ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు వుంటుందని ఏపీ విభజన చట్టంలో పొందుపరిచారు. పదేళ్ల కాల పరిమితి త్వరలో ముగియనుంది. అయితే ఉమ్మడి రాజధానిని మరికొంత కాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మామూలు విషయమన్నట్టుగా మీడియాతో అన్నారు.
విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందని, ఇక్కడి నుంచే త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన సాగిస్తారని వైవీ సుబ్బారెడ్డి చాలా సార్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో లబ్ధి పొందేందుకు వైవీ సుబ్బారెడ్డి ఆ మాట తరచూ అంటున్నారని అర్థం చేసుకోలేనంత అమాయకులెవరూ లేరు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆయన ఉమ్మడి రాజధానిపై ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. రాజధాని నిర్మించడానికి తమ వద్ద నిధులు లేవని, వైసీపీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సంక్షేమ పథకాల అమలే అని ఆయన గుర్తు చేశారు. మరోసారి తమ ప్రభుత్వమే వస్తుందని, కావున విశాఖ నుంచి పరిపాలన మొదలయ్యే వరకూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతామని ఆయన అనడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అయితే ఈ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించడం గమనార్హం. తన మాటల్ని వక్రీకరించారని వైవీ సుబ్బారెడ్డి చెప్పి వుంటే బాగుండేది. తన మాటలపై వివాదం చెలరేగినా ఆయన మాత్రం స్పందించలేదు. వైవీ మాటల్ని వక్రీకరించారని మంత్రి బొత్స చెప్పడం గమనార్హం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పూర్తయితే, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని బొత్స తెలిపారు. ఇదే తమ పార్టీ స్టాండ్ అని ఆయన చెప్పడం విశేషం.
అసలే రాజధాని లేని రాష్ట్రంగా చేశారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలున్నాయి. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అనడంతో ప్రతిపక్షాలు దాడి మొదలు పెట్టాయి. విశాఖ నుంచి తన భార్య ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండడంతో నష్ట నివారణకు బొత్స సత్యానారాయణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సున్నితమైన అంశంపై మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది.