సింపుల్ గా వుండడం, నిర్మొహమాటంగా తన ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోవడం, తన స్వంత కాళ్ల మీద నిలబడి చూపించాలన్న పట్టుదల, ఓటములు మీద పడుతున్నా, ఆగిపోకుండా, మరింత బలంగా పోరాడడం ఇవన్నీ చిన్నవయసులోనే నేర్చేసుకున్న హీరో సాయిధరమ్ తేజ్. మెగా హీరో అన్న ట్యాగ్ లైన్ వున్నా, కొన్ని హిట్ లు ఖాతాలో వున్నా, సరైన సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నాల్లోనే వున్న సాయితేజ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా చిత్రలహరి. కిషోర్ తిరుమల డైరక్షన్ లో తయారైన ఈ సినిమా విడుదల సందర్భంగా తేజుతో ముఖాముఖి.
సాయిధరమ్ అని పిలవాలా.. సాయి తేజునా.. సాయి ధరమ్ నా?
అబ్బే.. సాయి ధరమ్ తేజ నే. ఈ సినిమాకు మాత్రం సాయితేజ్.
ఇదంతా న్యూమరాలజీ ప్రభావమా?
అబ్బే.. అదే కాదండీ. జస్ట్ మామూలుగా.
అంతేనా.. తరువాత సినిమా డైరక్టర్ మారుతితో చేస్తున్నారు. ఆయనకు న్యూమరాలజీ తెలుసు. ఆయనేమన్నా మార్చారేమో అని?
లేదండి.. జస్ట్ ధరమ్ పక్కన పెట్టాను. ఈ సినిమాకు కాస్త కూల్ గా వెళ్దామని.
తరువాత సినిమా ఆయనతోనే కదా?
ఇంకా అదేం లేదు. స్క్రిప్ట్ ఫైనలైజ్ కాలేదు.
స్క్రిప్ట్ ఫైనలైజ్ కాలేదు. కానీ సినిమా ఆయనతోనే కదా?
అ.. అదే.. మీరు అన్నదే. అయితే ఇంకా మరి కొన్ని స్క్రిప్ట్ లు కూడా వినాలి. టైమ్ లేక వినలేదు.
సాధారణంగా ఫేజ్ సరిగ్గా లేనపుడు, చాయిస్ తక్కువ వుంటుందేమో?
అదేంలేదు. టైమ్, సిట్యువేషన్ అన్నీ కలిసి రావాలి. ఒక్కోసారి టైమ్ కుదరదు. ఒక్కోసారి వాళ్లు పెట్టిన ఖర్చు కూడా ఓ ఫ్యాక్టర్ అవుతుంది.
ఇండస్ట్రీలో మీకో స్టార్స్ అంతా దాదాపు మీ ఏజ్ గ్రూప్. ఏ కథ అయినా అందరికీ కాస్త చిన్న మార్పులతో సెట్ అయిపోతుంది. అలాంటపుడు కథ ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరకు వచ్చినపుడు, డౌన్ ఫాల్ లో వున్నవారి దగ్గరకు ఆఖరున వస్తుందేమో?
అలా చెప్పలేమండీ. ఆ కంటెంట్ ఎవరికి సెట్ అవుతుందో? కంటెంట్ ఈజ్ కింగ్. అది కూడా తీసుకున్న డెసిషన్లు. వాటి ప్రభావం ఇలా చాలా వుంటాయి. వాళ్లకు వర్కవుట్ అయినవి నాకు వర్కవుట్ కాకపోవచ్చు. నాకు అయినది వాళ్లకు కాకపోవచ్చు.
సాధారణంగా ఎవరైనా ఫెయిల్యూర్స్ ను మరచిపోవాలని చూస్తుంటారు. అలా మరిచిపోకపోతే ముందుకు వెళ్లలేరు కూడా. కానీ మీరెందుకు మీ ఫెయిల్యూర్స్ ను పదే పదే ప్రస్తావిస్తుంటారు.
దె ఆర్ ద బెస్ట్ టీచర్స్ అండీ. మన టీచర్లను మనం మరచిపోము కదా. మనం ఓడిపోతున్న టైమ్ లో మనకు తెలిసివస్తుంది. మనం చేసిన తప్పులేమిటో? సో, అలా అవి నేర్పించినపుడు, వాటిని ఎలా మరచిపోగలను? నా ఫెయిల్యూర్స్ కు నేను విలువ ఇస్తాను.
కానీ కాయిన్ కు ఇంకో సైడ్ కూడా వుంటుంది కదా? ఫ్యాన్స్, మీ సర్కిల్.వాళ్లంతా మీరు ఏదో ఫీలవుతున్నట్లు గానో, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లుగానో అనుకునే అవకాశం వుంది కదా?
నేనేం ఫీల్ కావడంలేదు. నేనేం సఫర్ కావడంలేదు. ఐ యామ్ హ్యాపీ ఫర్ లెర్నింగ్ ఫ్రమ్ మై ఫెయిల్యూర్స్.
కమింగ్ టు చిత్రలహరి.. ఈ స్క్రిప్ట్ ను చిరంజీవిగారు విన్నారని. ఆయన కేర్ తీసుకున్నారని.
సెకండ్ ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను. ఒకసారి కథ వినండి అని. ఆయన విన్నారు. నచ్చింది. ఓకె. నీ నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్లు అన్నారు. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్లాను.
అలా చెప్పడం వేరు. ఇది బాగుంది. చేయి అని చెప్పడం వేరు కదా?
నాకు పొగడడం రాదు. ఆయన బాగుంది చేయి అనే చెప్పారు. ఆయనే కాదు, ఈ సినిమాకు నాకు కొరటాల శివగారు కూడా సపోర్టుగా నిలిచారు. ఆయన ఫస్ట్ నుంచి సపోర్ట్ గా వున్నారు. నేను ఫస్ట్ టైమ్ విన్నప్పటికే ఆయన ఇందులో ఎంటర్ అయి, చాలా హెల్ప్ చేసారు. చాలామంది సినిమా నువ్వు చేయి అని కూడా చెప్పారు. ఆయన చాలా సాయం చేసారు ఈ సినిమా విషయంలో.
ఈ సినిమా సక్సెస్ అయితే ఇకపై ఈ పద్దతి అంటే చిరంజీవి గారికి కథ చెప్పడం అదీ ఇలాగే కొనసాగుతుందా?ఏమోనండీ. నేను వర్తమానంలోనే వుంటా. ఏవైనా డవుట్ లు వస్తే అడుగతానేమో? అనుభవం వున్నవారి దగ్గరకు వెళ్లడంలో తప్పులేదు కదా?
అదికాక, మెగా ఫ్యామిలీ పెద్దలుగా మిమ్మల్ని నిల్చో పెట్టాల్సిన బాధ్యత, మోరల్ సపోర్ట్ ఇవ్వడం వుంటుంది కదా?
బాధ్యత వుండదు. మోరల్ సపోర్టు వుంటుంది. బాధ్యత నాది. నా కెరీర్ నా బాధ్యత.
ఎంతయినా మేనమామలు కదా.
అవును. అంతమాత్రం చేత నన్ను గైడ్ చేయండి అంటూ పదే పదే ఇబ్బంది పెట్టలేం కదా. నేను చేసే సినిమాలు, నేను జాగ్రత్తపడాలి. ఆ భారం కూడా వాళ్ల మీద వేయడం తప్పుకదా?
మీరు నేర్చుకున్న పాఠాల ప్రకారం, అన్ని సినిమాలకు ఒకే తరహా తప్పు జరిగిందా? వేరు వేరుతప్పులు జరిగాయా?డిఫరెంట్ డిఫరెంట్ మిస్టేక్స్. కొన్నిసార్లు నేను అమెచ్యూర్ గా బిహేవ్ చేసాను. కొన్నిసార్లు నా ఎర్లీ స్టేజ్ లో మొహమాటానికి ఓకె చేసినవి చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు సగం కథ విని, కొన్నిసార్లు డెవలప్ చేస్తారనుకుని, ఇలా ఒక్కోసారి ఒక్కోటి. ఇక ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఫినిష్ అయ్యేంత వరకు అస్సలు ఒకె చెప్పదలుచుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి అయ్యాక, నాకు గట్టి సంతృప్తి కలిగితేనే ముందుకు వెళ్తాను. ఇప్పుడు నేను స్క్రిప్ట్ నచ్చకపోతే నో అనడం నేర్చుకున్నాను.
మరి చిత్రలహరి విషయంలో మీకు సంతృప్తినిచ్చిన పాయింట్?
కిషోర్ తిరుమల. అతను తయారుచేసిన స్క్రిప్ట్, నా పాత్రను డిజైన్ చేసిన తీరు. నేను కొంచెం లావుగా వుండి, డబుల్ ఎక్స్ ఎల్ షర్ట్ లు వేసుకుని, లూజర్ అంటే ఎలా వుంటాడో అలా. చూసిన వెంటనే లూజర్ అనేట్లు అనిపించేలా? అలా స్క్రిప్ట్ మొత్తం డిజైన్ చేసాడు.
ట్రయిలర్ లో డైలాగు మీ మీద మీరే వేసుకున్నట్లు
అవును. టీజర్ లో కూడా. నా మీద నేను జోక్స్ వేసుకున్నా ఫీలవను.
