Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

మేకర్ మదిలో కింగ్ ఎవరు?

మేకర్ మదిలో కింగ్ ఎవరు?

పీకే.. దేశవ్యాప్తంగా రాజకీయాసక్తి గల వారికి ఈ పేరు గురించిన పరిచయం అవసరం లేదని అంటే గనుక... ఆ పేరు ప్రశాంత్ కిషోర్! నటుడు కాదు, క్రీడాకారుడు కాదు, కొంతవరకు రాజకీయ నాయకుడు కూడా కాదు. కానీ ఆయనకు ఈ వర్గాల వారితో సమానమైన కీర్తి ఉంది. ఐ-ప్యాక్ సంస్థకు అధినేత. ఈ దేశపు హృదయస్పందనను ఇట్టే పట్టేసుకోగల నిపుణుడు. ప్రజలు- రాజకీయ పార్టీలనుంచి ఏం కోరుకుంటున్నారో.. ఎలాంటి తాయిలాలకు వారు ‘పడిపోతారో’.. ఎలాంటి మాయలకు సమ్మోహితులు అవుతారో... ఏంటోమరి.. ఆయన కళ్లకు ఇట్టే కనపడిపోతుంటుంది. ఎలాంటి విధానాలకు నాయకులను నెత్తిన పెట్టుకుంటారో... ఎలాంటి హామీలు, ప్రవర్తన ప్రజాదరణను అమాంతం పెంచేస్తుందో.. అలాంటి అయిడియాలు ఆయన మేథోక్షేత్రం నుంచి ఒక దానివెంట మరొకటి ఉద్భవిస్తుంటాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ దేశం మొత్తం అబ్బురంగా పరికిస్తున్న ఏకైక ‘కింగ్ మేకర్’!

నాడు గుజరాత్‌లో మోడీ ని గెలిపించడం దగ్గరినుంచి.. నిన్న జగన్మోహన రెడ్డి ఏపీ సీఎం, నితీశ్ బీహార్ సీఎం కావడం వెనుక నిలిచి, తాజాగా కేజ్రీవాల్ తో హ్యాట్రిక్ కొట్టించి.. రేపు స్టాలిన్ ను తమిళనాడు సీఎం చేయడానికి రంగంలో ఉంటూ.. ప్రశాంత్ కిశోర్ అనే పీకే.. తన ప్రభను, ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. అలాగని యూపీలో  కాంగ్రెస్ పరాభవం వంటి వైఫల్యాలు కూడా ఆయన ఖాతాలో లేకపోలేదు. కానీ విజయాల వెలుగుల మాటున ఆ చీకట్లు నిలిచేవి కాదు!

అలాంటి కింగ్ మేకర్ మదిలో ఉన్న అంతిమలక్ష్యం ఏమిటి? ఈ మేకర్ మదిలో మెదలుతున్న కింగ్ ఎవరు? భవిష్య భారత రాజకీయాలను ఈ పీకే ఎలా నిర్దేశించబోతున్నారు? ఎలా శాసించబోతున్నారు? అనే కోణంలోంచి.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు సాధికారికమైన విశ్లేషణ ఈ గ్రేటాంధ్ర కవర్ స్టోరీ..!

ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే.. అక్కడి ప్రధాన పార్టీల నాయకులతో పాటు మరో పేరు కూడా వినిపిస్తుంటుంది. ఐ-ప్యాక్ ప్రశాంత్ కిషోర్ అక్కడ ఏ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు? అనే మాట వినిపిస్తుంటుంది. అంతగా ఖ్యాతి గడించిన రాజకీయ వ్యూహకర్త. ఎన్నికల్లో గెలిచి తీరాలంటే పీకేతో ఒప్పందం చేసుకుంటే బెటర్ అని ప్రాంతీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చే పరిస్థితి. నాయకుల్ని ముఖ్యమంత్రులు చేయడం ఆయనకు అలవాటైపోయింది. ముఖ్యమంత్రులతో హ్యాట్రిక్ కొట్టించడంలో.. పీకే తాజాగా హ్యాట్రిక్ కొట్టారు. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నప్పుడు.. ఆయనకు వ్యూహకర్త పీకేనే. ఆ సాయంతో మోడీ హ్యాట్రిక్ కొట్టారు. తర్వాత.. బీహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్, పీకే వ్యూహాలను ఉపయోగించుకుని.. సీఎంగా హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా ఢిల్లీలో ఆప్ సారథి కేజ్రీవాల్.. పీకే దన్నుతోనే హ్యాట్రిక్ కొట్టారు.

