Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: జన్మాంతర వైరం

 ఎమ్బీయస్‍ కథ: జన్మాంతర వైరం

‘‘మీరు నాడీగ్రంథాల గురించి విన్నారా, మేడమ్’’ అంటూ గొంతు విప్పాడు పరాక్రమరావు. ఆయన సిఎం సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా పని చేస్తూంటాడు. కొంతకాలం పోలీసు శాఖలోనే పని చేసి, వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ కమ్ సెక్యూరిటీ బిజినెస్‌లోకి దిగాడు. పోలీసు డిపార్టుమెంటులో ఉన్న తన పాత పరిచయాలను ఉపయోగించుకుంటూ, కొన్నిసార్లు వాళ్లకి ఉపయోగపడుతూ చాలా సక్సెస్‌ఫుల్ అయ్యాడు. ఐదారేళ్ల క్రితమే ముఖ్యమంత్రి సెక్యూరిటీ విషయంలో కన్సల్టెంటుగా నియామకం వచ్చింది. సెక్యూరిటీగా ఉన్నవాళ్ల బాక్‌గ్రౌండ్ చెక్ చేయడం, వారి ప్రవర్తనలో మార్పేదైనా వస్తోందా గమనించడం, రక్షణవ్యవస్థలో లోపాలేమైనా ఉంటే కనిపెట్టి, దిద్దుబాటు చర్యలు సూచించడం.. యివన్నీ ఆయన బాధ్యత.

‘‘విన్నానండీ, కానీ నాకు నమ్మబుద్ధి కాదు. ఈ జన్మలో మనం చేసే పాపపుణ్యాల బట్టి వచ్చే జన్మ ఉంటుందని చెప్తారు. పాపం చేస్తే కుక్కగా పుట్టవచ్చు, పుణ్యం చేస్తే హంస కావచ్చు, మరీ పుణ్యం చేస్తే ప్రధానమంత్రి కావచ్చు. కానీ నాడీ గ్రంథం చూపించుకుంటే నువ్వు పూర్వజన్మలో ఫలానా, వచ్చే జన్మలో ఫలానా అని చెప్పేస్తారట. అంటే గత జన్మ, వచ్చే జన్మ అన్నీ ఫిక్సయి పోయాయన్నమాట. మనం ఎలాటి కర్మ చేసినా తేడా ఏమీ రాదన్నమాట. అలా ఎలా?’’ అన్నారు ముఖ్యమంత్రిణి.

‘‘నేను విన్నదాని ప్రకారం, నాడీవాళ్లు సగం మన చేతనే చెప్పించేస్తారటండి. సరైన నాడీపత్రం కనిపెట్టాలంటూ మీ నాన్న పేరేమిటి, అమ్మ పేరేమిటి? పిల్లలెంతమంది? ఎప్పుడు పుట్టావు? నువ్వేం చేస్తూ ఉంటావు? యిలా మనల్నే అడిగి, చివరకు ఓ తాళపత్రం బయటకు లాగి యిదే నీది అంటూ మనం చెప్పినవే చెప్తారట. గతం మన చేత ఎలాగూ చెప్పించేస్తారు, యిక భవిష్యత్తు గురించి మామూలు జ్యోతిష్కుల లాగానే కొన్ని చెప్తారు, జరిగితే జరుగుతాయి, లేకపోతే లేదు. ఇక పూర్వజన్మ, పరజన్మ అంటారా, వాటిని ఎలాగూ వెరిఫై చేయలేం.’’ అంటూ తేల్చేశారు డాక్టరు గారు.

