ఎమ్బీయస్‌: బీఫ్‌ సంగతి, సరే ఓటేయనిస్తారా..?

'మాకు ఓటేయకపోతే బీఫ్‌ తినడానికి వుండదు జాగ్రత్త' అని మజ్లిస్‌ నాయకుడు ఒవైసీ హెచ్చరించాడు. తిండి మాట అవతల, అసలు ఉండనిస్తారా, యిష్టపడినవాడికి ఓటేయనిస్తారా లేదాన్న భయం పట్టుకుంది యీ రోజు. సామాన్యుడికే కాదు,…

'మాకు ఓటేయకపోతే బీఫ్‌ తినడానికి వుండదు జాగ్రత్త' అని మజ్లిస్‌ నాయకుడు ఒవైసీ హెచ్చరించాడు. తిండి మాట అవతల, అసలు ఉండనిస్తారా, యిష్టపడినవాడికి ఓటేయనిస్తారా లేదాన్న భయం పట్టుకుంది యీ రోజు. సామాన్యుడికే కాదు, రాష్ట్రస్థాయి నాయకులకు కూడా. సాక్షాత్తూ డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీకే దిక్కు లేని పరిస్థితి కలిగింది పుష్కరం పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో! ఆయన యింటిపై దాడి చేస్తే అక్కడి పోలీసులు పారిపోయారు. అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్‌ అంటూ వాళ్లకు ఇన్నోవాలు యిచ్చారు కదా, వాటిలో పారిపోయారు కాబోలు. ఎక్కడ పడితే అక్కడ సిసిటివిలు పెట్టేస్తాం అన్నారు, పాతబస్తీలో మజ్లిస్‌ నాయకులు వీరవిహారం చేస్తూ వుంటే ఆ సీన్లు ఆ కెమెరాల్లో పోలీసు కమిషనర్‌కు, ఎలక్షన్‌ కమిషనరుకు కనబడలేదా? సెక్షన్‌ 144 పెట్టిన చోట ఏభయ్యేసి మోటారు సైకిళ్లతో చెట్టంత మనిషి అసదుద్దీన్‌ తిరుగుతూ వుంటే ఆ కెమెరాలు కాప్చర్‌ చేయలేదా? హెల్మెట్‌ పెట్టుకోలేదనే కారణం చూపైనా వాళ్లను ఆపి వుండవచ్చు కదా! అబ్బే! మజ్లిస్‌ దాడిని ఖండించడానికి మాటల మరాఠీగా పేరు పొందిన కెసియార్‌కు యిప్పటివరకు మాట పెగలలేదు. గ్రేటర్‌ హైదరాబాదును అంతర్జాతీయ నగరం చేసే బాధ్యత భుజాల కెత్తుకుని వరస లెక్చర్లు దంచిన కెటియార్‌కూ గొంతు మూగబోయింది. కేవలం నాయిని మాత్రం ఖండించారు. పేరుకు హోం మంత్రే కానీ ఆయనకు ఏ ప్రాముఖ్యతా లేదని అందరికీ తెలుసు. ఇలాటి సందర్భాల్లో నాయకులు 'అవతలివాళ్లు మా వాళ్లను రెచ్చగొట్టడంతో మా కార్యకర్తలు ఆవేశంలో ఏదో చేశారు, చింతిస్తున్నాం' అంటారు. కానీ మజ్లిస్‌ విషయంలో సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలే దాడి చావగొట్టారు. గతంలో ప్రభుత్వోద్యోగులను, వైద్యులను, తస్లీమాను కొట్టినవారు కూడా ఎమ్మెల్యేలే. 

అసదుద్దీన్‌ ఇంగ్లీషులో గొప్ప తర్కంతో బ్రహ్మాండంగా మాట్లాడి పార్లమెంటులో, చర్చావేదికల్లో మేధావులను కూడా మెప్పించవచ్చు. అది ముసుగు మాత్రమే. అతని అసలైన అవతారం ఎన్నికల సమయంలో బయటపడుతుంది. దుడ్డుకర్ర పట్టుకుని ఎన్నికల బూతులపై పడి ఓటర్లను చావగొడుతున్నపుడు అపరిచితుడి మరో రూపం గోచరిస్తుంది. ముస్లిములను రక్షించడానికే అవతరించామని వారు చెప్పుకునేదంతా బోగస్‌ అని మరోసారి రుజువైంది. నిన్న వాళ్లు కొట్టినది సాటి ముస్లిములనే. వాళ్ల కాళ్ల దగ్గర పడి వుంటేనే, వాళ్ల అత్యాచారాలు భరిస్తేనే వారి దృష్టిలో ముస్లిములవుతారు. వారి ధోరణి వ్యతిరేకిస్తే చాలు చావగొడతారు, నరికి పోగులు పెడతారు. ఇది నిన్న కాదు, ఎప్పణ్నుంచో జరుగుతోంది.  తమ పార్టీ నుంచి విడివడిన ఎంబిటి నాయకులతో వారు వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు చూడండి. తమ పార్టీకి వ్యతిరేకంగా నిలబడిన ముస్లిము అభ్యర్థుల దుంప తెంపడం వారికి అలవాటు. నిన్నటి క్రమం చూడండి, వాళ్లు పోలీసు వ్యవస్థకు యిచ్చే గౌరవం ఎలా వుందో తెలుస్తుంది. 

