సిబిఐ ముందు… కేసుల గుట్టలు…

‘రాష్ట్ర ప్రభుత్వ న్యాయం చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలి’’ ఇలాంటి డిమాండ్స్ రోజుకొకటి చూస్తూనే ఉంటాం. అయితే కేసుల కుప్పల మధ్య చిక్కుకుని సిబిఐ ఇప్పటికే ఊపిరాడక…

‘రాష్ట్ర ప్రభుత్వ న్యాయం చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలి’’ ఇలాంటి డిమాండ్స్ రోజుకొకటి చూస్తూనే ఉంటాం. అయితే కేసుల కుప్పల మధ్య చిక్కుకుని సిబిఐ ఇప్పటికే ఊపిరాడక విలవిల్లాడుతున్న దుస్థితి చూస్తే సదరు డిమాండ్స్ ఫలించినా ఎటువంటి ప్రయోజనం ఉండదని అనిపించకమానదు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించిన డేటా, ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఇచ్చిన సమాధానంలో సిబిఐ పనితీరు, దాని స్థితిగతులు ప్రస్ఫుటమయ్యాయి. చేపట్టిన వాటిలో దాదాపుగా 1126కేసులు సిబిఐ విచారణలో విభిన్న దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సిబిఐ దర్యాప్తును కోరుతూ వస్తున్న కేసుల ఉధృతి ఏస్థాయిలో ఉందంటే… గత రెండున్నరేళ్లలోనే సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వాలు 144 కేసులను పంపాయట. అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టినవి 557 కేసులు. అంటే రమారమి నెలకు పాతిక కేసుల వరకూ కొత్తగా సిబిఐ ఖాతాలో చేరుతున్నాయన్నమాట.

పాతవి పేరుకుపోతూ… కొత్తవి ఇలా పెరిగిపోతూ ఉంటే… భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ పనితీరు కుంటుపడక ఏమవుతుంది? దీనిపై మంత్రి స్పందిస్తూ… పనితీరును మరింత వేగవంతం చేయడానికి సిబిఐని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని,శిక్షణ, మౌలిక వసతులను మెరుగుపచరచనున్నామని చెప్పారు.

సరే… ఇలాంటి పడికట్టు హామీల సంగతెలా ఉన్నా… సిబిఐ పనిలో రాజకీయ జోక్యం తగ్గించకపోతే ఈ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడం తప్ప అది సాధించేది ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే. మరోవైపు రాజకీయ లబ్ధి కోసం, చీటికీ మాటికీ ప్రతి వివాదానికీ సిబిఐ విచారణ అంటూ డిమాండ్ చేయడం, ఒక్కోసారి తలనొప్పి తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే అనేయడం జరుగకుండా ఉండాలి.  కొంత కాలం పాటు మితిమీరని ఒత్తిడి, రాజకీయ జోక్యం తగ్గితే… అప్పుడైనా సిబిఐ తన బ్యాలెన్స్ వర్క్‌ను పూర్తి చేసుకునేందుకు వీలు కలుగుతుందేమో…

 -ఎస్బీ