‘‘ముఖ్యంగా పేర్ల మీద ఎక్కువగా అడుగుతారటండి. మీ నాన్న పేరు శివుడి మీదుగా వస్తుంది, అమ్మ పేరు లక్ష్మి మీదుగా వస్తుంది.. అంటారట. ఒక్కో దేవుడికి అనేక పేర్లుంటాయి, ఏదో ఒకటి తగలవచ్చు. అయినా పెంటయ్య, పుల్లయ్య అనే పేరుందనుకోండి. ఏ దేవుడి పేరు మ్యాచ్ అవుతుంది? ఇవాళ ఎవడో క్రికెట్ పిచ్చాడు వాళ్లబ్బాయికి ధోనీ అని పేరు పెట్టాడనుకోండి, వాడిది ఏ పేరుతో కుదురుతుంది?’’,

‘‘వృత్తుల పరంగా కూడా ఎన్నో కొత్త విద్యలు వచ్చాయి. తాళపత్రాలు రాసేనాటికి పైలట్ ఉద్యోగం ఉండి ఉండదు కదా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊహించి కూడా ఉండరు, లయజన్ ఆఫీసరు, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్, హోటల్ రిసెప్షనిస్టు, లేబర్ యూనియన్ లీడరు, వికీపీడియా రైటరు, సెక్యూరిటీ కన్సల్టెంటు.. యిలాటి వాటిని ఏ ఉద్యోగంగా వాళ్లు వర్ణిస్తారండి? ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ వంటి రంగాలు వందేళ్ల క్రితం ఎవరికీ కలలో కూడా వచ్చి ఉండవు కదా. ఆ మాటకొస్తే ఎలక్ట్రిసిటీ కూడా! అన్నీ ముందే ఊహించడం ఏ ఋషి తరమూ కాదు.’’

‘‘నాడి చదివించుకున్న వాళ్లలో చాలామంది ‘మేం గత జన్మలో రాజుట, మంత్రిట, రాజోద్యోగినట’ అని చెప్పుకోగా చూశాను. రాజుల కాలం అంటే ఏ నాటిదండి? గత రెండు, మూడు వందల ఏళ్లగా ఏ జన్మా లేకుండా ఉన్నారా వీళ్లంతా? అయినా వీళ్లందరూ రాజులైతే మన ఇండియాలో వేల కొద్దీ, లక్షల కొద్దీ రాజ్యాలు ఉండివుండాలి. ఈ జన్మలో రాజు కాకపోయినా, కితం జన్మలో రాజనగానే ఉబ్బిపోతారు కదాని అలా చెప్పి ఉంటారు.’’

‘‘నేను విన్నదేమిటంటేనండీ, ఒరిజినల్‌గా అగస్త్యుడు అందరివీ రాసి తన శిష్యుడికి యిచ్చాడట. ఆయన తన శిష్యులకు ప్రాంతాల వారీగా కొన్నేసి చొప్పున పంచాడట. అలా తీసుకున్నవాళ్లు వాళ్ల వారసులకు యిచ్చేటప్పుడు పంపకాల్లో కొందరికి కొన్ని, మరికొందరికి కొన్ని వెళతాయి కదా. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉంటాయి కాబట్టి, అన్నగారు తన వాటాకు వచ్చినవాటిని తమ్ముడు కాపీ చేసుకుంటానంటే యివ్వడు. అలాగే తమ్ముడూనూ. ఇలా తరతరాలు గడిచేసరికి, ఒరిజినల్ వాటిలో ఏ లక్షో వంతో యిప్పటి నాడీగ్రంథం ఆయన దగ్గర ఉంటాయి. మన పత్రం ఆయన దగ్గర ఉండచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆయన ‘నా దగ్గర లేదు, యింకెవరి దగ్గరకైనా వెళ్లి అడగండి’ అనడు. కోట్లాది మందివి నా దగ్గరే ఉన్నాయంటూ కిట్టించేస్తాడు. అందుకే జోస్యాలు తప్పుతున్నాయిట.’

‘‘వెళ్లివచ్చిన వాళ్లు నాకు చెప్పినదేమిటంటే, గతం కరక్టుగా చెప్తారట, కానీ భవిష్యత్తు మాత్రం తప్పుతుందట. ముఖ్యంగా అరవంలోనో, యాసతెలుగులోనో చెప్తారు కాబట్టి, మనకు సరిగ్గా బోధపడక మనపాటికి మనం ఊహించుకుంటామట. ఏది జరిగినా దానికి అన్వయించుకుంటామట. ఏది ఏమైనా మరీ అంత పెర్‌ఫెక్ట్ కాదని అంటారు.’’...

