ఎమ్బీయస్‌ : మదన్‌ మిత్రను ఏం చేయాలి?

శారదా స్కాములో అరెస్టయిన బెంగాల్‌ ట్రాన్సుపోర్టు మంత్రి మదన్‌ మిత్రను ఎలా హ్యేండిల్‌ చేయాలో మమతా బెనర్జీకి అర్థం కావటం లేదు. సిబిఐ తన పార్టీ రాజ్యసభ ఎంపీ కునాల్‌ ఘోష్‌ను ప్రశ్నించినప్పటి నుంచీ…

శారదా స్కాములో అరెస్టయిన బెంగాల్‌ ట్రాన్సుపోర్టు మంత్రి మదన్‌ మిత్రను ఎలా హ్యేండిల్‌ చేయాలో మమతా బెనర్జీకి అర్థం కావటం లేదు. సిబిఐ తన పార్టీ రాజ్యసభ ఎంపీ కునాల్‌ ఘోష్‌ను ప్రశ్నించినప్పటి నుంచీ ఆమెకు యిలాటిది ఏదో జరుగుతుందని తెలుసు. ''మదన్‌ మిత్ర, మమతకు అత్యంత సన్నిహితుడైన ముకుల్‌ రాయ్‌ యిద్దరూ శారదా బాస్‌ సుదీప్త సేన్‌నుండి నిధులు సేకరించి పార్టీకై 2011 ఎన్నికలలో ఖర్చు పెట్టారు. మమత పెయింటింగ్స్‌ను కళ్లు చెదిరే ధర పెట్టి కొనమని సేన్‌కు చెప్పినది వీరే.'' అని కునాల్‌ సిబిఐకు చెప్పాడు. రెండేళ్ల క్రితం శారదా నిధులతో ఒక లిక్కర్‌ కంపెనీ పెట్టారు. అది తయారుచేసే మద్యం నాణ్యత బాగా లేదు కాబట్టి లైసెన్సు యివ్వవద్దని ఎక్సయిజ్‌ అధికారులు అడ్డం పెట్టినా మిత్ర సహాయకుడు బాపి కరీమ్‌ పట్టుబట్టి లైసెన్సు యిప్పించారు. ఇప్పుడది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ దృష్టిలో పడింది. ఈ కరీమే కలకత్తాలోని సాల్ట్‌ లేక్‌లో వున్న శారదా ఆఫీసు నుండి డబ్బు పట్టుకుని వచ్చి మిత్రకు యిచ్చేవాడని యిప్పుడు సిబిఐ న్యాయవాది కోర్టుకి చెప్పాడు. సిబిఐకు ఎడిషనల్‌ డైరక్టరుగా వుంటూ శారదా స్కాముపై విచారణ జరుపుతున్న అనిల్‌ కుమార్‌ సిన్హా సిబిఐ డైరక్టరుగా చార్జి తీసుకోగానే యిక మదన్‌ మిత్ర పని పట్టడం ఖాయం అనుకుంది మమత. అందుకే అతన్ని కాబినెట్‌ సమావేశాల్లో పాల్గొనవద్దని అంది. తనతో పాటు సభలకు, పర్యటనలకు రావద్దని అంది. నిజానికి మిత్ర మమతకు ఎప్పణ్నుంచో అనుచరుడిగా వున్నాడు. ఇద్దరూ బెంగాల్‌ కాంగ్రెసు నేత ప్రియరంజన్‌ దాస్‌మున్షీ శిష్యులే. అప్పట్లో బెంగాల్‌ కాంగ్రెసుకు సారథ్యం వహిస్తున్న ప్రణబ్‌ ముఖర్జీపై కోపంతో దాస్‌మున్షీ వీళ్లిద్దరినీ కొత్త పార్టీ పెట్టుకోమని ప్రోత్సహించాడు. అలాటి మిత్రను యిప్పుడు దూరంగా పెట్టమని ఆమె హితైషులైన అధికారులు హెచ్చరించారు. చివరకు అనుకున్నట్టే డిసెంబరు 13 న సిబిఐ అతన్ని అరెస్టు చేసింది. 

