ప్రేమికుల రోజు ఏడాదికి ఒకసారే వస్తుంది, అయితే నిజంగా ప్రేమలో ఉంటే మాత్రం ప్రతి రోజూ ప్రేమికుల రోజే! నిజంగా ప్రేమలో ఉండటం అంటే.. ప్రతి సారీ అదే ఆకర్షణను కలిగి ఉండటమా, చూసిన ప్రతిసారీ బటర్ ఫ్లైస్ ఇన్ ది స్టమక్ అనే ఫీలింగ్ కలగడమా! అలా ఎవరికీ జరిగే అవకాశం ఉండదు.
ప్రేమించిన వారు పక్కనే ఉన్నా.. అదే ప్రేమ ప్రతి నిమిషం ఉండటం అనేది అసాధ్యం! చూడకుండా ఉంటే కలిగే ఎడబాటు కావొచ్చు, చూస్తూ ఉంటే కలిగే భావనలు కావొచ్చు.. శాశ్వతంగా ఉండటం జరిగే పని కాదు! తామెంత ప్రేమికులమని చెప్పుకున్నా.. ఏడాదికోసారి ప్రేమికుల రోజు అంటేనే, లేదా ఇంకా పెళ్లి వరకూ వెళ్లకపోతేనో.. ప్రత్యేకం అనిపిస్తుంది కానీ, ఆ ప్రత్యేకత ప్రతి రోజూ ఉండటం సాధ్యం కాదు! అయితే .. కనీసం బోర్ కొట్టకుండా చూసుకోవడానికి మాత్రం చాలా అవకాశం ఉంది! ప్రేమలో దీర్ఘకాలం ఉన్నా, ప్రేమ పెళ్లికి దారి తీసినా.. ఒకరి సాంగత్యం మరొకరికి ఎప్పుడూ రీఫ్రెషింగ్ గా ఉండటానికి అనుసరించే మార్గాలున్నాయి.
సర్ ప్రైజెస్!
దాంపత్యంలో అయినా, ప్రేమలో అయినా.. సర్ ప్రైజెస్ ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అంశాలు! సర్ ప్రైజెస్ అంటే పార్ట్ నర్ కు ఏవో చెప్పి షాక్ లు ఇవ్వడం కాదిక్కడ! సర్ ప్రైజింగ్ టూర్ ప్లాన్స్, సర్ ప్రైజింగ్ గిఫ్ట్స్, కనీసం.. సర్ ప్రైజింగ్ గా బయటకు డిన్నర్ కు తీసుకెళ్లడం, సర్ ప్రైజింగ్ రొమాంటిక్ ప్లాన్స్.. పార్ట్ నర్ ఎక్స్ పెక్ట్ చేయని రీతిలో ఇలాంటివి ప్లాన్ చేస్తే.. ఆ రిలేషన్షిప్ కచ్చితంగా బాగుంటుందని వేరే చెప్పనక్కర్లేదు! ఇది ఆర్థిక అంశాలతో కూడా ముడిపడినది కావొచ్చు. ఎవరి శక్తి కొలదీ వారు, అయితే చాలామంది శక్తి మేరకు అయినా.. ఇలాంటి ప్లాన్లను వేయడానికి ఆసక్తిచూపరనే విషయాన్ని గమనించవచ్చు!
ప్రశంస!
ఓ చిన్న కాంప్లిమెంట్ ఇస్తే పోయేదేమీ లేదు! ఆఫీసుల్లోనూ, బయటి వాళ్లకు అయితే.. ఫార్మల్ గానో, కావాలనో చాలా రకాల కాంప్లిమెంట్స్ ఇచ్చే రోజులవి! అయితే పార్ట్ నర్ కు మాత్రం ఓ చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడానికి మనసొప్పదు చాలా మందికి! మనసులో పేరుకుపోయిన రకరకాల అంశాల వల్ల పార్ట్ నర్ కు కాంప్లిమెంట్ ఇవ్వకూడదు, ఇచ్చే ఆసక్తి కూడా లేకుండాపోతుంది దీర్ఘకాలంలో! ఇలా కాకుండా.. దీనికి వ్యతిరేకంగా పార్ట్ నర్ కు తగురీతిలో కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే.. ఆ రిలేషన్ లో కచ్చితంగా దగ్గరితనం పెరుగుతుంది!
సహకారం!
పార్ట్ నర్ కు ఏవో గోల్సో, డ్రీమ్సో ఉంటాయి.. వాటిని ప్రోత్సహించడం వీలైతే సహకరించడం.. చాలామంది సక్సెస్ ఫుల్ వ్యక్తులు ఈ ప్రస్తావన తెస్తూ ఉంటారు. తమకు తమ పార్ట్ నర్ ఇచ్చిన సహకారం గురించి కూడా కొందరు విపులంగా చెబుతూ ఉంటారు. మరి వారి నుంచి నేర్చుకోదగినదే ఇది! అయితే నా పని నాది, నీ పని నీది అన్నట్టుగా వ్యవహరిస్తూనే చాలామంది భార్యాభర్తలు బతుకేస్తూ ఉంటారు! ఇలా కాకుండా.. పరస్పర సహకారం ఉంటే, ఆ కాపురాలు ప్రత్యేకంగా ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకునేంత అవసరం ఉండదు! వారికి ప్రతి రోజూ ప్రేమికుల రోజే కదా!
ప్యాషనేట్, రొమాంటిక్!
ఒక వయసుకు వచ్చాకా పార్ట్ నర్ పై శృంగార భావనలు బాగా తగ్గిపోవచ్చు! ఇక అనుభవించడానికి ఏమీ లేదనంత! శరీరంలో వచ్చే మార్పులు కూడా ఈ భావనలను తగ్గించి వేయవచ్చు. అయితే ఇది ఇద్దరికీ ఒకలా ఉంటుందనుకోవడం మాత్రం సరికాకపోవచ్చు! అతిగా వేరే అంశాల గురించి ఆలోచించకుండా.. రొమాంటిక్ ఫీలింగ్స్ ను కలిగి ఉండటం, పార్ట్ నర్ కు తగినట్టుగా వ్యవహరించడం కూడా కీలకమైన అంశం!
అర్థం చేసుకునే తత్వం!
ఎంతసేపూ జడ్జిమెంట్ లు పాస్ చేయడం, అవతలి వారిని డిక్టేట్ చేయడం కాకుండా.. అర్థం చేసుకునే తత్వమే బంధాన్ని అనందంగా కొనసాగింపచేస్తుంది. పార్ట్ నర్ కోసం ఏం చేయలేకపోయినా.. కనీసం అర్తం చేసుకునే తత్వం ఉంటే చాలు కూడా!