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యానిస్తూ ఉంటే పరాక్రమరావు చెయ్యెత్తి అందర్నీ ఆపి ‘‘మీలో ఎవరైనా నాడి చూపించుకున్నారా?’’ అని అడిగాడు. ఎవరూ లేదని తల అడ్డంగా ఊపాక, ‘‘నేనూ చూపించుకోలేదు. కానీ దానికి సంబంధించిన కేసు ఒకటి నా దగ్గరకు వచ్చింది. అంటూ చెప్పసాగాడు. ‘‘కొన్నాళ్ల క్రితం నా దగ్గరకు ఒక పాతికేళ్ల కుర్రాడు వచ్చి ఓ కేసు యిన్వెస్టిగేట్ చేయమన్నాడు. అతను ఫారిన్‌లో బాగా చదువుకుని వచ్చాడు. ఏదైనా బిజినెస్‌లోకి వెళదామా, ఉద్యోగంలోకి వెళదామాని చూస్తున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఎవరైనా అమ్మాయి గురించి వివరాలు సేకరించ మంటాడనుకున్నాను. కానీ అది కాదుట. తన హత్య కేసేట. నువ్వు బతికే ఉన్నావుగా అని అడిగితే యీ జన్మలో కాదు, హత్య పూర్వజన్మలో జరిగింది అన్నాడు. పిచ్చాడేమో అనుకున్నా. తన కథంతా చెప్పాడు.

ఇతని పేరు చిరంజీవి. తనకు పిల్లనివ్వడానికి ఓ పారిశ్రామిక వేత్త మదనగోపాల్ వచ్చాడు. పిల్ల, పిల్లవాడు ఒకరికొకరికి నచ్చారు. అయితే పెద్దాయనకి జాతకాల పిచ్చి ఉంది. అందునా నాడీ పత్రాలపై విపరీతమైన నమ్మకం. దాని ద్వారా యితని భవిష్యత్తు తెలుసుకుని, అప్పుడు పెళ్లి ఫైనల్ చేస్తానన్నాడు. ఇతనికి కొద్దిపాటి నమ్మకాలున్నాయి కానీ మరీ యింత చాదస్తం లేదు. అవసరమా? అని అడిగాడు కాబోయే మావగార్ని. ‘నేను యిరవై ఏళ్లగా చూపించుకుంటున్నాను. భూతవర్తమాన భవిష్యత్తు విషయాలన్నీ కరక్టుగా చెప్పాడాయన. దాని ప్రకారం అనేక డెసిషన్సు తీసుకుని బాగుపడ్డాను. నీకు బిజినెస్ నప్పుతుందో లేదో వాళ్లు చెప్పగలుగుతారు. ఆ వైపే నువ్వు వెళ్లవచ్చు.’ అని ఆయన చెప్పడంతో యితను ఏం చెప్తారో విందాం అనే  కుతూహలంతో సరేనన్నాడు.

ఇద్దరూ కుంభకోణం వెళ్లారు. ఆ నాడీ పండితుడు చిరంజీవి పత్రాన్ని వెతికి పట్టాడు. ఆ తర్వాత అతని బాల్యంలో జరిగినవీ అవీ కరక్టుగా చెప్పడం చూసి చిరంజీవి ఆశ్చర్యపడ్డాడు. భవిష్యత్తు గురించి అడిగితే వ్యాపారంలో పైకి వస్తావని మాత్రం చెప్పాడు. చిరంజీవి ‘నేను పూర్వజన్మలో ఏం చేసేవాణ్నో చెప్పండి.’ అని అడిగాడు. ఆయన తెల్లబోయాడు. ‘పూర్వజన్మతో నీకేం పని? తెలుసుకుని ఏం చేస్తావు?’ అని అడిగాడు.

