రాజకీయ రంగంలో నచ్చింది గుంజుకోవడం అలవాటు. కానీ టాలీవుడ్ లో అలా పనికిరాదు. నచ్చింది తీసుకోవాలి. లేదా తీయించుకోవాలి. అంతే కానీ అవతలివాడి దగ్గర వున్నది లాక్కోకూడదు. అయితే రాజకీయం అలవాటైన మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం తన కొడుకు కోసం ఓ మాంచి సబ్జెక్ట్ ఇలా లాక్కోవాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక చాలా విషయం వుంది. అది ఇలా వుంది.
కొన్నాళ్ల క్రితం తమిళంలో సేతుపతి అనే సినిమా వచ్చింది. మిడిల్డ్ ఏజ్డ్ పోలీస్ ఆపీసర్ కథ ఇది. భయంకరంగా హిట్ అయింది. ఆ వెంటనే ఈ సినిమాపై చోటా కే నాయడు కన్ను పడింది. సందీప్ కిషన్ కోసం ఆ సినిమాను తీసుకున్నారు. కానీ తరువాత అంత మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ సందీప్ కు సూట్ అవుతుందా? అన్న అనుమానం వచ్చింది. దాంతో ఆ సినిమా టాగోర్ మధు చేతిలోకి వచ్చింది. ఒక దశలో సాయి ధరమ్ తేజ్ కూడా ఆ క్యారెక్టర్ చేయాలనుకున్నారు. కానీ సూట్ కాదని ఫీడ్ బ్యాక్ రావడంతో ఊరుకున్నారు. టాగోర్ మధు ఆ సినిమాను హీరో రవితేజకు చూపించారు. స్పాట్ లో ఊ అనేసారు రవితేజ. దాంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడం కోసం వెయిట్ చేస్తోంది.
కట్ చేస్తే..
కొడుకును హీరో చేయాలనుకున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆ కుర్రాడి పేరు కూడా గమ్మత్తుగా రవితేజ కావడం విశేషం. మంత్రితో మంచి స్నేహం వున్న దగ్గుబాటి సురేష్, ఆయన బంధువు అశోక్ కుమార్ లకు ఆ బాధ్యత అప్పగించారు. వారు తమకు సన్నిహితుడై,ప్రస్తుతం చేతిలో సినిమా లేకుండా వున్న జయంత్ సి పరాన్జీకి ఆ ప్రాజెక్ట్ ను అప్పగించారు. ముహుర్తం జరిగిపోయింది. కానీ ఆ సబ్జెక్ట్ మంత్రి గంటాకు అంత నచ్చలేదు. ఆ ప్రాజెక్టును అలా హోల్డ్ లో పెట్టి మంచి సబ్జెక్ట్ కోసం వెదకడం ప్రారంభించారు. అదిగో అప్పుడు కనిపించింది సేతుపతి. ఎవరిదగ్గర వుందీ అని ఆరా తీస్తే, టాగోర్ మధు దగ్గర వుందని తేలింది. ఆయన కూడా గంటాకు మంచి మిత్రుడే. సో నేరుగా గంటా అడిగారు. కానీ ఆ సబ్జెక్ట్ తో తాను రవితేజతో సినిమా చేయబోతున్నా అన్నారు. అదే విషయాన్ని అశోక్ కుమార్ కు క్లియర్ గా చెప్పారు.
కానీ గంటా ఆగలేదు. నేరుగా హీరో రవితేజకే ఫోన్ చేసి అడిగేసారు. తమ కోసం ఆ సబ్జెక్ట్ వదిలేయమని. కానీ రవితేజ కూడా నో చెప్పేసారు. తను ఆ సినిమా చేయాలనుకుంటున్నాన్నారు. అయినా అక్కడి తో కూడా విషయం ఆగలేదు. ఇప్పుడు గంటా నేరుగా ఆ సబ్జెక్ట్ మీద వర్క్ చేయించేస్తున్నారని తెలుస్తోంది. తాము సినిమా స్టార్ట్ చేసేస్తే, ఏదో విధంగా వాళ్లే కాంప్రమైజ్ కు వస్తారని గంటా భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా తనకు సన్నిహితుడైన అల్లు అరవింద్ నిర్మాత టాగోర్ మధుకు కూడా సన్నిహితుడే కాబట్టి అట్నుంచి నరుకొద్దామని, అలాగే దగ్గుబాటి సురేష్ చేత పని కానిద్దామని గంటా ఆలోచనగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ విషయం తెలిసి, సమస్యేలేదు, ఈ ప్రాజెక్టును హీరో రవితేజ తో తప్ప వేరే వాళ్లతో చేసే ప్రసక్తే లేదు అని చోటా కే నాయుడు అంటున్నట్లు తెలుస్తోంది. స్నేహం స్నేహమే, వ్యాపారం వ్యాపారమే ఈ సినిమాను తాను హీరో రవితేజతోనే తీయాలనుకుంటున్నా అని టాగోర్ మధు చెబుతున్నట్లు తెలుస్తోంది.
అయినా తొలిసినిమా, అది కూడా మిడిల్డ్ ఏజ్డ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ను గంటా కొడుకు రవితేజ లాంటి కొత్త నటుడు చేయలేడని, సినిమా బాగుంది కదా అని తీసుకుంటే సరిపోదని, రోల్ ఫిట్ అవుతుందా లేదా అన్నది కూడా ఆలోచించాలని ఇండస్ట్రీలో సజెషన్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు, వీలయినంత స్మూత్ గా ఎంట్రీ ఇవ్వాలి కానీ, ఇలా కాంట్రా వర్సీతో రాకూడదని సజెషన్స్ వినిపిస్తున్నాయి. కానీ అవతల వున్నది మంత్రి కావడంతో ఇండస్ట్రీ వర్గాలు బయటకు ఏమీ అనకుండా తెరవెనుకే గుసగుసలు పోతున్నాయి.
మొత్తం మీద సేతుపతి ఎవరి చేతిలో పడుతుందో? సీనియర్ రవితేజనా? బ్రాండ్ న్యూ రవితేజ చేతిలోనా?