'చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్కువ అంచనా వేయడమే…' కొంతమంది తెలుగుదేశం భక్తులు గత ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తుకున్న మాట ఇది! జగన్ ను చంద్రబాబు నాయుడు చాలా తక్కువ అంచనా వేశాడని, తను వేసిన అంచనాల్లోనే జనాలంతా ఉంటారనే భ్రమలో మునిగి పోయి, చంద్రబాబు నాయుడు నిండా మునిగిపోయాడని పచ్చపార్టీ భక్తులు కొందరు వాపోయారు!.
చంద్రబాబు నాయుడిని గుడ్డిగా సమర్థించకుండా, ఆయన తప్పొప్పులను ఎంచగల ఆయన సొంత సామాజికవర్గం వారు సోషల్ మీడియా వేదికగా ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రత్యర్థిని గౌరవించడం, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకపోవడం, ప్రత్యర్థిని కించపరచకపోవడం.. రాజకీయంలోని సిద్ధాంతాలే. ఈ ప్రాథమిక సిద్ధాంతాలను ఎప్పుడో విస్మరించారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తన చుట్టూ ఉన్న కోటరీ ట్రాప్ లోకి జారిపోయారు!
ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో రాయిస్తే చాలు జనం ఏదైనా నమ్మేస్తారనుకున్నారు! జగన్ పై విద్వేషంతో రగిలిపోయే కమ్మ వాళ్ల అభిప్రాయాలు సమాజమంతా విస్తృతంగా పాకిపోతాయనే లెక్కలేశారు! తను నైతికంగా ఎంత చెడినా జనాలు పట్టించుకోకుండా తనకే ఓటేస్తారనుకున్నారు! దీనికి కారణం చంద్రబాబు నాయుడుకు అంతకు ముందు ఉండిన అనుభవాలే! .
ఎన్టీఆర్ నే దించి తను ముఖ్యమంత్రి కాగలిగారాయన. వరసగా రెండోసారి గెలిచారు కూడా! మీడియాను అడ్డం పెట్టుకుని, మిగతా వ్యవస్థలను మేనేజ్ చేసి అలాంటి విజయాలు సాధించిన చరిత్ర ఉంది చంద్రబాబుకు. తన కుయుక్తులతో దేన్నైనా సాధ్యం చేయవచ్చు అని చంద్రబాబు అతి విశ్వాసానికి పోయారు. అయితే ఆ అతి విశ్వాసానికి 2004లోనే తొలి సారి తీవ్రమైన దెబ్బ తగిలింది. 2009లో మళ్లీ అలాంటి ఆటే ఆడబోయి దెబ్బ తిన్నారు!
వైఎస్ రాజశేఖర రెడ్డి అనే బలమైన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడి కుయుక్తులన్నింటికీ చెక్ చెప్పగలిగారు. వరసగా రెండు పర్యాయాలు చంద్రబాబుకు రాజకీయంగా కోలుకోలేనంత దెబ్బ కొట్టారు వైఎస్. అలాంటి వైఎస్ భౌతికంగా దూరం అయిన తర్వాత చంద్రబాబు తన మార్కు వ్యూహాలకు మళ్లీ పదును పెట్టారు! .
అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే వ్యూహాలు, అవే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని జగన్ మీద కత్తి గట్టాడు. తొలి సారి పోరులో జగన్ మీద త్రుటిలో విజయం సాధించిన చంద్రబాబుకు మళ్లీ తన కుయుక్తుల మీద నమ్మకం పెరిగింది. జనాలు గొర్రెలు అనే లెక్కలేశారు. తనదైన అవకాశవాదాన్ని ప్రదర్శించారు. అయితే 2004నాటితో పోలిస్తే మరింత దారుణ పరాజయం ఎదురైంది 2019లో! .
2004లో ఓడిన తర్వాత అధికారంలో ఉన్న వైఎస్ అనే ప్రత్యర్థిని చూశారు చంద్రబాబు నాయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన జీవితంలో ఎన్నడూ రాజకీయంగా ఇబ్బందులు పడలేదు. పార్టీ ఓడినా, గెలిచినా.. ఆయన జీవితంలో కష్టాల్లేవ్! అయితే వైఎస్ తనయుడి జీవితం అలా సాగలేదు.