మజ్లిస్‌ పార్టీలో టిక్కెట్టు దొరక్కపోవడంతో పార్టీ మారి కాంగ్రెసు తరఫున పురానాపూల్‌ డివిజన్‌ అభ్యర్థిగా నిలబడిన గౌస్‌ మజ్లిస్‌కు ఛాలెంజ్‌గా నిలిచాడు. అతని కొడుకు, భార్య కూడా వేరే డివిజన్లలో నుంచున్నారు. వీరిని భయపెట్టి తీరాలని మజ్లిస్‌ నిశ్చయించుకుంది. అతని వర్గం, మజ్లిస్‌ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ వర్గం కలహించుకున్నారు. పాషా స్వయంగా గౌస్‌పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు యిద్దర్నీ అరెస్టు చేసి, ఎందుకైనా మంచిదని చెరో పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు. చార్మినార్‌ ఠాణాకు పాషా తీసుకెళ్లి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టేశారు. కానీ మీర్‌చౌక్‌ ఠాణాకు తీసుకెళ్లిన గౌస్‌ను పోలీసులు విడిచి పెట్టలేదు. అక్కడే పక్షపాతం చూపించారు. మజ్లిస్‌, తెరాసకు మిత్రపక్షం అనే మాట మనకెలా తెలుసో, పోలీసులకూ తెలుసు. పై నుంచి ఆదేశాలు వచ్చాయేమో కూడా. కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ ఆలీ ఠాణాకు వెళ్లి వాదించి సొంత పూచీకత్తుపై గౌస్‌ను విడిపించుకుని బయలుదేరారు. వాళ్లు అలా వెళ్లగానే కబురు తెలిసిన అసద్‌ మీర్‌ చౌక్‌ ఠాణాకు వచ్చి గేటు తన్నుకుంటూ లోపలకి వెళ్లి గౌస్‌ను ఎందుకు విడిచి పెట్టారంటూ పోలీసు స్టేషన్‌లో బీభత్సం సృష్టించాడు. పాషాతో పాటు అరెస్టయిన యిద్దరు మజ్లిస్‌ కార్యకర్తల్ని బలవంతంగా ఏ పూచీకత్తు లేకుండా బయటకు తీసుకొచ్చాడు. వాళ్లు వెళుతూంటే పురానాపూల్‌ వద్ద గౌస్‌ను తీసుకెళుతున్న ఉత్తమ్‌ కారు కనబడింది. అంతే దాన్ని అపేసి, కార్యకర్తల చేత అద్దాలు పగలకొట్టించి, తను స్వయంగా బానెట్‌పై చేతులతో గుద్ది, ఉత్తమ్‌ను బయటకు లాగి ముఖంపై చేయి విసిరాడు. షబ్బీర్‌ అలీని అసద్‌ అనుచరులు కడుపుపై, ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. పోలీసులు వచ్చి అలా గుద్దినతన్ని ఠాణాకు తీసుకెళితే అసద్‌ ఠాణాపై పడి బెదిరించాడు. వాళ్లు భయపడి వదిలేశారు. 

మజ్లిస్‌ వారు కాంగ్రెసు వారిని, ఎంబిటివారిని, బిజెపి వారిని, టిడిపి వారిని, ముస్లిం పాత్రికేయుణ్ని మాత్రమే కాదు, తెరాస పార్టీ నాయకుడు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కొడుకు మహ్మద్‌ ఆజం అలీని కొట్టారు. వచ్చే ఎన్నికలలో మలక్‌పేటలో అతను తెరాస తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతాడనే వదంతి వుండడం చేత యిప్పణ్నుంచే అడలగొడదామని ప్రస్తుత ఎమ్మెల్యే బలాలా 30 మందితో వచ్చి కొట్టాడు. తర్వాత మహమూద్‌ అలీ యింటిపై పడ్డారు. భద్రతా సిబ్బంది పారిపోయారు. 'పాత బస్తీ మాది, మీకు యిక్కడ పనేముంది?' అని అసద్‌ అందరితో అంటున్నాడు. నిజమే అని తెరాస ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లు కనబడుతోంది. అందుకే అక్కడ ఎంత అరాచకం నడిచినా ముఖ్యనాయకులు మౌనం పాటిస్తున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవటం లేదు. పోలీసుల చేతులు కట్టేసినది పాలకపక్షమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ కథ చాలా పాతదే. మజ్లిస్‌ నాయకులకు వచ్చిన విద్య ఒక్కటే, ముస్లిముల పేరు చెప్పి తాము దండుకోవడం, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ పాత బస్తీని తమ జాగీరుగా చేసుకోవడం, ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే యావత్తు ముస్లిము సమాజానికి విఘాతం కలిగినట్లు అల్లరి చేయడం. ఇవన్నీ సాగడానికి వారు అధికారంలో ఎవరుంటే వారితో దోస్తీ చేస్తూ వచ్చారు. వారి అవసరం వారిది, కానీ అధికారంలో వున్నవాళ్లు వాళ్లతో మిలాఖత్‌ కావడం దేనికి? 

