మనిషి మరణించాక.. ఆ మనిషికి కడసారి వీడ్కోలు పలికేందుకు ‘ఆ నలుగురూ’ ఖచ్ఛితంగా వుండాల్సిందే. కానీ, మానవత్వం మంటగలుస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నలుగురూ మాటెలా వున్నా, రక్త సంబంధీకులే చివరి రోజుల్లో తమను చేరదీయక ఎంతోమంది అనాధల్లా తుదిశ్వాస విడుస్తున్నారు. అభివృద్ధికి మారుపేరైన జపాన్‌లో ఈ తరహా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. 65 ఏళ్ళు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు, ఎవరూ లేని అనాధల్లా ఒంటరి జీవితానికి పరిమితమైపోయి.. చివరి రోజుల్ని అత్యంత దుర్భరంగా గడుపుతున్నారు. ఇలా అనాధలుగా చనిపోతున్నవారికి దహన సంస్కారాలు చేసేందుకు ప్రత్యేకంగా కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొస్తుండడం అభినందనీయం.
గత నెలలో టోక్యోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వృద్ధుడు మరణించాడు. నెలరోజులదాకా అతను చనిపోయాడన్న విషయం ఎవరికీ తెలియలేదు. నెల రోజుల తర్వాత ఇంట్లోంచి వాసన రావడంతో, పక్కనే మరో ఫ్లాట్‌లో అద్దెకు వుంటోన్న వ్యక్తికి అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారమివ్వడంతో బాగా కుళ్ళిపోయిన దశలో వృద్ధుడి పార్తీవదేహం కన్పించింది. నెలనెలా ఇంటి అద్దె బ్యాంక్ అకౌంట్‌లోంచి జమ అయిపోతుండడం, కుటుంబ సభ్యులెవరూ మృతుడి గురించి అతను జీవించి వున్న సమయంలోనూ తెలుసుకునేందుకుగానీ, అతని బాగోగులు చూసుకునేందుకుగానీ ప్రయత్నించకపోవడం జపాన్ వాసుల్నే కాక ప్రపంచ వ్యాప్తంగా అందరికీ విస్మయం కలిగించింది.
జపాన్‌లో సగటు ఆయుర్ధాయం సంగతెలా వున్నా, ప్రపంచంలో అత్యధికంగా వృద్ధులు వున్న దేశం జపాన్.. అని అందరికీ తెల్సిన విషయమే. అలాగని, వృద్ధులందరూ చివరి రోజుల్లో అనాధలుగా చచ్చిపోవాలన్న రూల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. కేవలం ఇది జపాన్‌కే పరిమితమైన వ్యవహారంగా కన్పిస్తోంది. ఎందుకిలా.? అన్నదానిపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రతి నలుగురిలోనూ ఒకరు చివరి రోజుల్లో ‘ఏకాంత చావు’కి గురవుతుండడం అత్యంత బాధాకరమైన విషయం. జపాన్ ప్రభుత్వానికీ ఇది మింగుడుపడ్డంలేదు.
మరోపక్క, ఇలాంటి అనాధ మరణాల నేపథ్యంలో ఓ సంస్థ పుట్టుకొచ్చింది.. అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, ఆయా అపార్ట్‌మెంట్లలో క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహించడం కోసం. హిరోట్సుగు మసుదా టీమ్ ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఒక్కో అనాధ శవానికి సంబంధించి అంత్యక్రియల కోసం 1 వేల యెన్ (676 డాలర్లు) నుంచి 3 లక్షల 41 వేల యెన్‌లు (2 వేల 45 డాలర్లు) ఛార్జ్ చేస్తుందీ ఈ సంస్థ.
జపాన్ మొత్తమ్మీద 5 మిలియన్ల వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. వీరిలో కొందరు అపార్ట్‌మెంట్లలో, మరికొందరు సొంత గృహాల్లోనూ నివసిస్తున్నారు. ఎక్కువమంది బాధితులు పురుషులే కావడం గమనార్హమిక్కడ. గడచిన పదేళ్ళలో సుమారు 40 వేల మంది అనాధలుగా అత్యంత దుర్భర పరిస్థితుల్లో తుదిశ్వాస విడిచినట్లు ఓ ఎన్‌జీవో సంస్థను నిర్వహిస్తోన్న హిడెటో కోనె చెబుతున్నారు.