తండ్రి మరణంతో తను సాగించిన ప్రతిపక్ష వాసంలో జగన్ చూడని కష్టం అంటూ లేదు. అలాంటి కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కుంటూనే, తన ప్రత్యర్థుల బలం మీద కూడా జగన్ ఒక అంచనాకు వచ్చారు. ఒకవైపు జనాన్ని నమ్ముకుంటూనే, తన బలాన్ని కూడా జగన్ నమ్ముకున్నారు.
చంద్రబాబు నాయుడు అదే అవకాశవాదం, అదే మీడియా, అదే వ్యవస్థల మేనేజ్ మెంట్ అనే ఆయుధాలను నమ్ముకుని గత ఎన్నికలకు వెళితే, జగన్ మాత్రం జనాలకు తను విన్నానంటూ, తను ఉన్నానంటూ చెప్పుకుంటూ, ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే రాజకీయ వ్యూహాలనూ అమలు చేశారు.
జగన్ వ్యూహాల ముందు చంద్రబాబు నాయుడి కుటిల నాయకత్వం నిలబడలేకపోయింది. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి, నేతల్లో విశ్వాసాన్ని పెంచుకుని జగన్ తిరుగులేని మెజారిటీతో సీఎం అయ్యారు. తన పాత వ్యూహాలనే నమ్ముకున్న చంద్రబాబు నాయుడు చిత్తు అయ్యారు!
జగన్ ప్రజలనే నమ్ముకున్నాడు, ప్రజల అభిప్రాయాలను తాము డిసైడ్ చేస్తామనే ఒక భ్రమలో పచ్చబ్యాచ్ మునిగిపోయింది. ప్రజలు తాము ఏం చెబితే అది వింటారు, తాము ఏం రాస్తే అదే చదువుతారు, వ్యవస్థలను మేనేజ్ చేసే తమ థర్డ్ గ్రేడ్ వ్యూహాలతో ఎన్నికల్లో కూడా గెలవొచ్చనే తప్పుడు అంచనాలు వాళ్లవి.
ఆ అంచనాలు తలకిందులయ్యాయి. అలా రాజకీయంగా తిరుగులేని ఎదురుదెబ్బ చంద్రబాబు అండ్ కంపెనీకి తగిలింది. అలా మొదలైంది దిగ్బంధనం! ఆ దిగ్బంధనంలో జగన్ ఒక్కో వైపు నుంచి వస్తున్నారు. జగన్ పన్నుతున్న అష్ట వ్యూహాల్లో చంద్రబాబు నాయుడు బంధీ అవుతున్నారు!
ఒకటవ బంధనం.. చంద్రబాబును ప్రజల్లో వీక్ చేశారు!
గత ఎన్నికల సమయంలోనే ఈ విషయంలో జగన్ విజయవంతం అయ్యారు. క్షేత్ర స్థాయికి వెళితే జగన్ రాజకీయ చాణక్యం బయటపడుతుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి, దశాబ్దాలుగా ఓటమి ఎరగని నేతలు ఓడిపోయారు! సామాజికవర్గ సమీకరణాలు, నేతల చరిత్ర.. ఇవేవీ తెలుగుదేశం పార్టీని గెలిపించలేకపోయారు.
దశాబ్దాలుగా గంప గుత్తగా టీడీపీకి ఓటేసే ప్రజల మనసునే మార్చారు జగన్. వారు ఎందుకు తెలుగేదశం పార్టీకి ఓటేస్తూ వచ్చారనే అంశం గురించి ఎక్కడిక్కడ అర్థం చేసుకుని.. క్షేత్ర స్థాయిలో వ్యూహాలన్నీ మార్చి జగన్ దూసుకెళ్లారు. ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి సమీకరణాలనే ఫాలో అయ్యి చంద్రబాబు నాయుడు బోల్తా పడ్డారు.
2019 ఎన్నికల తర్వాత తనదంటూ చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడుకు ఏ వర్గం ఓటు బ్యాంకూ సాలిడ్ గా మిగల్లేదు! చంద్రబాబు తన స్టైల్లో ఎన్నో వ్యూహాలను ఫాలో అయినా.. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నా.. మళ్లీ అధికారంలోకి రాలేకపోయారు! అలా చంద్రబాబును రాజకీయంగా చేతగాని వాడిగా నిలబెట్టాడు జగన్.