నాకు తెలిసి ఎన్టీయార్‌ ఒక్కరే మజ్లిస్‌ను దూరం పెట్టారు. 1983లో ఆయన నెగ్గినపుడు మజ్లిస్‌ నాయకులు అభినందించడానికి వస్తే ఆయన చీదరించుకున్నాడట. రమణాచారిని కుడాకు యిన్‌చార్జిగా వేసి పాత బస్తీలో ఎంతో అభివృద్ధి చూపించారు. పోలీసులకు స్వేచ్ఛ నిచ్చి శాంతిభద్రతలు నెలకొల్పారు. అది కొద్ది కాలమే. తర్వాతి రోజుల్లో కాంగ్రెసు, టిడిపి ఒకరి తర్వాత మరొకరు మజ్లిస్‌ను మోస్తూ వచ్చారు. సిపిఎం తరఫున మధు, బిజెపి మాత్రమే పోట్లాడుతూ వచ్చారు. ఉద్యమకాలంలో తెరాస మజ్లిస్‌తో సిద్ధాంతపరంగా విభేదిస్తూ వచ్చింది. మజ్లిస్‌ది సమైక్యవాదమైతే తెరాసది విభజనవాదం. అలాటిది ఎప్పుడైతే రాష్ట్రం చీలిందో మజ్లిస్‌ ప్లేటు ఫిరాయించింది. కాంగ్రెసును వదిలి తెరాసతో అంటకాగుతోంది. తెరాసకు వ్యతిరేకంగా వున్న పార్టీలన్నిటినీ ఓ చూపు చూసింది. మజ్లిస్‌ చెప్పినట్లా ఆడి, పాత బస్తీలో తమ యూనిట్లను చేజేతులా నాశనం చేసుకున్న కాంగ్రెసు, టిడిపి యీ రోజు లబోదిబో మంటున్నాయి. రీ

మజ్లిస్‌తో అంటకాగే అవసరం తెరాసకు ఏముందో తెలియటం లేదు. 150 సీట్లలో 70-80 సీట్లు వస్తాయని అంచనాలున్నాయి. రాకపోయినా పార్టీ ఫిరాయింపులలో ఆరితేరిన ఆ పార్టీ ఎదుటివాళ్లను లాక్కుని మేయరు పదవిని చేజిక్కించుకోగలదు. ఇక మజ్లిస్‌తో పనేముంది? ఈ ఎన్నికలలో మజ్లిస్‌ ప్రవర్తనకు తెరాస శిలువ మోయవలసి వస్తోంది. ఆంధ్రుల రక్షణకై అంటూ ఏర్పరచిన సెక్షన్‌ 8 ని వ్యతిరేకించిన తెలంగాణ నాయకులందరూ యిప్పుడు దాన్ని అమలు చేసి, తమకు రక్షణ కల్పించమని గవర్నరును వేడుకునే స్థితి వచ్చింది. అంటే ఆంధ్రులను తెలంగాణ వారి స్థాయికి తేలేకపోయినా, తెలంగాణ వారిని ఆంధ్రుల స్థాయికి దింపి హాహాకారాలు చేసేట్లు చేసింది తెరాస. బంగారు తెలంగాణ ఎలా వుందో భలేగా రుచి చూపించింది. ఇప్పణ్నుంచి తెరాసకు ఎవరైనా అడ్డు చెపితే ''నాయక్‌'' సినిమాలో 'ఆ గదిలోకి వెళ్లండి, అన్నీ విపులంగా చెప్తారు' అన్నట్లు, 'పాత బస్తీకి వెళ్లండి, మా మిత్రులు మీకు నచ్చచెపుతారు' అంటారు కాబోసు. ఈ లెక్కన తెరాస పాత బస్తీని మజ్లిస్‌ వంటి అసాంఘిక శక్తులకు ధారాదత్తం చేసినట్లే. టెర్రరిజానికి చిరునామాగా ముద్రపడిన హైదరాబాదులో, సాక్షాత్తూ డిప్యూటీ సిఎంకే రక్షణ లేని యిలాటి ఒక ఘెట్టో ఏర్పడడం ఎంత ప్రమాదకరమో కేంద్రం గుర్తించి, తగు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే హైదరాబాదును యూటీగా చేసి తన పాలనలోకి తీసుకోవాలి. అటువంటి ప్రతిపాదనను తెరాసేతర పక్షాలు వ్యతిరేకించబోతే ఫిబ్రవరి 2 నాటి సంఘటనలు గుర్తు చేసి, ''తన్నులు సరిపోలేదా?'' అని అడగాలి.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]