మమత వూరుకుంటే మంచిదని హితైషులు చెప్పారు. కానీ అతన్ని అలా వదిలేస్తే పార్టీలో తక్కిన నాయకులు 'ఈమె వాడుకుని వదిలేసే రకం' అనే సంకేతం వెళుతుందనే భయంతో మమత అతన్ని మంత్రిగా తొలగించలేదు. అతన్ని అరెస్టు చేసి తీసుకెళుతున్న సిబిఐ వ్యాన్‌ ముందు ప్రదర్శనలు చేసి అడ్డుకోమని తన పార్టీ కార్యకర్తలకు ఉపదేశించింది. కోర్టులో తన పార్టీ అభిమానులైన లాయర్ల చేత ఆందోళన చేయించి, సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు వినకుండా నినాదాలతో హోరెత్తించింది. ఏదో కారణం చెప్పి ప్రభుత్వాసుపత్రిలో చేరమని మిత్రకు సూచనలు వెళ్లాయట. డిసెంబరు 19 న ఆలీపూర్‌ సెషన్స్‌ కోర్టు మిత్రాకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. అతను ''నాకు అనారోగ్యంగా వుంది, సెల్‌కు వెళ్లను, ఎవరైనా డాక్టరును పిలిచి పరీక్ష చేయించేదాకా యిక్కణ్నుంచి కదలను'' అంటూ జైలు సూపరింటెండెంట్‌ ఆఫీసులోనే బైఠాయించాడు. చివరకు డాక్టరు వచ్చాడు. మిత్ర కోరినట్లే ఎస్‌ఎస్‌కెఎమ్‌ అనే ప్రభుత్వాసుపత్రిలో చేరాలని సిఫార్సు చేశాడు. ఆరోగ్యశాఖ చూస్తున్న మమతా బెనర్జీ తరఫున మదన్‌ మిత్రా ఆ ఆసుపత్రి వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తూంటాడు. ఇక అక్కడ అతనికి ఎటువంటి భోగాలు అందుతాయో వూహించవచ్చు. 

ఇలాటి ఏర్పాట్లు చేయకపోతే కునాల్‌ మిత్రాను యిరికించినట్లుగా మిత్రా యింకెవరిని యిరికిస్తాడోనన్న భయం మమతది. కునాల్‌ చెప్పిన పేర్లలో ముకుల్‌ రాయ్‌ వున్నాడు కదా. మమతకు కుడిభుజం వంటి అతను శారదా గ్రూపుకి చెందిన రియల్‌ ఎస్టేటు, మీడియా వ్యవహారాలన్నీ పర్యవేక్షించేవాడు. ఇప్పుడు మదన్‌ మిత్ర కూడా అతని పేరు చెపితే కొంప మునుగుతుందని  మమత అతన్ని పార్టీ బాధ్యతల నుండి పూర్తిగా తప్పించేసింది. అతని బాధ్యతలను పార్థ చటర్జీ, సుబ్రతా బక్షిలకు పంచింది. నవంబరు నుంచి తృణమూల్‌ పోస్టర్లపై, బ్యానర్లపై అతని ఫోటో కనబడటం లేదు. అతనితో బాటు మంత్రి ఐన శ్యామాపాద ముఖర్జీ, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ హసన్‌ ఇమ్రాన్‌లను కూడా పార్టీ సభల్లో పాల్గొనవద్దని చెప్పారు. 

ఇలా తన యిమేజి కాపాడుకుంటూ సిబిఐ విచారణ ఒక కొలిక్కి రాకుండా మమత ప్రభుత్వం చేస్తుందన్న సందేహంతో కేసు విచారణను బెంగాల్‌కు బయట నిర్వహించడానికి అనుమతి యివ్వాలని సిబిఐ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. మమత ఎలాగూ నిరాకరిస్తుంది. అప్పుడు సిబిఐ కోర్టుకి వెళుతుంది. ఇది మమత మెడకు ఎప్పుడు చుట్టుకుంటుందో వేచి చూడాలి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]