సముద్ర మార్గంలో భారతదేశంలోకి టెర్రరిస్టుల్ని పంపి, భారతదేశంలో మారణహోమం సృష్టించాలన్న తొలి ప్రయత్నంలో పాకిస్తాన్ సక్సెస్ అయ్యింది. ఐదారేళ్ళ క్రిందటి వ్యవహారమది. రెండోసారి.. ఇటీవలే ఆ ప్రయత్నం మళ్ళీ చేసింది పాకిస్తాన్. ఈసారి గతంలోలా భారత్ అవకాశమివ్వలేదు. సముద్రంలోనే తీవ్రవాదుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తీవ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు తాము వచ్చిన పడవతో సహా.
‘అది పాకిస్తాన్ పడవ కాదు..’ అని పాకిస్తాన్ బుకాయించినా, పేలిపోయిన పడవలోనివారు మాట్లాడిన టేపుల్ని భారత్ సేకరించడంతో పాకిస్తాన్ ఇక బుకాయించడానికేం లేకుండా పోయింది. అంతర్జాతీయ సమాజం ముందర మరోమారు దోషిగా నిలబడ్డ పాకిస్తాన్, ఏం చేయాలో పాలుపోక భారతదేశానికి చెందిన రెండు పడవల్ని పట్టుకుంది. మత్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళగా, అంతర్జాతీయ జల సరిహద్దుల్లో వారిని అటకాయించి, పాకిస్తాన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమన్నా వుంటుందా.? మామూలుగా అయితే ఇలాంటివి నిత్యం ఇరు దేశాల మధ్యా జరుగుతుంటాయి. తమ ఐడెంటిటీని మత్స్యకారులు చూపిస్తే, వదిలేయడం జరుగుతుంటుంది. ఆపదలో వుంటే వారి ఆదుకోవడమూ మామూలే. పట్టుకున్నవారికి సంబంధించిన వివరాల్ని ఏ దేశమైనా వెల్లడిస్తుంటుంది. అలా చేస్తే అది పాకిస్తాన్ ఎందుకవుతుంది.? పట్టుకున్న మత్స్యకారుల్ని ఎక్కడికి తీసుకెళ్ళారన్న విషయాన్ని పాక్ వెల్లడిరచలేదు.
ఈ ఘటనతో పాకిస్తాన్ తోక వంకర.. అనే విషయం మరోమారు స్పష్టమయ్యింది. తమ దేశంలో తీవ్రవాదం కారణంగా ఇటీవలే దారుణ మారణహోమం జరిగినా, అదే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, తీవ్రవాదులకు మద్దతుగా సరిహద్దుల్లో భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్తోన్న పాకిస్తాన్ నుంచి ‘శాంతి’ని ఆశిస్తే.. అంతకన్నా ఘోర తప్పిదం ఇంకొకటి వుండదు.