‘‘కొందరు చైల్డ్ ప్రాడిజీలు ఉంటారు. మూడేళ్లకే సంగీతం పాడేసేవాళ్లు, చదరంగం ఆడేవాళ్లు, కవిత్వం రాసేవాళ్లు, బొమ్మలు గీసేవాళ్లు కనబడతారు. పూర్వజన్మవాసనల వలననే అలాటిది సంభవమౌతుందని చెప్తూంటారు. దాన్ని తలిదండ్రులు సరిగ్గా గుర్తించక వేరే వృత్తుల్లో పెట్టి ఆ విద్యకు రాణింపు లేకుండా చేస్తారు. నేనూ బాలమేధావినే. ఎందులోనో నేను యిప్పుడు చెప్పను. మీరు చెప్పినదాన్ని బట్టి నా గెస్ కరక్టో కాదో తెలుస్తుంది. దాన్ని బట్టి నేను ఎలాటి వ్యాపారం చేయాలో డిసైడ్ చేసుకుంటాను. వ్యాపారం అనేది టూ వైడ్ ఛాయిస్. చాలా రకాలున్నాయి. నాకు స్పెసిఫిక్‌గా తెలియాలంటే పూర్వజన్మ గురించి కచ్చితంగా తెలియాలి.’’ అన్నాడు చిరంజీవి.

‘ఇలా నన్నెవరూ అడగలేదు. ఈ జన్మ అంటే కొన్ని వివరాల బట్టి నిర్ధారించుకుంటాం. ఆ జన్మలో తల్లి పేరు, తండ్రి పేరు యిలాటివి యితను చెప్పలేడు కదా. వెతకడం కష్టం.’ అన్నాడు నాడీ పండితుడు మదన్‌తో. చిరంజీవి వాదనతో ఏకీభవించిన ఆయన పండితుణ్ని మొహమాట పెట్టడంతో పాటు ఎంత డబ్బయినా యిస్తానని ఆశ చూపాడు. చివరకు పండితుడు సాయంత్రానికి ఒక పత్రాన్ని బయటకు లాగి ‘ఇదే నీ పత్రం. దీనిలో నువ్వు మరుజన్మలో ఉన్నత విద్యావంతుడవై, పాతికేళ్ల వయసులో నాడి చూపించుకోవడానికి వస్తావని రాసి ఉంది కూడా.’ అన్నాడు. చిరంజీవి థ్రిల్లయిపోయాడు. ‘అయితే అప్పుడు ఏ వృత్తిలో రాణించానో చెప్పండి.’ అన్నాడు. ఆయన పత్రాన్ని ఓ సారి పఠించి ‘నువ్వు అకాలమరణం చెందావు, అదీ హత్య కావింపబడ్డావు.’ అన్నాడు.

దాంతో చిరంజీవికి తన వృత్తి మీద కంటె పూర్వజన్మలో తనను చంపినవాడిపై ఆసక్తి పెరిగింది. చంపినదెవరో చెప్పండి, ఎంతైనా యిస్తాను, ఎన్ని రోజులైనా యిదే ఊళ్లో వెయిట్ చేస్తాను అన్నాడు. దాంతో యింకో రెండు, మూడు గంటలు తాళపత్రాలు తిరగేసి, బోర్లేసి ‘మదనగోపాల్ గారే హంతకుడు’ అని తేల్చాడు నాడీ పండితుడు. వింటూనే మదనగోపాల్ తెల్లబోయాడు. ‘‘నా పూర్వజన్మలోనా?’’ అని అడిగాడు. ‘‘కాదు, యీ జన్మలోనే’’ అన్నాడు నాడీ పండితుడు. మదన్ గోపాల్‌కు చివ్వున కోపం వచ్చింది. ‘‘ఏం మాట్లాడుతున్నారు పెద్దాయనా? నేను హత్యలు చేసేవాడిలా కనబడుతున్నానా? ఇదంతా ట్రాష్. చిరంజీవీ, యిదంతా నమ్మకు.’’ అంటూ చరచరా లేచి బయటకు వచ్చేశాడు.

