలం కలెక్షన్లు మాత్రమే అనుకోవాల్సి వస్తోంది! ఈ వయసులో ఏవో అద్భుతమైన సినిమాలు, చిరకాలం ప్రేక్షకులను అలరించే సినిమాలు చేయాలన్న ఆశయాలేమీ పెట్టుకోకుండా.. తొలి రోజు వంద కోట్లు, తొలి వారానికి మూడొందల కోట్ల మార్కుకు రీచ్ అయ్యి.. ఆ తర్వాత ఊసులో ఉండలేని సినిమాకే రజనీ ఓటేసినట్టుగా ఉన్నాడు!
అయితే.. ఎంత చెట్టు పేరు చెప్పినా ఒక్కోసారి కాయలు అమ్ముడుకాకపోవచ్చు. ప్రేక్షకుడికి థియేటర్లోనే అమృతాంజన్ బామ్ అవసరాన్ని తెచ్చిపెట్టిన సినిమాకు సీక్వెల్ అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా. ఇది ఒక్కోసారి ఎదురుతన్నొచ్చు తలైవా!