ప్రశాంత్ కిశోర్ కు భారతీయ జనతా పార్టీతో విభేదం వచ్చింది. భాజపా మినహా.. వ్యూహాల కోసం కాస్తంత ఖర్చు పెట్టుకోగలిగిన పార్టీలన్నీ కూడా.. ఇవాళ ప్రశాంత్ కిశోర్ కోసం చూస్తున్నాయంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఆయన ఖాతాలో ఉన్న వైఫల్యం యూపీ ఎన్నికలు మాత్రమే. అక్కడ కాంగ్రెస్- ఎస్పీ చెలిమి చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అయితే అక్కడి ఎన్నికల గోదాలోకి ప్రశాంత్ అడుగుపెట్టే వేళకే బాగా ఆలస్యం అయిపోయిందని కొందరు విశ్లేషిస్తుంటారు. ఏదేమైనప్పటికీ.. దేశమంతా కాంగ్రెస్ పతనావస్థలో ఉండగా.. పంజాబ్ లో మాత్రం అధికారంలోకి రావడం వెనుక కూడా పీకే  హస్తం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన రెడ్డి తో ఎన్నికలకు చాలా కాలం ముందునుంచే ఒప్పందం కుదుర్చుకుని.. పీకే వ్యూహరచన చేస్తూ వచ్చారు.  ఈ ఉత్తరాది కుర్రవాడికి తెలుగురాష్ట్రంలో ఉండే కులసమీకరణలు, స్థానిక ప్రభావిత అంశాలు తెలియవని, ఓట్లకోసం ఏజన్సీలను నమ్ముకుంటే జగన్ పుట్టి మునుగుతుందని అప్పట్లో అనేక వర్గాలనుంచి విమర్శలు దెప్పిపొడుపులు వచ్చినప్పటికీ కూడా.. పీకే ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఫలితం అందరికీ తెలిసిందే.

ఢిల్లీలో కేజ్రీతో హ్యాట్రిక్ కొట్టించిన తర్వాత.. ఆయన తమిళనాడు ఎన్నికలపై ఫోకస్ పెట్టి ఉన్నారు. అక్కడ స్టాలిన్ దళానికి ఆయన సలహాలు అందుతున్నాయి. పై చెప్పుకున్న అన్ని పరిణామాలను కలబోసి చూసినప్పుడు.. ఇప్పటికే దేశంలో కీలకమైన రాష్ట్రాల్లోని కొన్ని రాజకీయ పార్టీలు.. ప్రశాంత్ కిశోర్ మీద ఆధారపడి, లేదా ఆయన మాటకు విలువ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయని ఇట్టే అర్థమైపోతుంది. అంతటి శక్తిమంతమైన వ్యక్తిగా ఆయన దేశ రాజకీయాల్లో ఎదిగారు. మరి ఇలాంటి వ్యూహకర్త మనోగతం ఏమిటి? తన వ్యూహఫలితాల భవిష్యత్తును, ఆయన తన అంతరంగంలో ఎలా దర్శిస్తున్నారు. లక్ష్యం ఏమిటి? అనేది ఆసక్తి కరమైన అంశం.

పుకార్లు అనేకం..

సహజంగానే ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టల జోన్ లోకి వస్తే బోలెడు పుకార్లు పుడతాయి. అలాంటిది.. ఇన్నేసి విజయాలు నమోదు చేస్తున్న  పీకే చుట్టూ పుట్టకుండా ఉంటేనే ఆశ్చర్యపోవాలి. ఆయన చుట్టూ కూడా అనేక పుకార్లు ఉన్నాయి. ఆయన మొన్నటి దాకా బీహార్ లోని జనతాదళ్ (యూ)లో నితీశ్ కుమార్ కు కీలక అనుచరుడిగా ఉన్నారు. అయితే.. పౌరసత్వ సవరణ బిల్లుకు నితీశ్ మద్దతుగా మాట్లాడడాన్ని వ్యతిరేకించడంతో పీకేను పార్టీనుంచి వెలివేశారు. ఇప్పుడు పీకే కొత్త పార్టీ స్థాపిస్తాడనేది ఒక పుకారు. కానీ.. ఇది కేవలం పుకారు మాత్రమే అని విశ్లేషకులు చెబుతున్నారు. పీకే ఇప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యూహరచన చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. అలాంటిది.. ఒక పార్టీకి పెట్టుకుని, ఒక ప్రాంతానికి పరిమితమ.. ఒక ఒత్తిడిని కొని తెచ్చుకుంటారని అనుకోవడం కూడా భ్రమ. కింగ్ మేకర్ గా ఎక్కువ కీర్తి ఉన్న పీకే.. సొంత పార్టీ పెట్టకపోయినప్పటికీ.. అంతకంటె కీలకంగానే.. దేశ రాజకీయాల్లో భూమిక పోషిస్తారనేది మాత్రం పలువర్గాల్లో చర్చల్లో నలుగుతున్న అంశం. ఏ రకంగా.. ఏ లక్ష్యాల వైపు ఆయన పాత్ర ఉంటుందనేదే అందరి సందేహం.

భాజపాతో అందుకే చెడింది...

నరేంద్రమోడీ.. ముఖ్యమంత్రిగా దారుణమైన అపకీర్తిని కూడగట్టుకున్న తరుణంలో.. ఆయన పీకే వ్యూహాలను ఆశ్రయించారు. 2011లో మోడీ హ్యాట్రిక్ కొట్టారు. 2014 పార్లమెంటు ఎన్నికల వేళ కూడా మోడీ దళంలోనే ఉన్నాడు. కూటమిగానే అధికారంలోకి రాగలం అని అనుకున్న భారతీయ జనతా పార్టీ.. పార్టీగానే సంపూర్ణ మెజారిటీ సాధించడం వెనుక ఆయన కష్టం ఉందని అందరూ అంటుంటారు. పీకే ఆ రకంగా.. భాజపాలో ఎంతో కీలకమైన పవర్ సెంటర్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ.. మోడీ దళంతో ఆయనకు సంబంధాలు బెడిసి కొట్టాయి. తనకు దక్కవలసినంత ప్రాధాన్యం దక్కలేదని, వాడుకుని పక్కన పెట్టేశారని.. అందుకే కినుక వహించి.. ప్రశాంత్ కిశోర్ మోడీ-షా  కోటరీకి దూరం అయ్యారనే ప్రచారం ఉంది.

అక్కడినుంచి అచ్చంగా మోడీ నీడలో లేని, మోడీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 2015 బీహార్ లో నితీశ్ పార్టీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గారు. 2017 లో యూపీ, పంజాబ్ రెండు చోట్ల కాంగ్రెస్ కు పనిచేసి.. పంజాబ్ లో మాత్రం అధికారంలోకి తీసుకురాగలిగారు. తర్వాత.. ఆయన పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ గానీ, ప్రస్తుతం పనిచేస్తున్న డీఎంకే గానీ.. ఎన్డీయేతర పార్టీలే కావడం విశేషం.

లక్ష్యం అదేనా...

