అసలేం జరుగుతోంది.? సినీ సంగీత దర్శకుడు చక్రి చనిపోతే, ఆయన మరణం కుటుంబంలో వివాదాన్ని రాజేయడమేంటి.? ఓ వైపు భార్య, ఇంకో వైపు కుటుంబ సభ్యులు నిలబడి చక్రి పరువుని బజార్న పడేయడమేంటి.? ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమేంటి.? ఇదంతా చాలదన్నట్టు మధ్యలో పొలిటికల్ పంచాయితీ ఏంటి.!
చక్రి మరణానంతరం తమను శ్రావణి తరఫున కొందరు బెదిరిస్తున్నారనీ, అలా బెదిరిస్తున్నవారిలో ఓ రాజకీయ నాయకుడు కూడా వున్నారని చక్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తోన్న విషయం విదితమే. అయితే చక్రి మరణానంతరం తనను దూరం పెట్టారనీ, ఆఖరికి డెత్ సర్టిఫికెట్ కూడా తనకు ఇవ్వలేదనీ, అంత్యక్రియలకు సంబంధించిన రశీదు కూడా తనకు ఇవ్వలేదని చక్రి భార్య శ్రావణి ఆరోపిస్తున్నారు.
మొత్తం వివాదం ఆస్తుల చుట్టూ తిరుగుతోందన్నది ఓపెన్ సీక్రెట్. అటు శ్రావణి, ఇటు చక్రి కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆస్తుల పంపకాల గురించే మాట్లాడుతున్నారు. డెత్ సర్టిఫికెట్ వస్తే తప్ప సెటిల్‌మెంట్లు జరగవని శ్రావణి ఓపెన్‌గానే చెబుతున్నారు. ‘ఆ ఆస్తులు మాకొద్దు..’ అంటూనే, చక్రికి ఏకంగా ఏడు కోట్ల ఆస్తులు వున్నాయని చక్రి కుటుంబం చెబుతోంది.
మధ్యలో తలదూర్చిన ఆ రాజకీయ నాయకుడు ఎవరు.? ఆయన ఏ లబ్దిని ఆశించి ఈ వివాదంలో తలదూర్చారు.? అన్న చర్చ ఓ పక్క జరుగుతుండగానే, చక్రి కుటుంబం మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని కలిసింది. ఎందుకు కలిశారు.? అన్నది ఇంకో సస్పెన్స్. ఇందులో సస్పెన్స్ ఏముంది, న్యాయం కోసం చక్రి కుటుంబం మంత్రిగారిని ఆశ్రయించొచ్చు.
ఏమో.. ఈ రాజకీయమేంటో, ఈ రాజకీయ పంచాయితీ ఏంటోగానీ.. ఆల్రెడీ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసింది. పోలీసులు కేసు విచారించాలి, ఆ విచారణలో నిజాలు నిగ్గు తేల్చాలి. ఈలోగా పైనున్న చక్రి ఆత్మ ఘోషించడం మాత్రం తప్పదు.