బయోపిక్స్ తీసుకుని చూసుకోవాల్సినంత గొప్ప వాళ్లేమీ కాదు క్రికెటర్లు.. అని అంటున్నాడు గౌతమ్ గంభీర్. వేరే ఎవరైనా ఈ తరహా అభిప్రాయాన్ని వ్యక్త పరిచి ఉంటే, అది కేవలం విమర్శగానే మిగిలిపోయేది. క్రికెటర్లు.. వారిపై వేలం వెర్రి క్రేజ్.. తదితర అంశాలను నిరసించే వాళ్లు, దేశంలో క్రికెట్ తప్ప మరేం లేదా? అని ప్రశ్నించే వాళ్లు.. ఈ తరహా అభిప్రాయాన్ని వ్యక్త పరిచి ఉంటే అది వేరే కథ.
క్రికెటర్ల జీవితానికి బయోపిక్ సీన్ లేదు, వీళ్ల కన్నా గొప్ప వాళ్లు ఎంతో మంది ఉన్నారు, అలాంటి వారి జీవిత గాథలను సినిమాలుగా చిత్రీకరిస్తే అంతో ఇంతో ఉపయోగం ఉంటుంది.. అన్నది ఒక క్రికెటరే! అది కూడా.. టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలో… అందుకు సంబంధించి మీడియాలో హడావుడి కొనసాగుతున్న తరుణంలో.. తన బయోపిక్ ను ధోనీ స్వయంగా ప్రమోట్ చేసుకుంటున్న తరుణంలో… గంభీర్ ఇలా మాట్లాడటం ఆసక్తికరమైన అంశం!
అది కూడా ధోనీతో విబేధాలున్నాయనే.. ప్రచారం పొందిన ఒక క్రికెటర్ ఇలా మాట్లాడటానికి మించిన మసాలా ఏముంటుంది?
గంభీర్ అల్లాటప్పా క్రికెటరేమీ కాదు, జట్టులో చోటు దక్కనంత మాత్రానా తక్కువ అంచనాలు వేయదగ్గ క్రికెటర్ కాదు, టీమిండియాకు దక్కిన టీ 20, వన్డే ప్రపంచకప్ ల ఫైనల్స్ లో అత్యంత కీలక పాత్ర గంభీర్ దే. ఆ ఫైనల్స్ లో గంభీర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడాడు. మిగతా ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టిన వేళ కూడా గంభీర్ స్థైర్యంగా ఆడి.. మ్యాచ్ పై ఆశలను నిలిపాడు. ధోనీ, యువరాజ్ లాంటి వాళ్లు ఫైనల్ లో విజయాన్ని ఫినిష్ చేసినా, పునాదులు మాత్రం గంభీర్ వే!
కానీ.. ఈ ఢిల్లీ వాలాకు జాతీయ జట్టు లో స్థానం దక్కడం లేదు. చాన్నాళ్లు ఈ పరిస్థితే కొనసాగుతోంది. ఇప్పుడు కథ ఎక్కడి వరకూ వచ్చిందంటే.. ఇకపై మళ్లీ గంభీర్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోగలడా? అనేదే ప్రశ్నార్థకంగా మారింది! మరి తనకంటూ ప్రత్యేకత కలిగిన ఒక క్రికెటర్ కు రెండో ఛాన్స్ అనేదే ఇవ్వకుండా.. ఇక రిటైర్మెంట్ ప్రకటించుకోవడమే తరువాయి అనే పరిస్థితి రావడమంటే.. సహజంగానే ఈ విషయం పై రకరకాల మాటలు వినిపిస్తాయి.
అందులో ముఖ్యమైనది..గంభీర్ ను జట్టు లోకి రానీయకుండా ధోనీ అడ్డు పడ్డాడు అనేది. కెప్టెన్ గా తన వాళ్లను, తనకు నమ్మిన బంటుల్లాంటి వాళ్ల వైపే మొగ్గు చూపుతూ గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ వంటి వాళ్ల అవకాశాలను దెబ్బతీశాడనే మాట చాలా సార్లే వినిపించింది. రైనా, రవీంద్ర జడేజా వంటి వాళ్లు కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టకుండానే సంవత్సరాలకు సంవత్సరాలుగా జట్టులో ఉంటున్నారు. వీళ్లకు అసలు ఆడటం వచ్చా…వచ్చీ మరిచిపోయారా అనిపిస్తుంది వీళ్ల ప్లేయింగ్ ను చూస్తే. వీళ్లు టీమ్ లో ఎందుకోసం ఉన్నారో, అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్న వాళ్లకు ప్రతి సారీ ఫైనల్ ఎలెవన్ లో ఎలా చోటు దక్కుతోందో.. అర్థం కాని పరిస్థితి ఉంది.
ధోనీ ఆశీస్సులతోనే వారు జట్టులో ఉన్నారనే అభిప్రాయముంది. సెహ్వాగ్ ను కానీ, వీరూను కానీ, యువీని కానీ.. రైనాలా, జడేజాలను భరించినట్టుగా భరించలేదు. సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించేసి తప్పుకున్నాడు. ఇక యువీనేమో.. ధోనీ మంచోడు..అని వివాదాలెందుకన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక స్వతహాగా దూకుడు మనస్తత్వం వాడైన గంభీర్ మాత్రం ధోనీ తీరు మీద తీవ్రమైన అసంతృప్తినే కలిగి ఉన్నాడని అంటారు.
మరి ఈ నేపథ్యంలోనే గంభీర్.. ధోనీ బయోపిక్ విడుదలకు సిద్ధం అవుతున్నవేళ, క్రికెటర్లకు సినిమా అంత సీన్ లేదని అంటూ.. ధోనీకి అంత సీన్ లేదని చెప్పదలిచాడనేది విశ్లేషకుల, కొందరు అభిమానుల మాట.