అయితే ప్రశాంత్ కిశోర్ లక్ష్యం ఏమిటనే విషయంలో అనేక ఊహాగానాలున్నాయి. కాంగ్రెస్ తో జట్టుకట్టిన సమయంలో.. దేశంలోని వివిధ బలమైన పార్టీలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకువచ్చి.. రాహుల్ ను ప్రధాని పదవికి దీటుగా నిలబెట్టడమే పీకే లక్ష్యం అనే మాట వినవచ్చింది. తర్వాతి పరిణామాల్లో  ఆయనకు రాహుల్ పై విశ్వాసం సడలిపోయింది. రాహుల్ ను ప్రొజెక్టు చేసిన ప్రతిసారీ.. రాహుల్ తో పోల్చి చూసినప్పుడు.. ఈ దేశ ప్రజలకు మోడీ మరింత బలమైన సమర్థవంతమైన నాయకుడిగా  కనిపించడం మామూలైపోయింది. దీంతో పీకే వ్యూహం మార్చుకున్నారు. రాహుల్ ను ప్రొజెక్టు చేస్తూ ఉంటే కాగల కార్యం కూడా చెడుతుందని ఆయనకు అర్థమైనట్లుంది.

తాజాగా ఆయన భవిష్యత్ దేశ్ కీ నేత గా కేజ్రీవాల్ ను ప్రజల ఎదుట నిలపాలనే వ్యూహంతో ఉన్నారనేది భోగట్టా! రాహుల్ తో పోలిస్తే.. మోడీకి సమఉజ్జీగా ఎంచడానికి కేజ్రీవాల్ కు చాలా ఎడ్వాంటేజీలు ఉన్నాయి. అవినీతిన మరకలు లేవు, సమర్థుడిగా పేరుంది. మోడీ మాదిరిగానే ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టాడు. ఆయనలో మచ్చలెన్నగలిగే వారు లేరు. దేశవ్యాప్తంగా కూడా.. చదువరులు, ఆలోచనాపరుల్లో ఆప్ పట్ల గానీ, కేజ్రీవాల్ పట్ల గానీ సానుకూలత ఉంది. ఇవన్నీ కలిపి.. దేశంలో ఒక కొత్త కూటమి ప్రాణం పోసుకోవడానికి అండగా ఉంటాయనే చర్చ నడుస్తోంది.

దేశంలో ప్రాంతీయ పార్టీలను మరింత బలోపేతం చేయడం.. వాటి ఐక్యత ద్వారా మోడీ ఆధిపత్యానికి గండికొట్టడం అనేది ప్రశాంత్ వ్యూహంగా చెబుతున్నారు. నరేంద్రమోడీ వ్యూహం అచ్చంగా ఇందుకు విరుద్ధం. ప్రాంతీయ పార్టీల జవసత్వాలను హరించి వేయడం, వాటి ఉసురు తీయడం, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే.. అంతో ఇంతో మనుగడ సాగించడానికి జాతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి సృష్టించడం.. అనేది వారి వ్యూహంగా ఉంది. రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవడం దగ్గరినుంచి.. కొత్తగా తెస్తున్న చట్టాల వరకు అన్నీ ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశార్థకం చేసే వ్యూహాలే. సరిగ్గా ఈ వ్యూహానికి ప్రశాంత్ కిషోర్ ఎదురు నిలుస్తున్నారు. ప్రాంతీయ పార్టీల బలోపేతం లక్ష్యంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈ దశ దాటిన తర్వాత.. అంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఐక్యత అనేది ఆయన ఎజెండా అంశం అవుతుంది. కాంగ్రెస్ ఎటూ సోదిలో లేని పార్టీగా అయిపోయింది.

ఎన్డీయే- దానిని దీటుగా ఎదుర్కొనగల మరొక కొత్త కూటమి అవతరిస్తే గనుక.. అప్పుడు అచ్చంగా దేశ రాజకీయాలు మరింత రసకందాయంలో పడుతాయి. అలా జరిగితే గనుక, ప్రశాంత్ కిషోర్  అప్పటివరకు, ఆ తర్వాత కూడా రాజకీయ చర్చల్లో మార్మోగుతూనే ఉంటుంది. వ్యాపారంలాగా సాగుతూ వచ్చిన ఆయన వ్యూహ చాతుర్యాలు.. దేశగతినే ప్రభావితం చేయగల ఒక కీలక రాజకీయ విప్లవానికి ఆ రకంగా కారణభూతం అవుతాయి.

.... కపిలముని

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?