రెండో టార్గెట్ ఆర్థిక శక్తి..
సాధారణ నాయకుడు తను అధికారంలోకి వచ్చాకా తన లక్ష్యం నెరవేరిందని అనుకుంటాడు. అయితే తన ప్రత్యర్థుల తీరేమిటో జగన్ కు పూర్తి క్లారిటీ ఉంది. అందుకే చంద్రబాబును తక్కువ అంచనా వేయలేదు. గత ఐదేళ్ల అధికార కాలంలో.. చంద్రబాబు నాయుడు సాగించిన దోపిడీ, తద్వారా ఆయన పెంచుకున్న ఆర్థిక శక్తి మీద దృష్టి సారించారు.
తన వాళ్లు, తన సామాజికవర్గం కోసం చంద్రబాబు నాయుడు అల్లిన అమరావతి వైపు చూశారు. అక్కడ చంద్రబాబు చిక్కుబడిపోయారు! అమరావతి అసలు కథ ఏమిటో అన్ని ప్రాంతాల వారికీ ఇప్పుడు స్పష్టం అయిపోయింది. అమరావతి రాజధానిగా ఉంటే చాలూ.. మరేమీ వద్దు అని చంద్రబాబు నాయుడు బాహాటంగా ప్రకటించే పరిస్థితికి వచ్చారు. తద్వారా తన బలహీనతను ఆయన బయటపెట్టుకున్నారు.
చంద్రబాబును ఏదో రకంగా ఇన్నాళ్లూ అభిమానించిన ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆయన రియలెస్టేట్ ప్రయోజనాల గురించి అర్థం చేసుకున్నారు. మూడూళ్ల కోసం ఆయన ఏడాదిగా పోరాడుతున్న తీరుతో ఆ మూడూళ్ల నేతగా మిగిలిపోయారు.
మూడు ప్రాంతాల్లోనూ ఆయనపై వ్యతరేకత గతంతో పోలిస్తే మరింత పెరిగింది! మూడు రాజధానులనే అస్త్రంతో జగన్ మూడు ప్రాంతాల్లోనూ తన ఇమేజ్ ను పెంచుకోగా, అమరావతి అంటూ చంద్రబాబు నాయుడు చిక్కుకున్నారు. ఆ చిక్కుముడులు వీడి ఆయన బయటపడే అవకాశాలే కనిపించడం లేదు!
మూడో బంధనం.. టీడీపీ నాయకత్వం నిర్వీర్యం!
అసలు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఉందా? అని అనుమానించే పరిస్థితి ఏర్పడింది. పేరుకు ప్రధాన ప్రతిపక్షం అయినా.. ఆ పార్టీ తరపున యాక్టివ్ గా ఉన్న లీడర్లెంతమంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టగలిగే పరిస్థితి! వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా తిరుగుతూ , ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే నేతలు చాలా మంది ఉండేవారు.
ఓడినప్పటికీ.. నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా చలామణి అయ్యే వాళ్లు చాలా మంది ఉండేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు! గతంలో నాలుగైదు టర్ములు వరసగా గెలిచిన వారు కూడా గత ఏడాది కాలంగా నియోజకవర్గాల్లో ఏం పట్టనట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొలి ఏడాదిలోనే చంద్రబాబు పాలనపై అనేక ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు చేసింది.
ప్రతిపక్షంగా ఉనికిని చాటింది. అయితే ఏపీలో ప్రతిపక్ష ఉనికి కేవలం టీడీపీ పత్రికల్లో మాత్రమే కనిపిస్తుంది. అంతే కానీ జనంలో కనిపించదు. ఉచితం కాబట్టి అనుకూల పత్రికల్లో ఎంత రాయించుకున్నా, క్షేత్ర స్థాయిలో నేతలు లేకపోవడం, ఓడిన వాళ్లు ఇప్పటికీ జనం మధ్యకు రాకపోవడం టీడీపీ భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తోంది! ఎక్కడైనా కాస్త పాజిటివ్ ఇమేజ్ ఉన్న వాళ్లను జగన్ తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇక టీడీపీ తరఫున అతిగా స్పందించే నేతలకూ బోలెడన్ని బొక్కలు ఉండనే ఉన్నాయి.
నాలుగోది పాత అవినీతి వ్యవహారాలపై విచారణ!
తెలుగుదేశం పార్టీ హయాంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాల మీదా జగన్ ప్రభుత్వం చర్యలు మొదలయ్యాయి. తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు, విచారణ జరిపించుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది బహిరంగ ఛాలెంజ్ లు చేశారు! ఇప్పుడేమో వాళ్లే విచారణలు ఆపించాలని కోరుతూ కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుంటున్నారు.
అరెస్టు చేస్తే అక్రమ కేసులు అంటున్నారు. అయితే ఆధారాలు గట్టిగా ఉండటంతో.. ఆ వాదనకూ విలువ లేకుండా పోతోంది. పదే పదే తనను జైలుకెళ్లొచ్చాడు అంటూ వ్యాఖ్యానిస్తున్న నేతలకూ జైలంటే ఎలా ఉంటుందో చూసే అవకాశాన్ని ఇస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ కు నీతులు చెప్పే వాళ్లు వందల కోట్ల స్కామ్ లలో జైళ్లకు వెళ్లి వస్తూ.. ప్రజల చేత మరింత అసహ్యించుకోబడుతున్నారు. వీళ్లా రాజకీయ అవినీతి గురించి ఇన్నాళ్లూ మాట్లాడింది అని ఆశ్చర్యపోయే పరిస్థితి ప్రజల్లో నెలకొంది.
టీడీపీ హయాంలోని అవినీతి వ్యవహారాలపై విచారణ అనేది ఆ పార్టీకి తీవ్రమైన శరాఘాతం. ఇది ఇంకా పూర్తి కాని అంశం. మరింత కాలం ఈ విచారణలు సాగుతాయి. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇంకా ఇతర మైనింగ్ అక్రమాలు, లోకేష్ కనుసన్నల్లో సాగిన స్కాములు.. వీటిపై విచారణలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల లోకేష్ కూడా జైలు పాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పక్కా ఆధారాలతో ఈ విచారణలు సాగితే.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత పతనావస్థకు దారి తీస్తుంది.
ఐదు చంద్రబాబు వద్ద వ్యూహాల్లేవ్!
అవిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అంటూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. నిజంగానే ఎన్నికలు వస్తే దాన్ని ఎదుర్కొనగల శక్తి తెలుగుదేశం వద్ద ఉందా? అనేది కీలకమైన ప్రశ్న. 2022లో ఎన్నికలు జరిగినా వాటిని ఎదుర్కొనే స్థితిలో లేనిది తెలుగుదేశం పార్టీనే! పార్టీలో ఎవరున్నారో, ఎవరు లేరో కూడా తెలియని పరిస్థితి. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను ప్రకటించుకోలేని స్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ.
అలాంటి పార్టీ అధినేత ఎన్నికల గురించి మాట్లాడటం ప్రహసనం. పార్టీ శ్రేణులకు ఎలా ధైర్యం చెప్పాలో కూడా తెలియక చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా మళ్లీ బలోపేతం కావడానికి వ్యూహాల్లేవు. అమరావతి అంటూ మూడు ప్రాంతాల్లోనూ ఆయనే పార్టీని ముంచేశారు.
జగన్ పై మత విద్వేషాన్ని రేపే ప్రయత్నమూ చేశారు. అలా చేసినా తెలుగుదేశం బావుకునేది ఏమీ ఉండదు. జగన్ పై మతపరమైన కోపం ఎవరికైనా వచ్చినా, వాళ్లేమీ వచ్చి టీడీపీ ఓటేయరు. టీడీపీ హయాంలో మతాన్ని ఏ స్థాయిలో ఉద్ధరించారో ఎవరికీ తెలియనిది కాదు.
మత చిచ్చును రేపితే దాంట్లో ముందుగా మసయ్యేది టీడీపీనే! మరే వ్యూహం లేక చంద్రబాబు నాయుడు అలాంటి వ్యూహాల జోలికి వెళ్తున్నట్టుగా ఉన్నారు. సంక్షేమ పథకాలపై మాట్లడలేరు, వద్దనలేరు- కావాలనలేరు, ఇక పాలన పరంగా ఏ విమర్శ చేసినా.. ఆయన హయాంలో జరిగిన బాగోతాలపై చర్చ వస్తుంది. ఇలా వ్యూహలేమి స్థితికి జారిపోయింది టీడీపీ!
ఆరు.. రహస్య సహకారాలకు చెక్!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యవస్థలను మేనేజ్ చేసే నేర్పు ఉందనేది ఈ నాటి అభిప్రాయం కాదు. ప్రజలు సీఎంగా ఎన్నుకున్న ఎన్టీఆర్ ను దించేయడం, తెలుగుదేశం పార్టీని తన హస్తగతం చేసుకోవడం వంటి పరిణామాల్లో ఆయన అన్ని వ్యవస్థల హెల్ప్ తీసుకున్నాడనేది దాస్తే దాగే సత్యం కాదు.
న్యాయవ్యవస్థలో కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లోనే నాట్లు వేశారని, అవి ఫలితాలను ఇస్తాయని ఆయనే తరచూ తమ మధ్య చెప్పేవాడని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి పాత టీడీపీ నేత చెప్పారొకసారి. న్యాయమూర్తుల పేర్లను చెప్పి మరీ వారి సహకారం తనకు ఉంటుందని చెప్పారట.
అలాగే జయప్రదంగా వ్యవహరించి టీడీపీ పై హోల్ సేల్ రైట్స్ ను తన సొంతం చేసుకున్నారనే ఖ్యాతి కూడా ఆయనదే. పున్నమి ఘాట్ పార్టీలు, అన్ని వ్యవస్థలనూ తన మనుషులూ.. ఇవన్నీ చంద్రబాబు మార్కు వ్యూహాలు అనేది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. ఈ క్రమంలో వ్యవస్థలోకి ఆల్రెడీ చొచ్చుకుబడిన చంద్రబాబు మనుషులను ప్రజల ముందు ఎక్స్ పోజ్ చేసేందుకు ఎలాంటి మొహమాటాలకూ, భయాలకు వెళ్లలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఈ విషయంలో జగన్ ఇప్పటికే పలువురి విషయంలో విజయవంతం అయ్యారు. ఇలాంటి విషయాల్లో జగన్ మొండిగా వెళ్తున్నారు అని కొంతమంది మొదట్లో అభిప్రాయపడినా, ఆ తర్వాత వాళ్ల అభిప్రాయాలూ మారుతున్నాయి. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ రాసిన లేఖను కూడా పలువురు న్యాయనిపుణులు సమర్థిస్తున్నారు. జగన్ కోరిక మేరకు విచారణ జరగాల్సిందే అంటూ ఢిల్లీ లెవల్లో వాదన వినిపిస్తోంది.
ఆ లేఖపై కక్కలేని మింగలేని స్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. విచారణ జరుగుతుందా, లేదా.. అనే సంగతెలా ఉన్నా, తన వాదనను జగన్ ఓపెన్ గా చెప్పగలిగారు. ఆ ట్రాప్ లో తెలుగుదేశం అండ్ కో చిక్కుకుంది. జగన్ లేఖ రాయడమే నేరమైనట్టుగా పచ్చ మీడియా స్పందిస్తూ.. ప్రజలకు స్పష్టమైన సందేశాన్నే ఇస్తోంది. జగన్ లేఖతో టీడీపీ మరింతగా దూరి ఇరుక్కుపోయింది. ప్రజలకూ స్పష్టత వచ్చింది!
ఏడు..చంద్రబాబుకు ఢిల్లీ లెవల్లో చెక్!
ఇది చంద్రబాబు నాయుడు స్వయంకృతం కూడా. గత ఎన్నికల సమయం వరకూ మోడీతో అంటకాగి, చివర్లో ప్లేటు ఫిరాయించారాయన. మోడీ మళ్లీ గెలవరనే లెక్కలతో కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కాంగ్రెస్ కు ఎన్నికల ఖర్చు సర్దింది కూడా చంద్రబాబు నాయుడే అనేందుకు స్పష్టమైన రుజువులు మోడీకి కూడా ఉన్నాయని భోగట్టా. తీరా తిరుగులేని మెజారిటీతో మళ్లీ మోడీ ప్రధాని అయ్యాకా.. వారి ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు సాగిలా పడుతున్నారు.
అయితే ఇప్పుడు బీజేపీ వాళ్లు చంద్రబాబును నమ్మడం లేదు. జగన్ తన విశ్వసనీయతతో ప్రజలనే కాదు, ఢిల్లీ వాళ్లనూ ఆకట్టుకుంటున్నారు. చంద్రబాబు వంటి అవకాశవాదితో స్నేహం కన్నా, చెప్పిన మాటకు కట్టుబడే జగన్ తో సాన్నిహిత్యమే తమకు మంచిదని బీజేపీ అధిష్టాన వర్గం కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా ఉంది.
ఈ అవకాశాన్ని కూడా వదులుకోకుండా.. కేంద్ర ప్రభుత్వంతో వీలైనంత సఖ్యతతో నడుచుకుంటున్నారు జగన్. తను చెప్పే మాటకు విలువను నిలుపుకున్నారు, తన వద్ద సీట్ల విలువనూ కలిగి ఉన్నారు..ఈ రకంగా జగన్ ఢిల్లీ స్థాయిలో చంద్రబాబుకు పూర్తిగా చెక్ చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ కూడా చంద్రబాబును పట్టించుకునేలా లేదు.
ఎంత భజన చేసినా.. బీజేపీ వాళ్లు పుల్లవిరిచి మాట్లాడుతున్నారు చంద్రబాబు విషయంలో. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి అయితే.. అంతటితో చంద్రబాబు రాజకీయ జీవితానికి కూడా శుభం కార్డు పడినట్టే కాబోలు!
అష్టమ బంధనం.. చంద్రబాబు అసలు రూపాన్ని చూపడం!
తన నాయకత్వంతో చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని ప్రజలే పోల్చేలా చేసి.. చంద్రబాబుది ఎంత మరగుజ్జుతత్వమో అర్థమయ్యేలా చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అయినా, ప్రజా సంక్షేమ విషయాల్లో అయినా.. జగన్ చాలా డైనమిక్ గా వ్యవహరిస్తున్నారు.
తన పార్టీ కార్యకర్తలు, తన పార్టీ నేతలు, తన కులం వాళ్లు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తే… జగన్ మాత్రం ప్రజలే పరమావధిగా తీసుకుంటున్నారు. పచ్చ చొక్కాల జేబులు నింపడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగితే, జగన్ ప్రజల జేబులు నింపుతున్నారు. రాజకీయాల సంగతెలా ఉన్నా.. పాలకుడిగా చంద్రబాబు కన్నా జగన్ ఎంతో ఎదుగుతున్నారు.
సొంత ఆలోచనల్లేకుండా, అవినీతే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తే జగన్ నవ్యనూతన విధానాలతో ముందుకు వెళ్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల, వెనుకబడిన వర్గాల పరిస్థితులను పూర్తిగా మార్చేసేలా జగన్ పాలన సాగిస్తున్నారు. ఇలా తన పాలనలోని పాజిటివ్ అంశాలతో చంద్రబాబు ను తక్కువ చేసి చూపించగలుగుతున్నారు జగన్.
ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరిచి, ప్రభుత్వ వైద్యశాలలకు స్వస్థత చేకూర్చి, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలను అందిస్తూ… జగన్ నాయకుడిగా ఒక్కో మెట్టూ ఎదుగుతున్నారు. ఈ ఎదుగుదల ముందు చంద్రబాబు చిన్నబోతున్నారు.
చివరకేం చేయలేక అమరావతికే పరిమితం అయిపోయారు. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసినా, తన కులాధికారులను ఉపయోగించుకున్నా, పవన్ కల్యాణ్ ను వాడుకున్నా.. అంతిమంగా అమరావతి కే బంధీ అయిపోయారు. జగన్ పన్నిన అష్టదిగ్బంధనంలో చంద్రబాబు నాయుడు అలా ఇరుక్కుపోయారు. రాజకీయంగా జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ బంధనం నుంచి బయట పడే అవకాశాలు కూడా కనిపించకపోవడం గమనార్హం.