కుంబ్లే.. టీమిండియాకు కోచింగ్ కత్తిమీద సామే..!

ఇండియన్ టీమ్ కు కోచ్ గా వ్యవహరించి.. అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ డమ్ ను సంపాదించిన వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో ఈ కోచ్ గా అనుసరించిన విధానాల విషయంలో తీవ్రంగా విమర్శల…

ఇండియన్ టీమ్ కు కోచ్ గా వ్యవహరించి.. అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ డమ్ ను సంపాదించిన వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో ఈ కోచ్ గా అనుసరించిన విధానాల విషయంలో తీవ్రంగా విమర్శల పాలైన వారూ ఉన్నారు! జాన్ రైట్, గ్యారీ క్రిస్టెన్ లు టీమిండియా కోచ్ లుగా మోస్ట్ సక్సెస్ ఫుల్. ఫ్లెచర్ కోచ్ గా ఇలాంటి ప్రత్యేకతా చూపించలేకపోయాడు. గ్రేగ్ ఛాపెల్ ను మాత్రం అత్యంత  చెడ్డ కోచ్ గా అభివర్ణిస్తారు క్రికెట్ దిగ్గజాలు. సచిన్ , లక్ష్మణ్ లు చాపెల్ మీద ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

అదంతా విదేశీ కోచ్ లవ్యవహారం. చాన్నాళ్లకు టీమిండియాకు ఒక ఫుల్ టైమ్ స్వదేశీ కోచ్ వచ్చాడు. అది కూడా చాలా మంది ఇష్టుడైన టీమిండియన్ మాజీ టెస్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే. (లాల్ చంద్ రాజ్ పుత్ ఫుల్ టైమ్ కోచ్ కాదు. రాబిన్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్ లు అసిస్టెంట్ కోచ్ లే, రవిశాస్త్రికి కోచ్ ట్యాగ్ ఇవ్వలేదు.

ఫ్లెచర్ ప్రధాన కోచ్ గా ఉండగా.. శాస్త్రి మేనేజర్ గా వ్యవహరించాడు.)  ఈ క్రికెటర్ కు చరమాంకంలో కెప్టెన్సీ ఇవ్వడం చాలా మందిని ఆనంద పెట్టిన విషయం. సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ధోనీ వంటి వాళ్లంతా ఉన్న టీమ్ కు కుంబ్లే కెప్టెన్ గా వ్యవహరించాడు. కెప్టెన్ గానే కుంబ్లే రిటైర్ అయ్యాడు. కొంత విరామంతో కోచ్ గా వస్తున్నాడు. అయితే టీమిండియాకు గతంలో పని చేసిన స్వదేశీ కోచ్ ల అనుభవాలు మాత్రం అంత గొప్పగా లేవు!

ఒకరకంగా చెప్పాలంటే.. భారత క్రికెట్ టీమ్ కు చివరాఖరి ఫుల్ టైమ్ కోచ్ కపిల్ దేవ్. అప్పట్లో వివాదాలు, విబేధాలు.. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం.. టీమిండియాను ఒక కుదుపుకుదిపాయి. మనోజ్ ప్రభాకర్ వంటి వాళ్లు కపిల్ పై తప్పుడు ఆరోపణలు చేయడంతో కపిల్ కోచ్ పదవికి తక్షణం రాజీనామా చేశాడు. 

జాన్ రైట్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. జరిగిన కోచ్ వేటలో చాలా మంది భారతీయ మాజీ క్రికెటర్ల పేర్లు  వినిపించాయి. అప్పట్లోనే సందీప్ పాటిల్ ను కోచ్ గా చేస్తారన్నారు. అయితే నాటి కెప్టెన్ గంగూలీ స్వదేశీ కోచ్ వైపు మొగ్గు చూపలేదు. టామ్ మూడీ తదితరులు పోటీ పడినా.. చాపెల్ ను తెచ్చుకున్నారు. అదంతా ఒక పీడకల.

అసలు టీమిండియాకు కోచ్ అవసరమా? అనేది గవాస్కర్ వంటి వాళ్లు వేసే ప్రశ్న. అలాగే విజయాల క్రెడిట్ కోచ్ లకు ఇవ్వడాన్ని గవాస్కర్ పలు మార్లు తప్పుపట్టాడు. కోచ్ విషయంలో జరిగిన ఇంటర్వ్యూలో కుంబ్లే కొన్ని గంటల పాటు ప్రజేంటేషన్ ఇచ్చాడట. దీంతో సచిన్, లక్ష్మణ్, గంగూలీల త్రయం.. కుంబ్లే వైపు మొగ్గు చూపిందని అంటున్నారు. 

అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కుంబ్లేకు అప్పగించకుండా.. మళ్లీ రవిశాస్త్రిని కూడా ట్యాగ్ చేయడం గమనించాల్సిన అంశమే. రవిశాస్త్రికి ఈ విధమైన పదవి దక్కడం టెస్టు కెప్టెన్ కొహ్లీ ఒత్తిడి అనేది బహిరంగ రహస్యం. కొహ్లీని టెస్టులతో పాటు.. వన్డేలకు కూడా పూర్తి స్థాయి కెప్టెన్ గా నియమించాలని అనే విశ్లేషణను తరచూ చేస్తూ శాస్త్రి కొహ్లీకి ఇష్టుడు అయ్యాడు. ఫలితంగానే శాస్త్రి కి మళ్లీ బ్యాటింగ్ కోచ్ అంటూ ఉపాధి కల్పించారు.

విదేశీ కోచ్ ను అయితే నెత్తిన పెట్టుకున్నా, భారత మాజీలంతా ఆయనపై విమర్శలు చేసి.. బీసీసీఐ వారిని వెనక్కు పంపించేసినా అదో ముచ్చట. కానీ కుంబ్లే విషయం అలా ఉండదు. విజయాల్లో ఉంటే అంతా బాగుంటుంది. ఓడిపోతే మాత్రం మీడియాది, మాజీలది కక్కలేని మింగలేని పరిస్థితే ఉంటుంది. గెలుపోటములను కోచ్ కు అన్వయించి చూసే సంప్రదాయం మన దగ్గర ఉంది. కాబట్టి ఇన్ని రోజులూ ఆరాధ్యుడిగా ఉండిన కుంబ్లే కి కోచింగ్ అనేది నిస్సందేహంగా కత్తిమీద సామే!