చిరంజీవికి మతి పోయింది. ఏది నమ్మాలో, ఎంతవరకు నమ్మాలో అర్థం కాలేదు. మదన్ గారితో కలిసి తిరగడానికి, మాట్లాడడానికి కూడా మనస్కరించలేదు. చుట్టుపక్కల గుళ్లు చూసి రేపు వస్తాను, మీరు హైదరాబాదుకి తిరిగి వెళ్లిపొండి అని చెప్పేశాడు. తిరిగి వచ్చాక ఆయనకు ఫోన్ చేయలేదు. ఆయన మీద పోలీసు కంప్లెయింట్ యిద్దామంటే ఏమని యిస్తాడు? ఏ ఆధారం చూపుతాడు? ఇన్ని కరక్టుగా చెప్పిన నాడి ఆ విషయంలో మాత్రం తప్పు చెపుతుందా? అన్న ఆలోచన తొలిచేస్తూ నిద్ర పట్టకుండా చేస్తోంది. అందుకని నా దగ్గరకు వచ్చాడు. ఎంత ఫీజైనా యిస్తాను, నేరం నిరూపించండి అంటాడు.

అంతా విని, ‘మీకు అంత అనుమానంగా ఉంటే సంబంధం వద్దనండి. మీకు పిల్ల దొరక్కపోదు, వాళ్లకు పిల్లాడు దొరక్కపోడు.’ అన్నాను. ‘‘పెళ్లి గురించి కాదండి. ఆ మదన్ గారు హంతకుడైతే శిక్ష పడాలి కదా, సమాజంలో పెద్దమనిషిలా ఎలా తిరుగుతాడు?’’ అన్నాడు ఆవేశంగా. ‘‘అది చూసుకోవడానికి సమాజం, చట్టం, పోలీసు వ్యవస్థ ఉన్నాయి. మీకెందుకవన్నీ? హత్య జరిగి చాలా ఏళ్లయింది కాబట్టి ఆధారాలు దొరక్క శిక్ష పడేట్లు చేయడం కష్టం. మీరు యీ జన్మలో నిక్షేపంలా ఉన్నారు కదా. సంబంధం వద్దన్నాక ఆయన మీ జోలికి రాడు. మీ బతుకు మీరు బతకండి.’’ అని అనునయంగా చెప్పాను.

‘‘మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కానీ నేను ఆ చచ్చిపోయిన అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాను. ఈ మదన్‌గారికి ఓ 55, 56 ఏళ్లుంటాయి. అంటే 25, 30 ఏళ్ల వయసులో యీ హత్య చేసి ఉంటాడు. ఏదైనా అమ్మాయి విషయంలోనో, బిజినెస్ విషయంలో తనకు పోటీ వస్తున్న పాతికేళ్ల అబ్బాయిని చంపేసి అడ్డు తొలగించుకుని ఉంటాడు. నేను ప్రాడిజీ అని చెప్పాను కదా, పూర్వజన్మలోని ప్రతిభే అలా వచ్చి ఉంటుంది అనుకుంటే అతను చాలా టాలెంటెడ్ అయివుంటాడు. అతని మీద తలిదండ్రులు, సోదరీసోదరులు ఎన్నో ఆశ పెట్టుకుని వుంటారు. ఈ పెద్దమనిషి తన స్వార్థం కోసం ఆ అబ్బాయిని చంపేసి, వాళ్ల కుటుంబానికి ద్రోహం చేశాడు. అదృష్టవశాత్తూ యీ జన్మలో నాకు దేవుడు డబ్బు, పొజిషన్ అన్నీ యిచ్చాడు. నేను కాస్త కష్టపడి హతుడెవరో కనుక్కున్నాననుకోండి. అతని కుటుంబానికి సాయం చేయవచ్చు కదా..’’ అని వాదించాడు చిరంజీవి.

