ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? – 23

దేశవిభజన తర్వాత పశ్చిమ పంజాబ్‌ నుండి శరణార్థులు లక్షలాదిగా ఢిల్లీకి వచ్చిపడ్డారు. ఎక్కువగా ఢిల్లీకే ఎందుకు వచ్చారు అంటే  దానికి కారణం కనబడదు.  కేంద్రప్రభుత్వం అక్కడే వుంది కాబట్టి రక్షణ, పునరావాసం అక్కడ బాగుంటాయనుకున్నారేమో!…

దేశవిభజన తర్వాత పశ్చిమ పంజాబ్‌ నుండి శరణార్థులు లక్షలాదిగా ఢిల్లీకి వచ్చిపడ్డారు. ఎక్కువగా ఢిల్లీకే ఎందుకు వచ్చారు అంటే  దానికి కారణం కనబడదు.  కేంద్రప్రభుత్వం అక్కడే వుంది కాబట్టి రక్షణ, పునరావాసం అక్కడ బాగుంటాయనుకున్నారేమో! అప్పట్లో ఢిల్లీలో ముస్లిం జనాభా గణనీయంగా వుండేది, వారు పాకిస్తాన్‌ వెళ్లిపోతారు కాబట్టి ఖాళీ అయిన వాళ్ల యిళ్లు ఆక్రమించుకోవచ్చని వచ్చారేమో తెలియదు. కానీ ఖాళీ అయ్యే యిళ్లు తక్కువ, వచ్చిపడుతున్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో గందరగోళం ఏర్పడింది. పైగా ఎవరి యిల్లు ఎవరికి ఎలాట్‌ చేయాలి? పంజాబ్‌లో ఖరీదైన యిళ్లు ఖాళీ చేసి వచ్చాం కాబట్టి యిక్కడా భవంతులు కావాలని కొందరనుకుంటే, యింకా యిక్కడ ఆ తేడాలేమిటి, ఎవరికి ఏది దొరికితే అదే అన్నారు మరికొందరు శరణార్థులు. ఉన్నత వంశాలవారు న్యాయప్రకారం పోదాం ప్రభుత్వం ఎలాట్‌ చేసేవరకూ ఆగుదాం అని వీధుల్లో, సత్రాల్లో, శిబిరాల్లో వుండిపోతే, రాత్రికి రాత్రి బంగళాలు చేజిక్కించుకునేందుకు యిదే అవకాశం అనుకున్న కొందరు పేదలు ముస్లిముల యిళ్లపై ఎగబడ్డారు. పరిస్థితి గమనించిన కొందరు స్థానిక గూండాలు, ఏదైనా యిల్లు ఖాళీ కాగానే వచ్చి ఆక్రమించుకుని కూర్చుని తమకు ఎవరైతే బంగారం ముట్టచెపుతారో వాళ్లకు యిచ్చేయసాగారు. రైలు ప్లాట్‌ఫాంమీదకు వస్తూండగానే పోర్టర్లు జనరల్‌ కంపార్టుమెంటుల్లో బెర్తులపై తువ్వాళ్లు పరిచేసి అమ్మేస్తూంటారు చూడండి, అలాగన్నమాట. 

దేశం విడిచి వెళ్లిన ముస్లిముల యిళ్ల సంగతి యిలా వుంటే, యిక్కడే వుందామని నిశ్చయించుకున్న ముస్లిముల సంగతి భయంకరంగా తయారైంది. శరణార్థులు యిలా అటూయిటూ వలస పోతారనీ, యిలాటి పరిస్థితి ఏర్పడుతుందని విభజన కోరిన నాయకులెవ్వరూ వూహించలేదు. అందువలన దీనికి సరైన మెకానిజం ఏదీ ఏర్పాటు చేయలేదు. ప్రధానిగా వున్న నెహ్రూ 'ఈ దేశం సెక్యులర్‌ దేశంగా వుంటుంది. అన్ని మతాలనూ సమానంగా చూస్తాం. ఇక్కడ వుందామనుకున్న ముస్లిములకు రక్షణ కల్పించబడుతుంది, వారి పౌరహక్కులు కాపాడబడతాయి' అని ప్రకటించాడు. దాంతో చాలామంది ముస్లిములు ఇండియాలోనే వుండిపోయారు. వాళ్ల యిళ్లమీద కన్నేసిన శరణార్థులు, గూండాలు 'మీరు ఎప్పుడు వెళుతున్నారు? మీ దేశం ఏర్పడినా యింకా వెళ్లకుండా కూర్చున్నారేం? మర్యాదగా వెళతారా? తన్ని తగిలేయమంటారా?' అని బెదిరించసాగారు. కొంతకాలం శిబిరాల్లో తలదాచుకుని యీ అల్లర్లు చల్లారాక మళ్లీ యింటికి వచ్చేద్దామని అనుకున్న ముస్లిం కుటుంబాలు శరణార్థి శిబిరాలకు వెళ్లి తలదాచుకున్నారు. ఇల్లు పరాధీనం కాకుండా కుటుంబంలోని ముసలాళ్లను ఎవర్నో యింటికి కాపలాగా పెట్టేవారు. 