కాస్త నోటెడ్ హీరోయిన్లను తీసుకుని వుంటే బాగుండేదేమో?
లేదు.. ఆ క్యారెక్టర్లను బట్టి, పక్కాగా సూట్ అయ్యే వాళ్లను తీసుకున్నాడు కిషోర్.
దేవీశ్రీ మ్యూజిక్ అన్నది మీ ఛాయిస్ నా
కాదు, కిషోర్ మొదటి నుంచీ దేవీతోనే చేస్తున్నాడు. ఈ సినిమాకు నాలుగు అద్భుతమైన పాటలు ఇచ్చాడు. బ్యూటిఫుల్ ఆర్ ఆర్ కూడా.
గ్లాస్ మేట్స్ పాట కో ఇన్సిడెంట్ నా? కావాలనా?
ఈ ప్రాజెక్టు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ప్రారంభంలోనే డైలాగ్ వెర్షన్, పాటలు, క్యారెక్టర్లు అన్నీ చెప్పేసాడు. మేము ఈ పాట ప్లాన్ చేసేసరికి జనసేన పార్టీ సింబల్ ఇంకా రానే లేదు. జస్ట్ కో ఇన్సిడెంట్. ఏదో కావాలని చేసింది కాదు.
అందరూ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లి వచ్చారు. మీరేం వెళ్లలేదు.
నేను ఎప్పుడు ఆయనతోనే వున్నా. కాంపెయిన్ కు రావద్దన్నారు.
కాంపెయిన్ కాదు. ఆయనను అందరూ వెళ్లి కలిసి వచ్చారు కదా?
నేను వెళ్లానండి. అయితే పబ్లిసిటీ చేసుకోలేదంతే. ఓసారి వెళ్లాను, కలిసాను. చెబుతున్నాను కదా, ప్రచారం చేసుకోలేదంతే.
ఈ నెలలో మీరు, వచ్చే నెలలో మీ బాబాయ్ సక్సెస్ కొడతారన్నమాట.
అంతా దేవుడి దయ. సినిమా 12న విడుదలై క్రిటిక్స్, ప్రేక్షకులు బాగుందంటే. అప్పుడు. గాడ్స్ బ్లెస్సింగ్స్, పీపుల్స్ బ్లెస్సింగ్స్.
మారుతి సినిమాకు డిఫరెంట్ మేకోవర్ వుంటుందా?
డెఫినెట్లీ. ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ ప్రకారం. ఫిజిక్ కూడా సన్నగా వుండాలి. ఈ క్యారెక్టర్ కు ఇలా లావుగా వుండాలి. ఏదయినా డైరక్టర్, క్యారెక్టర్ బట్టే.
కానీ బయట మాత్రం, సాయిధరమ్ తన ఫిజిక్ మీద దృష్టి పెట్టడు. మంచి బట్టల మీద దృష్టి పెట్టడు అన్న టాక్.
నా కంఫర్ట్ ఎలా వుంటుందో అలా వుంటాను. ఉగాది పంచె కట్టుకుని వున్నాను. మమ్మీ బాగుంది అన్నారు. అలాగే వెళ్లిపోయాను. ఫ్యాన్స్ మంచి క్యారెక్టర్ల కోసం చూస్తారు.
తేజు పార్టీల్లో పబ్ ల్లో ఎక్కువగా ఎందుకు కనిపించడు.
నాకు ఇష్టం వుండదండీ. ఇంట్లోనే వుంటాను ఎక్కువగా. ఆదివారం మాత్రం క్రికెట్. నా బ్యాచ్ ఒకటి వుంది. మార్నింగ్ ఆరున్నర ఏడుకల్లా గ్రవుండ్ లో వుండాల్సిందే. మరే పని అయినా మార్నింగ్ 7 లోపు ఫినిష్ చేసేస్తాను. అది మాత్రం మస్ట్. అంతకు మించి ఈ పార్టీలు అవీ పెద్దగా ఇష్టపడను.
చిరంజీవి గారికి సినిమా చూపించారా?
లేదండీ. ఆయన ఈ మధ్యే జపాన్ నుంచి వచ్చారు. ఆయనకు వీలయితే, ఫ్యామిలీతో కుదిరితే 11 సాయంత్రం చూపించాలని వుంది.
మరోసారి మీరు స్టేజ్ మీద మీ వైఫల్యాల గురించి మాట్లాడే పరిస్థితి రాదని, చిత్రలహరి హిట్ కావాలని కోరుకుందాం.
హోప్ ఫుల్లీ. భగవంతుడి దయ. ప్రేక్షకుల అభిమానం.
-విఎస్ఎన్ మూర్తి.