మామూలుగా గడ్డివాములో సూది వెతకడమంటారు. ఈ కేసులో, అదేదో వేదాంతంలో చెప్పినట్లు, వామూ మిథ్య, సూదీ మిథ్య. ఇతను ‘ఓం శాంతి ఓం’ సినిమా చూసి, ఏదేదో ఊహించేసు కుంటున్నాడు. పైకి చెప్తే అఫెండ్ అవుతాడు. ఒకతని గతం తవ్వమంటున్నాడు, దానికి భారీగా ఫీజు ముట్టచెపుతానంటున్నాడు. ఈ జన్మల గోల నాకెందుకు అనుకుని సరేనన్నాను. మదనగోపాల్ ఊరికి వెళ్లి అడిగితే, చిన్నప్పుడు అమ్మాయిలతో తిరిగేవాడు తప్ప హత్యలు చేసే రకం కాదని చెప్పారు. ఎప్పుడో అక్కడ పని చేసి రిటైరైన ఓబులరెడ్డి అనే పోలీసధికారిని పట్టుకుని యీ అమ్మాయిల గొడవేమిటని అడిగాను.

‘‘ఇతనిది మధ్యతరగతి కుటుంబం. ఒక పేదవాళ్లమ్మాయిని ప్రేమించి మోసగిస్తే ఆమె కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లేక పోయినా కేసు కట్టి కాస్త ఏడిపిద్దామా అనుకున్నాను. కానీ నాతోనే పనిచేసే ఎస్సయి ఒకతను వాళ్లమ్మాయిని అతనికి యివ్వాలని అనుకుంటున్నాడు. అది చెప్పకుండా ఓ బ్రైట్ ఫెలో భవిష్యత్తు ఎందుకు పాడుచేస్తావంటూ నన్ను ఆపేశాడు. ఆత్మహత్య వార్త పేపర్లో వస్తే కుటుంబానికి అప్రతిష్ఠ అని తలిదండ్రులు ఆమె ప్రమాదవశాత్తూ పడుంటుందని చెప్పేశారు. ఇంకేం చేస్తాం, ఫైలు మూసేశాం. ఇది జరిగి ముప్ఫయి ఏళ్లు పైనే అయి ఉంటుంది. ఇంతా చేస్తే యితను ఆ ఎస్సయి కూతుర్ని చేసుకోనే లేదు. పట్నం వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. తర్వాత బిజినెస్‌లోకి దిగి బిగ్‌షాట్ అయ్యాడు. వ్యాపారంలో ఎక్కడా ఏ ఫ్రాడూ లేదు. క్లీన్ రికార్డ్.’’ అని చెప్పాడు.

ఇది చిరంజీవికి చెప్పి యిక వదిలేద్దామని చెప్పాను. ‘‘లవరంటూ ఉంది కాబట్టి, యితను ఆమెకున్న మరో ప్రియుణ్నో, వీళ్ల ప్రేమకు అడ్డు చెప్పిన అన్నగార్నో చంపి ఉంటాడు. పూర్వజన్మలో నేను వారిలో ఒకణ్ని అయివుంటాను. వాళ్లని కనిపెట్టండి. కావాలంటే రెండు కుటుంబాలకూ హెల్ప్ చేద్దాం.’’ అన్నాడు. దీన్ని వదిలిపెట్టేట్టు లేడురా బాబూ అనుకుని, ఆ ఊరికి మా టీముని పంపించి, విషయాలన్నీ సేకరించాను. ఆ అమ్మాయికి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎవరూ లేరు. అమ్మానాన్నా చచ్చిపోయారు. ఇక ఆ అమ్మాయి ఎవరితోనైనా తిరిగిందా అన్న విషయం ఎవరూ చెప్పలేక పోయారు. ఆ మనిషే తేలనప్పుడు ఉన్నాడా, పోయాడా అని ఎలా తెలుస్తుంది? చిరంజీవిని పిలిచి, యింతకుమించి నేనేమీ చేయలేను అని చెప్పేశాను.

