ఆర్మీ ఫెయిల్యూర్‌: డిగ్గీ రాజా నాన్సెన్స్‌

సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని ప్రాణాలొడ్డి పోరాడటమంటే, మీడియా మైకుల ముందు ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడటం అనుకుంటున్నట్టున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌. మీడియా అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక 'నో కామెంట్‌' అనేసే…

సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని ప్రాణాలొడ్డి పోరాడటమంటే, మీడియా మైకుల ముందు ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడటం అనుకుంటున్నట్టున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌. మీడియా అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక 'నో కామెంట్‌' అనేసే దిగ్విజయ్‌సింగ్‌కి, సరిహద్దుల్లో పోరాడుతున్న సైన్యం గురించి కామెంట్‌ చేసే నైతిక హక్కు ఎక్కడిది.? 

సోషల్‌ మీడియా అంటేనే నాన్సెన్స్‌.. అనే స్థాయికి దిగ్విజయ్‌ సింగ్‌ లాంటోళ్ళే విలువల్ని దిగజార్చేస్తున్నారు. అవును మరి, పాకిస్తాన్‌ బోర్డర్‌కి దగ్గర్లోని 'యురి'లో తీవ్రవాదులు, సైన్యంపై జరిపిన దాడిలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందడం, మరో ముగ్గురు ఆసుపత్రిలో మృతి చెందడం, పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం తెల్సిన విషయమే. ఈ ఘటనని ఆర్మీ వైఫల్యంగా కొట్టి పారేశారు దిగ్విజయ్‌సింగ్‌. 

వందలాది మంది సైన్యం 'యురి' సైనిక శిబిరంలో వుంటారు. సరిగ్గా టైమ్‌ చూసుకుని, తీవ్రవాదులు ఆ శిబిరంపై కాల్పులకు తెగబడ్డారు. ఇది వ్యూహాత్మక దాడి. దాన్ని తిప్పి కొట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చిన్నపిల్లాడినడిగినా ఈ విషయం చెబుతాడు. పైగా, జమ్మూకాశ్మీర్‌లో వేర్పాటువాద రాజకీయాల్ని ప్రోత్సహించింది కాంగ్రెస్‌ పార్టీయేనన్న విషయం దిగ్విజయ్‌సింగ్‌ మర్చిపోతే ఎలా.? కాంగ్రెస్‌ హయాంలో జమ్మూకాశ్మీర్‌లో వేర్పాటువాద రాజకీయాలు పెచ్చిపోయాయి. వేర్పాటువాదం విషవృక్షంగా ఎదిగిందక్కడ కాంగ్రెస్‌ పుణ్యమా అని. కాంగ్రెస్‌ హయాంలో వేర్పాటువాదులు ఆడిందే ఆట పాడిందే పాటలా తయారైంది కాశ్మీర్‌లో. ఆ వేర్పాటువాదుల మద్దతుతో తీవ్రవాదం చెలరేగిపోతోందన్నది నిష్టురసత్యం. 

దిగ్విజయ్‌సింగ్‌ సహా దేశంలో రాజకీయ ప్రముఖులు స్వేచ్ఛగా తిరుగుతోందంటే, దేశంలో జనజీవనం సజావుగా సాగుతోందంటే, సరిహద్దుల్లో ఆర్మీ కంటికి నిద్ర లేకుండా కాపలా కాస్తుండడమే. అలాంటి ఆర్మీకి దేశమంతా అండగా నిలవాలి. విపత్కర పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కేంద్రానికి అండగా వుండాలి. రాజకీయం అన్ని వేళలా పనిచేయదు. దేశ భద్రత విషయంలో, దేశమంతా ఒక్కటై వుండాలి. ఈ మాత్రం కామన్‌సెన్స్‌ కూడా లేని దిగ్విజయ్‌సింగ్‌, ఓ జాతీయ పార్టీకి సీనియర్‌ నేత.. సిగ్గు సిగ్గు.!