నిన్నటిదాకా రామ్‌చరణ్‌కి మాత్రమే.. ఇప్పుడు చిరంజీవికి కూడా ఆ సమస్య ఎదురయ్యేలా వుంది. రామ్‌చరణ్ సినిమా ఫంక్షన్లలో, 'పవన్‌కళ్యాణ్ ఎక్కడ.?' అన్న ప్రశ్నలు సర్వసాధారణమే. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చరణ్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూస్తూనే వున్నాం. ఆ మాటకొస్తే, చిరంజీవి కూడా పలు ఫంక్షన్లలో ఇబ్బంది పడ్డారు. అఫ్‌కోర్స్, కొన్ని వేడుకల్లో చిరంజీవి, చరణ్, పవన్‌కళ్యాణ్ కన్పిస్తున్నా.. ప్రతి మెగా ఫంక్షన్‌లోనూ పవన్‌కళ్యాణ్‌ని చూడాలన్నది అభిమానుల అత్యుత్సాహం.
జనవరి 7న చిరంజీవి హీరోగా రూపొందిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనున్న విషయం విదితమే. ఈ వేదికపై పవన్‌కళ్యాణ్ కన్పిస్తాడా.? లేదా.? మామూలుగా అయితే, పవన్‌కళ్యాణ్ ఈ వేడుకకి వచ్చి తీరాలి. ఎందుకంటే, ఇది ఆషామాషీ ఫంక్షన్ కాదు. హీరోగా చిరంజీవి 9 ఏళ్ళ తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో, తమ్ముడిగా అన్నయ్యకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఈ వేడుకని వేదికగా చేసుకోవాల్సి వుంటుంది పవన్‌కళ్యాణ్.
అయితే, పవన్ ఈ వేడుకకి హాజరు కాకపోవచ్చన్న సంకేతాలు మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నాయి. 'పవన్‌కళ్యాణ్ ఇండియాలో వుంటే తప్పక వస్తారు.. కానీ ఆయనకు బిజీ షెడ్యూల్స్ వున్నాయి..' అంటూ పవన్‌పై అల్లు అరవింద్ దాదాపు క్లారిటీ ఇచ్చేసిన కాస్సేపటికే, చరణ్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. 'నేను బాబాయ్‌ని కలుస్తున్నాను.. ఇన్విటేషన్ ఇస్తాను.. ఆయనేమీ చిన్న పిల్లాడు కాదు కదా.. రావాలో, రావొద్దో ఆయనే నిర్ణయించుకోగలరు..' అని చరణ్, ఫేస్‌బుక్‌లో క్లారిటీ ఇచ్చేశాడు.
పవన్‌కళ్యాణ్, 'ఖైదీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వస్తే సరేసరి.. రాకపోతే మాత్రం పెద్ద సమస్యే. పవన్ పేరుతో అభిమానుల హంగామా అలా ఇలా వుండదు. అది ఎలాగూ చిరంజీవికీ, చరణ్‌కీ కాస్తంత చికాకు తెప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలో ఈ చికాకు తప్పించడానికే, అల్లు అర్జున్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అంతకుముందు ఓ సారి నాగబాబుకీ ఒళ్ళు మండింది, పవన్ అభిమానుల మీద ఆగ్రహంతో ఊగిపోయారు అప్పట్లో ఆయన. మరి, ఈసారి ఏమవుతుందో.!