కానీ అతను పట్టుదలకు పోయాడు. ‘‘నాడీ గ్రంథం తప్పు చెప్పదు. చూశారా, మరుగున పడ్డ ఆ అమ్మాయి విషయం బయటకు వచ్చింది. హత్యా జరిగింది. పాత రికార్డులన్నీ తవ్వి తీసి యితనే కాలవలోకి తోసేశాడని అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి కేసులో యిరికిస్తే అతని నోటితోనే ఎవర్ని చంపాడో చెప్తాడు. మిస్టరీ విడిపోతుంది. నా పగా చల్లారుతుంది.’’ అన్నాడు ఆవేశంగా. ఈ అబద్ధపు సాక్ష్యాలు పుట్టించడం నా వల్ల కాదు, నన్ను వదిలేయమన్నాను. అతను ఓ లాయరును, అతని ద్వారా ఓ పోలీసతన్ని పట్టుకుని, పెద్దాయనకు తెలియకుండా గతమంతా తవ్వించాడు. నిజానికి ఆ కేసులో పోస్టుమార్టమ్‌ జరిగింది, దానిలో ఆమె గర్భవతి అని తేలింది. ఈ సంగతి ఓబులరెడ్డికీ తెలియదు. మదన్‌కు పిల్లనిద్దామనుకున్న ఎస్సయి, అది యితని దృష్టికి రాకుండా చేశాడు. ఆ గర్భం కారణంగా యితను ఆ అమ్మాయిని నీట్లోకి తోసేసి చంపేశాడని ఆరోపించి, తోసేయడం కళ్లారా చూసినవాడు ఒకడున్నాడని సాక్ష్యాన్ని ఫాబ్రికేట్ చేశారు. కేసు రికార్డు చేయకుండానే పోలీసులు మదన్‌ను విచారణకు పిలిచి, యింటరాగేట్ చేశారు.

అతను నాన్సెన్స్ అన్నాడు, ఏం చేస్తానో చూసుకోండి అంటూ బెదిరించాడు, వదిలేయండి అంటూ డబ్బాశ చూపించాడు, కానీ యిటు చిరంజీవి పట్టుబట్టిన కారణంగా పోలీసులూ బిగిసి కూర్చున్నారు. మూడు, నాలుగు సిటింగుల తర్వాత మదన్ విసిగిపోయాడు. చివరకు చెప్పాడు, ‘‘ఆ అమ్మాయితో తిరిగిన మాట వాస్తవం. తను నాతోనే కాదు, యింకోడితో కూడా తిరిగింది. వాడు కడుపు చేసి బొంబాయి పారిపోతే, అది నా వల్లే వచ్చిందని, నన్ను పెళ్లి చేసుకోమని గోల చేసింది. కాలువ ఒడ్డున ఉండగా ఘర్షణ జరిగింది. కోపం కొద్దీ లెంపకాయ కొడితే వెళ్లి కాలువలో పడింది. రక్షించబోయాను కానీ కొట్టుకుపోయింది. గప్‌చుప్‌గా పైకి వచ్చేశాను. ఇదీ జరిగింది. ఇది చూసినవాడు లేడు. మీరు కోర్టులో కేసు పెడితే మీది దొంగ సాక్ష్యం అని ప్రూవ్ చేయించగలను. చివరిదాకా ఫైట్ చేసే మనిషిని నేను.’’ అన్నాడు.

కథ యిక్కడిదాకా వచ్చేసరికి పోలీసులు చిరంజీవిని పిలిచి, ‘‘మీకు కావలసిన సమాచారం దొరికింది. వదిలేయండి. మేం యింతకు మించి ముందుకు వెళితే ఉద్యోగాలకు ముప్పు, ఆయనా చిన్నాచితకా మనిషి కాదు.’’ అని చెప్పారు. సరేననక తప్పలేదు చిరంజీవికి. ‘ఈ అమ్మాయిది యాక్సిడెంటే తప్ప హత్య కాదు. ఆమెకు అన్నగారు లేడు. ప్రియుడు చూస్తే బొంబాయి పారిపోయాడు. అక్కడకు వెళ్లి వాణ్ని చంపవలసిన అవసరం లేదు. ఇది కాక వేరే హత్య చేసి ఉంటాడని అనుకోవడానికి ఏ ఆధారమూ లేదు’ అనుకుని నా దగ్గరకు వచ్చి ‘నేను యిందులో ఎక్కడ ఫిట్‌ఇన్ అయ్యానో నాకు తెలియటం లేదు.’ అని వాపోయాడు. ‘ఐ టూ హేవ్ నో క్లూ’ అని చెప్పాను.

రెండు రోజులు పోయాక ఓ తెల్లవారుఝామున నాకు హఠాత్తుగా తట్టింది. ‘మనం సినిమాలు చూసిచూసి, గత జన్మ అనగానే అదే పోలికలతో, అదే వయసులో వాణ్ని ఊహిస్తున్నాం. బహుశా యితను చనిపోయిన అమ్మాయి గర్భస్థ శిశువు అయి ఉంటాడు’ అని. అప్పుడు అది అకాలమరణమే అవుతుంది కదా, నాడీ గ్రంథంలో ఏ వయసులో పోయాడో క్లియర్‌గా చెప్పలేదు కదా, అనుకోకుండా జరిగినా మదన్ చేసినది హత్యే కదా. మర్నాడు చిరంజీవిని పిలిచి యిదంతా చెప్పాను. అతను నిర్ఘాంతపోయాడు. తన గతజన్మ తెలిస్తే తనవాళ్లకు సాయం చేయడంతో పాటు, మదన్ తనను ఏ తరహాలో చంపాడో అదే తరహాలోనే చంపి కక్ష తీర్చుకుందా మనుకున్నాడు కాబోలు, అదేమీ లేదని, తను కడుపులో ఉండగానే కడతేరిపోయాడని తేలేసరికి నిరాశపడ్డాడు. చాలాసేపు అలాగే కూర్చుని ‘ఐ యామ్ గివింగ్ అప్. యూ ప్లీజ్ ఫర్‌గెట్ హోల్ ఎపిసోడ్’ అని చెప్పి వెళ్లిపోయాడు.’’ – అని పరాక్రమరావు ముగించాడు.

అంతా విన్నాక సిఎం ‘‘భలే విచిత్రమైన కథ చెప్పారు పరాక్రమరావు గారూ, కానీ టైమ్ యింటర్వెల్ మ్యాచ్ కావటం లేదు. ముప్ఫయి ఏళ్ల కంటె ముందే ఆ శిశువు చచ్చిపోతే యీ చిరంజీవికి పాతికేళ్లే అంటున్నారు కదా....’’ అని అడిగారు.

‘‘మేడమ్, మీరు ‘‘ఈగ’’ సినిమా చూసి ఒక జీవి చనిపోయిన పావుగంటలో యీగగానో, దోమగానో పునర్జన్మ ఎత్తాలని లెక్కేస్తున్నారు. జన్మల మధ్య గ్యాప్ యింత ఉండాలని ఎవరు ఫిక్స్ చేశారు? మధ్యలో స్వర్గంలోనో, నరకంలోనో కొంతకాలం అనుభవించాలి కదా..’’ అన్నాడు పరాక్రమరావు.

డాక్టరుగారు కలగజేసుకుని ‘‘జన్మల మధ్య విరామాన్ని బుద్ధిజంలో బార్డో పీరియడ్ అంటారు. అది ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేరండి.’’ అన్నాడు.

‘‘బార్డో పీరియడ్ సంగతే కాదు, బయటి వాతావరణం చూస్తే యీ బంగళాలో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్  పీరియడ్ యింకా ఎన్ని పూటలో చెప్పలేం’’ అని సిఎం జోక్ చేయడంతో అందరూ ఫక్కున నవ్వారు.  (‘అద్భుతరస యామిని’ సీరీస్‌లో మరో కథ వచ్చే నెల)

- ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)

[email protected]

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా