క్రికెట్‌లో టర్బొనేటర్ అంటే హర్భజన్ సింగ్. అభిమానులు ముద్దుగా తమ అభిమాన క్రికెటర్ హర్భజన్‌సింగ్‌ని 'బజ్జీ' అనీ, 'టర్బొనేటర్' అని పిలుచుకుంటారని అందరికీ తెల్సిన విషయమే కదా. ఈ మధ్య క్రికెట్‌కి బాగా దూరమైపోయిన హర్భజన్‌సింగ్, వీలు చిక్కినప్పుడల్లా మీడియాలో చోటు సంపాదించుకునేందుకు నానా తంటాలూ పడ్తున్నాడు.
'నేను చూసిన కెప్టెన్లలో ది బెస్ట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రమే..' అని హర్భజన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలతో మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు గుస్సా అయ్యారు. ఇండియన్ క్రికెట్‌లో ధోనీని మించిన కెప్టెన్ ఎవరున్నారంటూ ధోనీ అభిమానులు, టర్బొనేటర్‌పై విరుచుకుపడిపోయారు. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలంటే, సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా వున్నప్పుడు నేర్పిన పోరాట పటిమే, ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీలో టీమిండియా అనూహ్య విజయాలు సాధించడానికి కారణమన్నది నిర్వివాదాంశం.
ఇక, హర్భజన్‌సింగ్ ఐపీఎల్ సీజన్‌లో శ్రీశాంత్‌ని చెంపదెబ్బ కొట్టిన ఘటన గురించి అంతా మర్చిపోయిన టైమ్‌లో, మళ్ళీ టర్బొనేటర్ ఈ వివాదాన్ని కెలికేశాడు. సరదాగా కొడితే, శ్రీశాంత్ దాన్ని పెద్ద వివాదంగా మార్చాడు, ఓవరాక్షన్ చేశాడని హర్భజన్‌సింగ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. 'తిన్నవాడికే ఆ దెబ్బ తాలూకు నొప్పి తెలుస్తుంది..' అంటూ శ్రీశాంత్ కౌంటర్ ఇచ్చాడు హర్భజన్‌కి.
తాజాగా, హర్భజన్‌సింగ్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ని కెలికాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ తనతోపాటు యువరాజ్‌సింగ్‌ని కూడా కొట్టాడనీ, దూషించాడని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. వివాదం ముదిరి పాకాన పడ్తుండడంతో అక్తర్ స్పందించి, అదేదో సరదాగా జరిగిన ఘటన అనీ, దాన్ని హర్భజన్ ఎందుకు ఇప్పుడు వివాదం చేయాలనుకుంటున్నాడో తనకు అర్థం కావడంలేదని వివరణ ఇచ్చాడు.
చూస్తోంటే.. టర్బొనేటర్ 'సానుభూతి' కోసం ఇదంతా చేస్తున్నాడేమో అన్పిస్తోంది కదూ.!