దసరా కానుక: కివీస్‌కి టీమిండియా వైట్‌ వాష్‌.!

అవును, భారత క్రికెట్‌ అభిమానులకు ఇది నిజంగానే దసరా కానుక. న్యూజిలాండ్‌ జట్టుపై టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. తద్వారా కివీస్‌కి ఇండియా టూర్‌లో వైట్‌ వాష్‌ తప్పలేదు. మూడు టెస్ట్‌ మ్యాచ్‌లలోనూ…

అవును, భారత క్రికెట్‌ అభిమానులకు ఇది నిజంగానే దసరా కానుక. న్యూజిలాండ్‌ జట్టుపై టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. తద్వారా కివీస్‌కి ఇండియా టూర్‌లో వైట్‌ వాష్‌ తప్పలేదు. మూడు టెస్ట్‌ మ్యాచ్‌లలోనూ టీమిండియా సత్తా చాటింది. తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి ఇప్పటికే సిరీస్‌ని కైవసం చేసుకున్న టీమిండియా, మూడో మ్యాచ్‌లోనూ నెగ్గి 3-0 తేడాతో న్యూజిలాండ్‌కి దిమ్మ తిరిగే షాకిచ్చింది. 

వాస్తవానికి నేడు మ్యాచ్‌ పూర్తవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ రోజు సాయంత్రం వరకూ టీమిండియా బ్యాటింగ్‌ చేస్తుందేమో అనుకున్నారంతా. కానీ, కెప్టెన్‌ కోహ్లీ పెర్‌ఫెక్ట్‌ ప్లానేశాడు. 475 పరుగుల విజయలక్ష్యాన్ని కివీస్‌ ముందుంచి, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ని 216 పరుగుల వద్ద డిక్లేర్‌ చేశాడు. భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకున్న న్యూజిలాండ్‌ ఏ దశలోనూ కనీసం, మ్యాచ్‌ని 'డ్రా' చేసుకునే ప్రయత్నమైతే చేయలేకపోయింది. ఫలితం.. మూడోసారి టీమిండియాకి అడ్డంగా దొరికిపోయింది కివీస్‌. 

తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 7.. మొత్తం 13 వికెట్లను భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ఖాతాలో వేసుకుని, న్యూజిలాండ్‌ని కోలుకోలేని దెబ్బ తీశాడు. భారత బ్యాటింగ్‌ రెండో ఇన్నింగ్స్‌ విషయానికొస్తే, గాయంతో కోలుకోలేడనుకున్న గంభీర్‌, అర్థ సెంచరీ సాధించాడు. పుజారా సెంచరీ నమోదు చేశాడు. మొత్తమ్మీద 300 పైచిలుకు పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 

న్యూజిలాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత టీమిండియా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌ని కైవసం చేసుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఆ పొజిషన్‌ని మరింత స్ట్రాంగ్‌ చేసుకుంది టీమిండియా.