ఈ పరిస్థితిలో శరణార్థులకు యిళ్లు కేటాయించడానికి భారతప్రభుత్వం ఒక ఐసియస్‌ ఆఫీసరును 'కస్టోడియన్‌ ఆఫ్‌ ఇవాక్యూ ప్రాపర్టీ'గా నియమించింది. ముస్లిముల ఆస్తులను కాపాడుతూ, వాటిని చట్టప్రకారం నిర్వహించడం (వాళ్లు దేశం విడిచి వెళితే మరొకరికి ఎలాట్‌ చేయడం, వుండిపోయేవాళ్లయితే వాళ్లు తిరిగి వచ్చేదాకా కాపాడడం) ఆ వ్యవస్థ పని. సమర్థులైన, చిత్తశుద్ధి గల పనివారు ఎందరో చేపట్టవలసిన క్లిష్టమైన బృహత్కార్యం అది. అన్నిటికంటె ముఖ్యంగా పంజాబీల మనస్తత్వం ఎరిగిన కస్టోడియన్‌గా వుంటే సముచితంగా వుండేది. ఎందుకంటే శరణార్థుల్లో చాలామంది పంజాబీలే. అయితే ప్రభుత్వం నియమించినాయన సౌత్‌ ఇండియన్‌. అతి త్వరలోనే అసమర్థత, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం వంటి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్లమెంటులో దాని గురించి చర్చ జరిగింది. వెంటనే ఆ ఆరోపణలపై విచారించడానికి ఒక హైకోర్టు జడ్జిని వేస్తామని ప్రభుత్వం హామీ  యిచ్చింది. పంజాబీలు తమ గోడు వినిపించుకునేందుకు అనువుగా అతను పంజాబీ అయ్యేట్లు చూస్తామని కూడా అంది. చివరకు  జస్టిస్‌ ఖోస్లాకు ఆ బాధ్యత అప్పగించారు.

ఆయన ఢిల్లీ వచ్చి మినిస్ట్రీ ఫర్‌ రిలీఫ్‌ అండ్‌ రీహేబిలిటేషన్‌లో సెక్రటరీని కలిశాడు. 'మీరు ఆ కస్టోడియన్‌ వల్ల కలిగిన మెస్‌ క్లియర్‌ చేయండి. ఆయన పనితీరుపై మీ నివేదిక యివ్వండి' అని చెప్పాడాయన. వెళ్లి మంత్రిగారిని కలవమన్నాడు. ఆయన 'మీ అధికారాలకు పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రభుత్వానికి మీపై విశ్వాసం వుంది' అని చెప్తూ చివర్లో 'ఆ కస్టోడియన్‌ లీవులో వెళ్లిపోతున్నాడు. ఆయన స్థానంలో మరొకరిని నియమించడానికి టైము పడుతుంది. అప్పటిదాకా ఆ వ్యవస్థకు మీరే యిన్‌చార్జ్‌' అని బాంబు పేల్చాడు. ఖోస్లాకు వణుకు పుట్టింది. పర్యవేక్షణకు వచ్చినవాడు పీకలదాకా మునిగిపోయాడు. ఇక అక్కణ్నుంచి కొన్ని నెలలపాటు ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. శరణార్థి క్యాంపుల్లో వున్న ముస్లిముల వద్దకు వెళ్లి ఎవరు యిండియాలో వుండిపోదలచుకుంటున్నారో వారి యిళ్ల వివరాలు సేకరించాడు. ఎలాట్‌ చేయదగిన యిళ్ల జాబితా, కాపాడవలసిన యిళ్ల జాబితా విడివిడిగా తయారుచేయించాడు. స్వయంగా వెళ్లి ఆ యిళ్లను చూశాడు. 

అలాటి సమయాల్లో పంజాబీ శరణార్థులు ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నలు గుప్పించేవారు – ''మేం ఏం పాపం చేశామని మమ్మల్ని పాకిస్తాన్‌ నుంచి తరిమివేశారు? అక్కడ సొంత గూడు పోగొట్టుకుని ఢిల్లీలో యీ చలిలో మేం వీధుల్లో గజగజ వణుకుతూంటే యీ ముస్లింల యిళ్లు ఖాళీగా వున్నా మాకు కేటాయించరా? అసలు వీళ్లు యిక్కడేం చేస్తున్నట్లు? పాకిస్తాన్‌ కావాలని కదా వీళ్లు అల్లర్లు చేసింది? హత్యాకాండ చేసినది? అదొక స్వర్గం అనుకున్నారు కదా, ఆ స్వర్గం భూమిపై వెలసిన తర్వాత అక్కడకు పోకుండా యిక్కడే వుంటున్నారెందుకు? వాళ్లు వెళ్లకపోతే ప్రభుత్వం మెడబట్టి గెంటేయలేదా? మేం ఎంతకాలం యిలా అల్లాడాలి? ఇంతకుముందు వున్నవాడు మద్రాసీ, మన బాధలు అర్థం కావు, నువ్వు పంజాబీవి, మా భాష, ఘోష తెలిసినవాడివి. నువ్వూ వాడిలాగే చేస్తావా? ఇది న్యాయమా?'' అని అడగసాగారు. అలా అడుగుతున్న హిందువులు, శిఖ్కుల్లో ఖోస్లాగారి బంధువులు, స్నేహితులు, క్లాస్‌మేట్స్‌, పరిచయస్తులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు అందరూ వున్నారు. విద్య, సంస్కారంతో సంబంధం లేకుండా అందరిదీ ఒక్కటే డిమాండ్‌ – ముస్లిములను పాకిస్తాన్‌కు తోలేయండి, వాళ్ల యిళ్లల్లో మాకు ఆశ్రయం కల్పించండి. జడ్జిగా ఎన్నో కేసులు చూసిన అనుభవం ఆయనకు యిప్పుడు పనికిరాకుండా పోయింది. ఏం చేయాలో తెలియక గందరగోళ పడిపోయాడు. ఆ పరిస్థితుల్లో సలహా కోసం మహాత్మా గాంధీని కలవాలని అనుకున్నాడు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles