అదిగో.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను ఒక ఎల్లయ్య ఖండించాడు, ఇదిగో.. ఇప్పుడు ఈ పుల్లయ్య ఖండించాడు! అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తమ పోకడను కొనసాగిస్తూ ఉన్నాయి! .
ఇదెలా ఉందంటే అచ్చం అమరావతి ఉద్యమం తీరును గుర్తు చేస్తోంది! జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములాను ఎంతో మంది ఎల్లయ్యలు, మరెంతో మంది పుల్లయ్యలు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా ఖండించారు.
వారెవరో తెలియని వారు కూడా ఆ పత్రికల్లో ఫొటోలు వేయించుకోలిగారు. జస్ట్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు! అమరావతి అంటే చాలు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉచిత పబ్లిసిటీ ఇచ్చాయి.
ఇప్పుడు సీజేఐకి జగన్ రాసిన లేఖపై కూడా ఆ పత్రికలు అదే తరహా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. జగన్ లేఖను ఉపేక్షించవద్దు అంటూ.. వంద మంది లా విద్యార్థులు లేఖ రాశారట! డబ్బులు తీసుకునే లాయర్లు, తెలుగుదేశం నేతల ఖండనలు చాలవని.. లా విద్యార్థుల లేఖలు కూడా ఈనాడుకు మహాతీర్పులు అయిపోయాయి!
రేపటి నుంచి ఏడో తరగతి, ఎనిమిదో తరగతి విద్యార్థులు, రాయడం రాని పిల్లలు కూడా సీజేఐకి జగన్ లేఖను ఖండించిన వైనాన్ని ఈనాడు పతాక శీర్షికలకు ఎక్కిస్తుందేమో!. బలపంతో పలక మీద రాసి పిల్లలు పోజులు ఇస్తే వాటిని ముద్రించి ఈనాడు సామాజిక న్యాయం చేసుకుంటుందేమో!
మాజీ న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు న్యాయవాదులు, ప్రశాంత్ భూషణ్ లు, మరెంతోమంది న్యాయ నిపుణులు..ఆరోపణలూ వచ్చాకా విచారణ జరిగితే మంచిది, చట్టం ముందు అంతా సామానులే.. సుప్రీం కోర్టు జస్టిస్ అయినంత మాత్రాన ఆయనేమీ చట్టానికి మినహాయింపు కాదు
అని వ్యాఖ్యానిస్తూ ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు మాత్రం అతిగా వెనకేసుకు వస్తూ ప్రజల్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తూ ఉన్నారు. అమరావతి ఉద్యమం గురించి రాసిన వార్తల తరహాలోనే ఇవి కూడా ఉండటంతో.. సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అనే అనే అభిప్రాయాలను కలిగిస్తూ ఉన్నాయి ఆ రెండు పత్రికలూ!